‘కాళేశ్వరం’ పై లక్ష కోట్ల దుర్వినియోగం..దఅవినీతిలో కేసీఆర్ భాగస్వామి
బ్లాక్ మెయిల్ చేసి బతకాలని యత్నం
9 ఏళ్లకు నల్గొండ బాధితులు గుర్తుకు వొచ్చారా..
బిజెపి, టీఆర్‌ఎస్‌లది ఒకే విధానం…
మేడిగడ్డ సందర్శనలో మీడియాతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలు వెల్లడిరచాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. మంగళవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, సిపిఐ, ఎంఐఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ 19, 20, 21 కుంగిన పిలర్లలను, బీటలు వారిన ప్రదేశాలను వారు పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ శాఖచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా లక్ష కోట్ల దుర్వినియోగంలో దోషిగా నిలబడతారని కెసిఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పలు అనుమానాల నివృత్తికి తమతో సందర్శనకు కెసిఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. మేడిగడ్డ ఆగమయిం దని, అన్నారం, సుందిళ్ల సున్నాగా మారాయని, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌కు వాటా ఉందని సిఎం ఆరోపించారు. బ్యారేజ్ కుంగుబాటుబాటుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనను పోలీసు నిర్బంధంతో ఆపినా కూడా రాహుల్ గాంధీతో కలిసి ఆరోజు సందర్శించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో లోపాలను బయట పడకుండా పోలిసు వారితో రాకపోకలు నిలిపివేశారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనలతో తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చ చేపడతామనున్నామని వెల్లడిరచారు. ప్రజల ముందు అవినీతి పరునిగా నిలుస్తానని, కృష్ణా జలాలపై నల్లగొండలో కేసిఆర్ సభ పెట్టారని విమర్శించారు. నల్లగొండ సభలో సత్య హరిచ్చంద్రుడి లాగా కేసిఆర్ మాట్లాడుతున్నారని, సావు నోట్లో తల పెట్టిన అని లక్ష ఒక్క సారి అబద్ధం చెప్పాడని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజక్ట్‌లపై తీసుకువచ్చిన విధానాలు తిప్పి కొట్టాలంటే మాట్లాడడానికి కెసిఆర్ శాసనసభకు ఎందుకు రాలేదని నిలదీశారు. కాళేశ్వరంపై అనుమానాలను నివృత్తి చేయడానికి మేదిగడ్డకు రమ్మని ఆయనను ఆహ్వానిచ్చామని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రజా కోర్టులో చర్చించుకుందామంటే కాలు విరిగిందనీ రాలేదని, కాలు విరిగితే నల్లగొండ సభకు ఎలా వెళ్ళారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన దోపిడీని కప్పి పుచ్చుకోవడానికి నల్లగొండ సభ పెట్టారని, తప్పులకు పాల్పడే వారికి ఎలాంటి తప్పులు కనపడవని అన్నారు. మేడిగడ్డ ఆగం అయ్యింది, అన్నారం సుందిల్ల సున్నం అయిపోయాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ తీర్మానంలో లోపాలుంటే మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానానికి హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారని నిలదీశారు. ఉద్యమ కారునివని, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయన శాసన సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో కేసిఆర్‌కు వాటా లేకపోతే ఎందుకు ఇంత వరకు ప్రాజెక్ట్‌పై మాట్లాడ లేదన్నారు. కాళేశ్వరం సమస్యను తప్పు దోవ పట్టించడానికి నల్లగొండలో సభ ఎర్పాటు చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడ లేదని, కెసిఆర్ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన నిజాలను కళ్ళకి కట్టినట్టు చూపించడానికి తాము ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కెసిఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వొచ్చి వారి సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ సూచించారు. కృష్ణా నది జలాలలో ఏనుగు పోయింది తోక మిగిలిందని, పొరపాట్లకు కేసిఆరే కారణమని అన్నారు. నీళ్ళు నింపలేదు కాబట్టి మేడి గడ్డ బ్యారేజ్ నిలిచి ఉందని, నీళ్ళు నింపితే ఎప్పుడు కుప్ప కూలిపోతుందో తెలియదన్నారు సిఎం. కేసిఆర్ చేసిన తప్పిదాలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, కేసిఆర్ బుధవారం అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై, కృష్ణా నది జలాలపై వారి సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.