కేంద్రంతో ముదురుతున్న విభేదాలు..

కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.  చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన పథకాలైతేనేమీ, నిధు) విషయంలోనైతేనేమీ ఆంక్షలు విధించడం ప్రారంభించింది. ఇదిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంకటంగా మారింది.  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసినందువల్ల కొత్తగా అప్పులు తీసుకునే అవకాశం లేదని కేంద్రం, ఆర్బీఐలు అభ్యంతరం చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సాధారణ రెవెన్యూ ఖర్చులతోపాటు  ఇప్పటికే చేపట్టిన పలు సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పటినుండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పథకాలను కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్పోరేషన్‌ అప్పులను పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా, గడచిన రెండేళ్ళ కాలంలో తీసుకున్న రుణాలను కూడా లెక్కిస్తామని కేంద్రం మెలికపెట్టింది. సెక్యూరిటీ బాండ్లను వేలంలో అమ్ముకునే  అవకాశంకూడా లేకుండా ఆంక్షలు విధించడంతో తెలంగాణ సర్కార్‌ ‌తీవ్ర ఆర్థిక వొత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవపు ఉద్యోగుల వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. తెలంగాణ ఆర్థిక పుష్టిగల రాష్ట్రంగా ఇంతకాలం చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఈ పరిస్థితి సవాల్‌గా మారింది.  ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా  ఉండేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కేంద్రం నుండి అందాల్సిన నిధుల విషయంలో మంతనాలు చేస్తూనే ఉంది. అయినా లాభంలేకుండా పోయింది.

చివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన యుద్దం ప్రకటించింది. ఆ కారణంగానే  కేంద్రం రాష్ట్రానికి అందాల్సిన నిధుల విషయంలో మెలిక పేచీలు పెడుతున్నదంటున్నారు రాష్ట్ర నేతలు. తాజాగా ఆర్థిక వెసులుబాటు కోసం గత రెండు నెలలుగా అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వంతోనూ, ఆర్బీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా గడచిన నాలుగు రోజులుగా రాష్ట్ర ఆర్థిక అధికారుల బృందం దిల్లీ లో   మకాం వేసి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా తెలుస్తున్నది. ఈ విషయంవల్లే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన పదిరోజుల దేశాటనను అర్థాంతరంగా ముగించుకుని హైదరాబాద్‌ ‌చేరుకోవడానికి కారణంగా భావిస్తున్నారు.  ఈ నెల 20న దిల్లీ  చేరుకున్న ముఖ్యమంత్రి 30వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలను పర్యటించాల్సి ఉండింది. కాని సోమవారం సాయంత్రమే ఆయన తన టూర్‌ను అర్థాంతరంగా ముగించుకుని రావడం వెనుక ఆర్థిక పరిస్థితులేనంటున్నారు. అయితే ఏదో విధంగా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రజలపైన అదనపు పన్నుల రూపంలో మరింత భారం మోపే అవకాశాలున్నాయని అర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు.

జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలవుతున్న విధానానికి ప్రత్యమ్నాయంగా ప్రత్యేక ఎజండాను రూపొందిస్తామని గత కొంతకాలంగా సిఎం కెసిఆర్‌ ‌చెబుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆయన  దేశ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మొదటి మూడు రోజుల పర్యటనతోనే బ్రేక్‌ ‌పడింది. హుటాహుటిని రాష్ట్రానికి రావాల్సి వొచ్చింది. దీంతో 26న బెంగుళూరుకు వెళ్ళి  జెడిఎస్‌ ‌నేత, మాజీ ప్రధాని దేవెగౌడను, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలివాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. అలాగే 27 రాలెగావ్‌ ‌వెళ్ళి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో మాట్లాడి, షిర్డీ వెళ్ళాల్సి ఉంది. అనంతరం హైదారాబాద్‌ ‌వొచ్చి తిరిగి 29, 30 తేదీల్లో  మళ్ళీ బెంగుళూరు, బీహార్‌ల్లో పర్యాటించాల్సి ఉండగా అవన్నీ వాయిదా పడ్డాయి. అయితే మొదటి మూడు రోజుల పర్యటనలో  యుపి ప్రతిపక్ష నేత, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌తో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు.

అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్‌ ‌గులాటితో ఆ రంగంపైన విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్‌ అధికారులను, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్‌రాయ్‌ ‌తదితరులను కలవడమైంది. అయితే దేశ రాజకీయాలకన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో ప్రస్తుతానకి తన మిగతా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో చేపట్టిన అనేక ప్రాజక్టులు నిధులులేక నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే మరో నాలుగు రోజుల్లో ఉద్యోగాలకు వేతనాలు అందించాల్సిఉంది. దీనికితోడు రోజువారి పరిపాలనా ఖర్చులు సమకూర్చుకోవాల్సి రావడంతో, రాష్ట్ర మంత్రివర్గంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆయన తన పర్యటనను ప్రస్తుతానికి రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page