తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా తాముచెప్పిందే నూరుశాతం జరుగుతుందంటూ డంబాచారం చేస్తున్నారు. అదే పనిగా ఆ వార్తా కథనంపై రోజంతా చర్చ, మర్నాటికి మరో కొత్త పోస్టు, దానిపై విశ్లేషణ. ఇలా ఫోకస్ అంతా అన్ని పార్టీలు కాకుండా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్, ఆ పార్టీ అభ్యర్థులపైనే ఉన్నది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు చాలా టైట్ ఫైట్ నడుస్తున్నదని ఒకాయనంటారు.
ఎందుకయ్యా అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కేసీఆర్ చరిష్మా తగ్గిందని ,అభ్యర్థుల ఆగడాలు భరించలేక మార్పు కోరుకుం టాన్నారని, ప్రజలంతా గంపగుత్తగా తిరుగుబాటు చేస్తున్నారని,ఇక సందులో సడేమియా అన్నట్లుగా ఫలానా కులానికి టికెట్ రానందున ఈ సారి పార్టీకి మద్దతు పలుకడం లేదని, జనసమితి, సిపిఐ, వైఎస్సార్టీపి మద్దతు కల్సివస్తుందని కాకిలెక్కలు చెప్పుతున్నారు. అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను నెరవేర్చలేదని,అందువల్లే కేసీఆర్ గెలుపు కష్టసాధ్యమంటూ కుహనా మేదావులు విశ్లేస్తున్నారు. అసలు నెరవేర్చని హామీలు ఏంటయ్యా? అంటే పొంతన లేని సమాధానం చెప్పకుండా కుప్పిగంతులు వేస్తున్నారు.మేధావుల పరిస్థితే గందరగోళంగా ఉన్నప్పుడు ఇతరులను నిందించడం ప్రయోజనం కాదేమో.తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు.బీఆర్‌ఎస్ పార్టీకి పొరుగు రాష్ట్రాలనుండి,ఢల్లీినుండి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదు.రాష్ట్రంలో మొత్తం 95 నియోజకవర్గాల్లో ఉద్యమబిడ్డగా,పాలనాదక్షుడుగా కేసీఆర్ హుస్నాబాద్ తో ప్రారంబించిన ప్రచారం గజ్వేల్ సభతో ముగుస్తుంది. బీఆర్‌ఎస్ విజయం లాంఛనమే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా, ఆర్థికపరిపుష్ఠి లభించేలా అనేక పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది.ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపితం చేసింది. రైతన్నను అక్కున చేర్చుకుంది. పేదల ఇంటికి ఆడపడుచులకు పెద్దన్నగా, పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలకు మేనమామగా, ముసలవ్వలకు పెద్దకొడుకుగా కేసీఆర్ తనదైన శైలిలో సేవలందిస్తూ పర్మినెంట్ ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు.అదేగాక సంప్రదాయ ఓటుబ్యాంక్, ఆయా కులవృత్తుల,చేతివృత్తుల లబ్ధిదారుల ఓటు బ్యాంక్ ఇప్పటికే ఉంటుంది.అభ్యర్థి ఇష్ట,యిష్టాలు ప్రత్యర్థులు ఎంతబలమైన వాడు, వాడి చరిత్ర మంచి, చెడులుంటాయికదా? ఇంకా పార్టీల అధినాయకత్వం విశ్వసనీయత అన్నదీ ప్రధానంగా ఉంటుంది.ఆ పార్టీ గతంలో ఏంచేసింది? వర్తమానంలో నడవడిక , భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందన్న విషయంలో ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు.ఇవన్నీ కూడా అభ్యర్థి గెలుపు, ఓటమిలను నిర్దారించే అంశాలే.డబ్బా సర్వేలు వితండ విశ్లేషణ చేసినా ఎందుకు గెలవదని మాత్రం ఎక్కడ చెప్పలేక పోయారు.ఎందుకంటే గ్రామీణ అర్ధిక వ్యవస్థను, నగర ఆర్థిక వ్యవస్థనూ సమాంతరంగా అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించి నడిపించిన నాయకుడు నిస్సందేహంగా కేసీఆరే.రాబోయే ఎన్నికల్లో గెలిచేదీ,ప్రజల పక్షాన నిలిచేది కేసీఆర్.స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూసారు.కాంగ్రెస్,బీజేపీలపై ఆశలు నీరుగారిన సమయంలో పెద్దదిక్కుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిలబడ్డారు.కనీస అవసరాలు తీర్చాలంటే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకత్వం అవసరం.బీఆర్‌ఎస్ బలం,వ్యూహం రెండు కేసీఆరే.బలానికి,వ్యూహం తోడైతే ఎంతనేర్పరితనమైన దిగదుడుపే.
