కేంద్రం సమస్యను సృష్టిస్తుంది.. రాష్ట్రం అలసత్వం వహిస్తుంది

గెజిట్‌ను కేంద్రం విత్‌ ‌డ్రా చేసుకోవాలి
తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో తీర్మానం

నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణులు న్యాయశాస్త్ర కోవిదులు మాడభూషి శ్రీధర్‌ అన్నారు. నదీజలాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. రాష్ట్ర జాబితాలోని నీటిని స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు రాష్ట్రాలదన్నారు. కృష్ణా గోదావరి నదుల కింద ఉన్న ప్రాజెక్టులను కేంద్రం స్వాధీనం చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలలో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. జూలై 15 2021లో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌తర్వాత ఉన్న ప్రాజెక్టులను కట్టనిస్తారా.. కొత్త ప్రాజెక్టులకు అనుమతిస్తారా..లేదో అంతు చిక్కడం లేదన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు తలెత్తితే ట్రిబ్యునల్‌ ‌పరిష్కరించాలే తప్ప కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీలులేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వారన్నారు. ఈ దేశంలో నదీజలాల విషయంలో సమస్య వొస్తే బోర్డులు పరిష్కరిస్తాయే తప్ప ఆ నదీ జలాల కింద ఉన్న ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకున్న దాఖలాలు ఇంతవరకు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇది కేంద్రం తీసుకున్న దారుణమైన నిర్ణయమని రాష్ట్రాల హక్కులను కాలరాయడమే ఇందులో భాగం ఉన్నారు. జూలై 15 2021లో కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌వొస్తే ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను తీసుకోవడం లేదంటే రాష్ట్ర ప్రజల హక్కులను కేంద్రానికి బలి పెట్టడమే అని వారన్నారు. తక్షణమే గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణను రూపొందించుకోవాల్సిని అవసరం ఉందన్నారు.

నదీజలాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సమానత్వపు హక్కుకు విరుద్ధం : కె రామచంద్రమూర్తి, సీనియర్‌ ‌పాత్రికేయులు
కృష్ణా గోదావరి నదులకు ఎగువన ఉన్న రాష్ట్రాలలో ఏ విధమైన ఆధిపత్యం చలాయించకుండానే దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌యొక్క నది హక్కులను కేంద్రం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుద్ధమని ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా కేంద్రం జోక్యం ఏమిటి.? : కె శ్రీనివాస్‌ ‌రెడ్డి, ప్రముఖ పాత్రికేయులు గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రాల నదీజలాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రముఖ పాత్రికేయులు కే శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి కూర్చున్నదే తప్ప కార్యచరణ తీసుకోలేదన్నారు. కేంద్రం విడుదల చేసిన ఈ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌వ్యతిరేకంగా పోరాడాల్సి అవసరముందన్నారు.

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పెత్తనం ఏందీ..? : ప్రొ।। కోదండరామ్‌, ‌టిజెఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో కేంద్రానిది మితిమీరిన జోక్యమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. నదీజలాల విషయంలో కేంద్రానికి నియంత్రించే అధికారం ఉందే తప్ప పెత్తనం చేసే అధికారం లేదని వారన్నారు. కేంద్రానికి లేని అధికారానికి గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ఇచ్చిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ఆయన అన్నారు. ఇదే గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ అమలైతే ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు కేంద్ర ప్రాజెక్టులుగా మారిపోతాయన్నారు. ఇప్పటివరకు నీటి కేటాయింపులు చేసే అధికారం ట్రిబ్యునల్‌కు ఉండేదని..రాబోయే కాలంలో ఆ అధికారం వాటికి ఉండబోదని ..ఇదే తంతు కొనసాగితే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ముప్పై మూడు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని ఎవరు పూర్తి చేస్తారని కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావడం అసాధ్యం : శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌రెడ్డి, రిటైర్డ్ ఇం‌జనీర్‌
‌కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ అమలైతే నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బిసి, ఉదయ సముద్రం ప్రాజెక్టుల లాంటివి పూర్తి కావడం అసాధ్యమని రిటైర్డ్ ఇం‌జనీర్‌ ‌శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌రెడ్డి అన్నారు. వరద నీటి కోసం కట్టుకుంటున్న ప్రాజెక్టు అనుమతులు నిలిపివేయడం కేంద్రం యొక్క దుర్మార్గ బుద్ధి అన్నారు. కేంద్రం సూచన మేరకుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సుప్రీమ్‌ ‌కోర్టులో వేసిన ట్రిబ్యునల్‌కు సంబంధించిన దావాను విత్‌ ‌డ్రా చేసుకున్నప్పటికీ, నేటికీ కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయలేదంటే తెలంగాణ గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతుందన్నారు.

గెజిట్‌ ‌నోటిఫికేషన్‌కు కారణం..రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వమే : డి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇం‌జనీర్‌
‌తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఏ ఒక్క ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి చేయలేదని రిటైర్డ్ ఇం‌జనీర్‌ ‌లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన అలసత్వమే కేంద్రం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయడానికి కారణం అయిందన్నారు. ఏనాడు కూడా నదీజలాల విషయంలో తెలంగాణ రాష్ట్రం ..ట్రిబ్యునల్లో గాని, బోర్డులో గాని తమకు దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి కొట్లాడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం 300 టీఎంసీల నికర జలాలను, 220 టీఎంసీలు మిగులు జలాలు, మొత్తంగా 520 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా నేటికీ 270 టీఎంసీలు కూడా దాటలేదన్నారు. నదీజలాల విషయంలో ఇదీ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్పష్టత అన్నారు.

కృష్ణానదిని రాయలసీమకు అప్పజెప్పే చర్యలను వ్యతిరేకిద్దాం : అంబటి నాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు
పోలవరం ముంపు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ‌తోనే ఆంధ్రాలో కలపడం మూలంగా తెలంగాణపై పెత్తనం ప్రారంభమైందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు. నదీజలాల విషయంలో బేసిన్‌లు లేవు..బేషజాలు లేవు అన్న ముఖ్యమంత్రితో కలిపి ఉద్యమాలు చేయలేమని.. కృష్ణా నదిని రాయలసీమకు అప్పజెప్పే చర్యలను ప్రారంభించాడని వారన్నారు.

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విద్యావేత్త ఎంవి గోనా రెడ్డి సమన్వయం చేయగా..కార్యక్రమంలో ఫోరం చైర్మన్‌ ‌రణదీప్‌ ‌రెడ్డి, ఇండియా అధ్యక్షులు రాజారెడ్డి, డిపి రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్‌ ‌చొల్లేటి ప్రభాకర్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌ ‌నాయక్‌, ‌సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం, టిడిపి బాధ్యులు తుమ్మల మధుసూదన్‌ ‌రెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద్‌, ‌సిపిఎం పార్టీ బాధ్యులు తుమ్మల వీరారెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు హరిందర్‌, ‌తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ప్రముఖ న్యాయవాదులు జి. వెంకటేశ్వర్లు, రియాజుద్దీన్‌, ‌జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్‌ ‌రెడ్డి, శ్రీధర్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, పల్లా దేవేందర్‌ ‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌ ‌కుమార్‌, ‌డాక్టర్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి, ఇసిహెచ్‌ ‌గురువయ్య, అనంత రెడ్డి, సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page