*మాక్ డ్రిల్ అంటున్న అధికారులు..!
ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయనీ..11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అని వార్తలు వచ్చాయి. _ఐదారు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని పరిశీలించారు. అయితే, అగ్ని ప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. కేవలం మాక్ డ్రిల్ అని చెబుతున్నారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. దాంతో, జరిగింది అగ్నిప్రమాదమా? కాదా? అనేది తెలియడం లేదు. దట్టమైన పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.సచివాలయ సమీపంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. ప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఏ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయనే దానిపైనా స్పష్టత లేదు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు.
వాస్తవాలను దాచే ప్రయత్నం…: రేవంత్ ట్వీట్
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేయడం తప్పు..అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.కేసీఆర్ జన్మదినం రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది..అని పేర్కొంటూ ఆయన జన్మదినం రోజు ప్రారంభించడానికి ఇదేమైనా రాచరికమా? అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి..అని డిమాండ్ చేసారు.