వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
గరిడేపల్లి (సూర్యపేట), జూన్ 2, (ప్రజాతంత్ర విలేకరి) : ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రజల అభిమానంతోనే తోనే 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను అన్నారు. నడిచింది నేనే అయినా నడిపించింది మీ చిరునవ్వులే అని అన్నారు.పాలకులు తెలంగాణ ప్రజలకు సమస్యలు లేవని అబద్ధాలు చెప్తున్నారని ప్రజలు సమస్యలను అధికార పార్టీ గుర్తించడం లేదని ఆమె అన్నారు. తమ పాలన అద్భుతంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని, సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపేందుకు రాజన్న బిడ్డ పాదయాత్ర చేస్తుందన్నారు.మీకు దమ్ముంటే నాతో ఒక్క రోజు కలిసి పాదయాత్ర చేయండి అని సవాలు విసిరారు. సమస్యలు లేక పోతే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానని, సమస్యలు ఉంటే రాజీనామా చేసి దలితున్ని ముఖ్యమంత్రి చేయాలని దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలన్నారు. తెలంగాణ లో సమస్యలు లేని గడప లేదని, సంక్షేమ పథకాలు పెట్టి వాటిని బ్రహ్మడంగా వైఎస్సార్ అమలు చేసి చూపించాడని, ముఖ్యమంత్రి అంటే మాట మీద నిలబడే వైఎస్సార్లా ఉండాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయిన ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. తెలంగాణ వచ్చాక కుటుంబం మొత్తం కొడుకు,కూతురు అల్లుడు అందరూ పదవులను పంచుకొని కుటుంబ పాలన చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రికి కళ్ళు కనబడటం లేదన్నారు. వరి వేసుకుంటే ఉరి అనే సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు ఉండరన్నారు.కేసీఅర్ కు అసలు పరిపాలన చేతకాదు చేతకాదని, ఫామ్ హౌజ్ లో పడుకోవడం మాత్రమే తెలుసు అన్నారు. పాలక పక్షం నిద్రపోతుంటే , ప్రతిపక్షాలు మాత్రం ప్రశ్నించకుండా గుడ్డి గుర్రాలకు పల్లు తోముతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు కూడా కేసీఅర్ సంకన ఎక్కారని, కేసీఅర్ 70 వేల కోట్లు కాళేశ్వరంలో కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. పోలీస్ సిబ్బందిని పనోళ్లలా వాడుకుంటున్నారని, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పాలక పక్షానికి అండగా ఉంటున్నారని ఆమె అన్నారు.
అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతుంటే పోలీస్ లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదని ఆమె అన్నారు. హైదరాబాదులో నడి రోడ్డు మీద మైనర్ పై అత్యాచారం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రజా స్వామ్యం కాదని, తాలిబన్ల రాజ్యం అని ఆమె అన్నారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఅర్ చేతిలో పెడితే 4లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాడని ఆమె అన్నారు. ప్రజల కోసం పని చేసే వారికి, ప్రజల కోసం సేవ చేసే వారికి ఓటు వెయ్యాలని ఆమె కోరారు. వైఎస్సార్ మనసు ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకు ఓటు వేశారని, నేను వైఎస్సార్ బిడ్డను, వైయస్సార్ పేరును నిలబెడతానన్నారు. ప్రతి వర్గానికి మేలు చేసేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని, వైఎస్సార్ ను అభిమానించే ప్రతి ఇంటిపై వైఎస్సార్ జెండాను ఎగుర వేయాలని ఆమె కోరారు. రైతు సంక్షేమం ప్రధాన ధ్యేయంగా, ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు, నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాల కల్పన, ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ 3వేలు తక్కువ కాకుండా పెన్షన్, తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు, వైయస్సార్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.