ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ను నాగర్ కర్నూలు జిల్లా నార్లపూర్ వద్ద ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల, మైసిగండి, కర్కల్ పహాడ్, కోనాపూర్ గేట్, విఠాయిపల్లి, ఆమనగల్లు మీదుగా తెలంగాణ ప్రగతిరథం లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కాన్వాయ్ ల తో తరలి వెళ్లారు. ఆమనగల్లు కడ్తాల్ మండలంలోని బిజెపి, ఏబీవీపీ, బీజేవైఎం, అంగన్వాడి టీచర్లు, ఆయా ల ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని తలకొండపల్లి, ఆమనగల్లు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అడుగడుగునా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. పోలీసులు భద్రత మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ నార్లాపూర్ చేరుకుంది.