- ఖండించిన ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్
- భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ..మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం
- ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు
షిరిడీ (మహారాష్ట్ర), ప్రజాతంత్ర ఇంటెర్నెట్ డెస్క్ , మార్చి 2 : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్త కోర్కెల దినాన్ని పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రం షిరిడీ లోని యాపిల్ సాయి రెసిడెన్సీలో శనివారం ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్ర స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆతిధ్యంలో రెండురోజుల పాటు జరగనున్న సమావేశాలకు ఐజేయూ అధ్యక్షుడు, తెలంగాణా మీడియా అకాడమీ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు.
దేశంలో జర్నలిస్టులు ఎదుర్కుంటున్న పలు తక్షణ సమస్యలను సమావేశంలో చర్చించారు. దేశంలో మీడియా సిబ్బంది స్థితిగతులు దిగజారి పోవడం పై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక చట్టం చేయాలని, జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల వేతన సవరణకు తక్షణం వేజ్ బోర్డును నియమించాలని, మీడియా రంగంలో వేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో మీడియా స్వరూప స్వభావాలను అధ్యయనం చేయడానికి ఎలాంటి తాత్సారం చేయకుండా వెంటనే మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఐజేయూ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.ఆమేరకు పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది.
ఐజేయూ పూర్వాధ్యక్షుడు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మీడియా , అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మీడియాపై పెరుగుతున్న దాడులకు కేవలం రాజకీయ నాయకులను, పార్టీలను తప్పు పడితే సరిపోదని, వార్తలను వక్రీకరించి, తప్పుడు వార్తలు రాస్తున్న పత్రికా యాజమాన్యాల వైఖరులను కూడా ఖండించాలని అన్నారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయడానికి కృషి చేసిన మహారాష్ట్ర రాష్ట్ర యూనియన్ , షిరిడీ ప్రెస్ క్లబ్ బాధ్యులను సమావేశంలో సత్కరించారు.