క్షేత్ర స్థాయిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు

గణేష్ ఉత్సవ ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేసిన మేయర్

రానున్న గణేష ఉత్సవాల  నిర్వహణకు, నిమజ్జనానికి అవసరమైన ఆయా  ఏర్పాట్లను ముందస్తు ప్రణాళిక తో పూర్తిచేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులకు ఆదేశించారు.గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శేరిలింగంపల్లి జోన్ లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో పర్యటించి శానిటేషన్ పరిస్థితిని, రోడ్ల స్థితిగతులను, చెరువులను తనిఖీ చేసి ఆయా అధికారులకు  పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 7 నుండి 17 వరకు గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా ఆయా అధికారులు సమన్వయంతో ముందస్తు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని, ఎలాంటి ఫిర్యాదులు రావద్దన్నారు.
క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పై నిరంతరం పర్యవేక్షణ చేయాలని శానిటేషన్  అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మల్కం చెరువు, గోపి చెరువు, నల్లగండ్ల చెరువు, రాయ సముద్రం, సాకి చెరువు, గంగారం చెరువు, గౌతమ్ బేబీ పాండ్, కడియం కుంట, దుర్గం చెరువులను, రహదారులను  మేయర్ పరిశీలించారు. సాకి చెరువు వద్ద గల బేబీ పాండ్ ను గణేష్ నిమజ్జనం కొరకు సిద్ధం చేయాలని తెలిపారు. చెరువుల సంరక్షణకు సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. గంగారం చెరువు చుట్టుపక్కల నివాసిత ప్రాంతాల్లో డెంగ్యూ కేసులను గుర్తించడం జరిగిందని, నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ శాఖ అధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికను మేయర్ కార్యాలయానికి పంపాలని తెలిపారు.
గంగారం చెరువులో ఉన్న వాటర్ హై సిల్టింగ్ ను యుద్ధప్రాతిపదికన తొలగించాలని, చెరువు నుండి తీసిన గుర్రపు డెక్క తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని, వారం లోగా పని పూర్తి కావాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. డార్క్ స్పాట్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ర్యాలీ కొనసాగే రహదారులను బాగుండేలా చర్యలు చేపట్టాలని, రోడ్ల పై పాట్ హోల్స్ లేకుండా  వెంటనే పూడ్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గణేష్ నిమజ్జన  ప్రొసీషన్ రూట్లలో బి టి  రోడ్లపై డిడిఏం లేయేర్  పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నిమజ్జన ప్రదేశాల్లో/ ప్రాంతాల్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఖాజాగూడ రోడ్డు వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారికి  నష్ట పరిహారం  చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గోపి చెరువు వద్ద కాలనీలో గల పార్క్ ను శుభ్రం  చేయాలని, సిఎస్ ఆర్ పద్ధతి ద్వారా అరబిందో చెరువు అభివృద్ధికి  ప్రతిపాదనలు పంపాలని సంబంధిత  అధికారులకు సూచించారు. ఆయా ఏరియా కార్పొరేటర్లు సూచించిన అంశాల పై ఫోకస్ పెట్టాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఈ తనిఖీలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మితో పాటు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శానిటేషన్, లేక్స్, ఇంజనీరింగ్, తదితర విభాగాల అధికారులు,  కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, మంజుల రఘునాథ్, శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page