శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర
అన్ని దారులూ ట్యాంక్ బండ్ వైపుకే
భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ
వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని తలపించేలా రంగుల పండగ జరుగుతుందా అన్న రీతిలో భక్తుల కోలాహలం మధ్య దారులన్నీ ట్యాంక్‌బండ్ వైపు సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన గణనాథులతో కన్నుల పండువగా యాత్ర ప్రారంభం అయ్యింది. ఖైరతాబాద్ నుంచి భక్తుల జయజయ ధ్వనుల మధ్య లంబోధరుని శోభాయాత్ర వైభవంగా సాగింది. నిమజ్జనానికి ఈ భారీ గణనాథుడు సిద్ధమయ్యాడు. 10 రోజుల పాటు విశేషంగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణేషుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులతో పాటు దీనిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ట్యాంక్ బండ్‌పై ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైబోలో గణేశ్ మహజరాజ్‌కీ అన్న నినాదాలతో భాగ్యనగరం మార్మోగింది. ఎక్కడ చూసినా కోలాహలం నెలకొంది. సరూర్‌నగర్ చెరువు, సఫిల్‌గూడ చెరువుల్లో స్థానికంగా నిమజ్జనాలు కొనసాగాయి. నగరంలో ఎన్ని పండుగలు జరిగినా… గణేశ ఉత్సవాలు మరింత ప్రత్యేకం. చిన్నాపెద్దా తేడా లేకుండా పాల్గొనడంతోపాటు అధికార యంత్రాంగమంతా అహర్నిశలూ శ్రమిస్తుంది. ఏటా ఉండే వేడుకలే అయినా… ప్రతిసారీ కొత్తగా కనిపించడం నిమజ్జనం ప్రత్యేకత. నగరం, శివారు ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథులను గంగమ్మఒడిలో చేర్చే పక్రియ ఉత్సాహంగా కొనసాగింది. సామూహిక నిమజ్జనం ద్వారా వేడుకల్లో పాల్గొనాలనే సంకల్పం దృఢంగా మారుతుంది. నిమజ్జనంలో పాల్గొనే యువకులు, పిల్లల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. నృత్యాలు, కోలాటాలతో యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కడా..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం నగరమంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ముస్లింలు తమ శుక్రవారపు ప్రత్యేక ప్రార్థనలు దగ్గరిలోని మసీతులో కాని, ఇంట్లో కాని చేసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, పోలీసులు, సిబ్బంది… క్రతువును ప్రశాంతంగా పూర్తయ్యేంత వరకూ రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఘాట్ల దగ్గర జీహెచ్‌ఎంసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుండగా…ఇతర విభాగాలు తామూ గణనాథుడి సేవలో పాల్గొంటున్నాయి. ఏకదంతుడు వేనవేల రూపాల్లో కొలువై …పది రోజుల పాటు ప్రజలందరి గుండెల్లో నెలవై, పూజలందుకుని…మధురమైన జ్ఞాపకాలను పంచి వెళ్తున్నాడు. అంతకు ముందు నగరంలో గణెష్ నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఉత్సవ సమితి సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. మధ్యాహ్నానికి ఖైరతాబాద్ గణెష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలు పడినా అనుకున్న విధంగానే నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. గణెశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. నగరం నలుమూల నుంచి తరలివొచ్చిన్న గణనాథులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ట్యాంక్‌బండ్‌కు చేరుకోవడంతో గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నిమజ్జనం కనులారా వీక్షించేందుకు వేయి కన్నులతో వేచి చూశారు.