- కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
- పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి మండలంలోని విస్నూర్ గ్రామంలో ప్రారంభించి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మహిళల ఆటపాటలతో, కోలాటాలు, భోనాలతో బండి సంజయ్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. నిజమైన తెలంగాణ పోరాట వీరులు పాలకుర్తి ప్రజలన్నారు.పోరాటాలకు పురిటిగడ్డ పాలకుర్తని, నాటి నుంచి నేటి వరకు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగి లాంటి ఎంతో మంది పోరాట వీరులకు జన్మనిచ్చిన గడ్డ అని కొనియాడారు. దేవరుప్పులలో బిజెపి కార్యకర్తలపైన దాడుల చేయించి, పాలకుర్తిలో కర్ఫ్యూ విధించి దుకాణాలను బంద్ చేస్తే మహా సంగ్రామయాత్ర ఆగిపోతుందా అని ప్రశ్నించారు.
పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులకు ఊడిగం చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ప్రభుత్వం బిజెపి దేనన్నారు. దొరల పాలన సాగనంపేందుకు ప్రజలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహించే పాలకుర్తిలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామాలలో జరిగే అభివృద్ది పనులన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17న జరిపితే చరిత్రకారులైన వారందరి పేర్లు ముందుకు వొచ్చి సీఎం కేసీఆర్ పేరు ఉండదని విమోచనదినం జరపడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఒక్కడు కొట్లాడుతే తెలంగాణ రాలేదని, బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో తెలంగాణ వొచ్చిందన్నారు.
1400 మంది అమరులు త్యాగఫలితమే నాటి తెలంగాణ ఏర్పాటయిందన్నారు.రాష్ట్రంలో రామరాజ్యం తీసుకురావడానికే బిజెపి మహాసంగ్రామయాత్ర చేపట్టిందన్నారు.తాను ఎప్పుడు పాలకుర్తి ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.ఆయన వెంట బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు మూర్తినేని ధర్మారావు, బొడిగె శోభ, రుద్రమదేవి, వెంగల్రావు, శ్రీనివాస్‌రెడ్డి, సీనీయర్ నాయకులు మహేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కమ్మగాని శ్రీకాంత్, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.