పటాన్‌చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది ‘ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్’ ఇతివృత్తంలో అక్టోబర్ 1న ఉదయం 10-11 గంటల వరకుపరిశుభ్రత కోసం గంట పాటు శ్రమదానం చేయాలని ఇచ్చిన పిలుపులో గీతం విద్యార్థులు కూడా పాల్గొన్నారు. తమ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు, వారి కమ్యూనిటీలలో పరిశుభ్రతను ప్రోత్సహించడంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. గాంధీజీకి నివాళులర్పించే కార్యక్రమంలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు,రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డెరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, స్కూల్ ఆఫ్ సెన్స్ పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ. రామరావు,ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దేశానికి,ప్రపంచానికి చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు.మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడంతో పాటు నేటి ప్రపంచంలో ఆయన బోధనలు, సూత్రాల ప్రాముఖ్యతను గీతం ఉన్నతాధికారులు గుర్తుచేశారు.విశ్వవిద్యాలయం తన విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించడానికి, సామాజిక బాధ్యత, సత్యం, అహింసను పోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు..