జెండా ఆవిష్కరణలో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
ములుగు, ప్రజాతంత్ర జనవరి 26 : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములుగులో విషాదం నెలకొంది. శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించేందుకు శివాలయం ఎదురుగా యువకులు సమాయత్తం అవుతున్న క్రమంలో జెండా పైపును అమర్చుతుండగా 11కేవీ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులకు షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ములుగు జిల్లా హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. ములుగులోని శివాలయం ఎదురుగా యువకులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో బోడ అంజిత్ కుమార్(28), ల్యాడ విజయ్ (25), బోడ కళ్యాణ్‌తో పాటు మరికొంత మంది యువకులు కలిసి జెండా కోసం ఇనుక పైపును నిలబెట్టే పనుల్లో ఉన్నారు. అయితే జెండా గద్దె పైనే 11కేవీ విద్యుత్ వైర్లు ఉన్నాయి. వైర్లను గమనించకుండా పైపును పైకి ఎత్తుతున్న క్రమంలో విద్యుత్ తీగలు ఇనుక పైపుకు తగిలి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో అంజిత్, విజయ్, కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని స్థానికులు జిల్లా హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ అంజిత్, విజయ్‌లు మృతి చెందారు. కళ్యాణ్ చేతులకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు యువకులు మృతిచెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, తీవ్ర గాయాలైన యువకుడు కళ్యాన్ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. కాగా, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో విషాదం నెలకొంది.