ఉద్యమ సమయంలో ఎగతాళి చేసిన వ్యతిరేకశక్తులతో తెలంగాణ మరోసారి ఆత్మగౌరవ పోరాటం జరుపుతున్నది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులన్నీ ఏకమై మరోసారి తెలంగాణను మోసం చేసేందుకు కల్సి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణ సాకారమైనా, ఇప్పటికి ఇది నిజమేనా అనిపించేంత ఆశ్చర్యం.ఇప్పుడు మళ్ళీ అవేపాత్రలు వేర్వేరు డైలాగులతో వేర్వేరు వేషాలతో మరోసారి తెలంగాణపై దండయాత్రకు వస్తున్నాయి.కాంగ్రెస్,బీజేపీ రెండు బక్కపలచని కేసీఆర్ ను ఓడిరచడానికి ఒకరు కామారెడ్డి,ఒకరు గజ్వేల్ కేంద్రంగా ఇరువైపులా చక్రం తిప్పుతున్నారు. ఉప్పు,నిప్పు లాగా ఉన్న రెండు పార్టీలు ప్రణాళిక ప్రకారం కల్సి సాగుతున్నారు.శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరంటే గిదేకావచ్చు.అధికారంలోకి రావడమే లక్ష్యంగా విమర్శలు,రాజకీయ స్వప్రయోజనాలే పరమావధిగా భావించేవారు ఆవలివైపు నిలిచారు.తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్ 2014, 2018 ఎన్నికల్లో అతిగా ఉహించుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుకు తలకిందులైంది.మూడవసారి విజేత ఎవరో తెలంగాణ ప్రజలు తెల్చే సమయం ఎంతోదూరంలోలేదు. గత నెలరోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలలో తెలంగాణ వ్యతిరేకశక్తులన్నీ ఏకమై రకరకాల కథనాలు రాస్తున్నాయి. పోనీ వాండ్ల ప్రచారానికి హేతుబద్దత ఉన్నదా? అంటే ఎంతమాత్రం కన్పించదు.సెఫాలజిస్టులు, ఫ్రీపోల్,ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తుంటారు.వారు కొన్ని శాంపిల్స్ తీసుకోని ఒక అంచనాకు వచ్చి ఫలానా కారణంగా అటు, ఇటుగా భ్రమలు కల్పిస్తారు.అప్పటికి తమ అంచనాల్లో ఐదు శాతం మీదికి,కిందికి ఎర్రర్ ఉంటుందని నమ్మబలుకుతారు. అయితే వాండ్లకు తెలియనిది ఏమిటంటే కేసీఆర్ గురించి కానీ, బీఆర్‌ఎస్ గురించి కానీ అంచనా వేసేటప్పుడు ఈ హేతుబద్దత గురించి ఆలోంచించకపోతే కచ్చితంగా తప్పుచేసినట్టే. 76 సంవత్సరాలుగా కాంగ్రెస్,బీజీపీ పరిపాలనను చూసిన ప్రజలు ఉద్యమ పార్టీకే మళ్ళి పట్టం కడుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.కేసీఆర్ జైత్రయాత్ర కొనసాగింపుకోసం స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ ప్రజలే బాధ్యత తీసుకున్నారనేది జగద్విదితం.
-డా.సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్, 9866255355