గుత్తాపై అవిశ్వాసం..?

  •   రాష్ట్రంలో మరో పొలిటికల్‌ వార్‌
  • సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడలో కాంగ్రెస్‌
  • మండలిలో సంఖ్యాబలంతోనైనా ఉనికి చాటుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం
  • తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు

(మండువ రవీందర్‌రావు)
రాష్ట్రం మరో పొలిటికల్‌ వార్‌కు సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలాన్ని నిలబెట్టుకుంటుందా, జారవిడుచుకుంటుందా అన్నది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానాంశంగా మారింది.  శాసనసభ ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన బిఆర్‌ఎస్‌ మండలిలోనైనా తనకు బలముందన్న భావనతో ఉంది. కాంగ్రెస్‌పై తనకున్న ఆగ్రహాన్ని మండలిలో బిల్లుల ఆమోదం తదితర విషయాల్లో కొంతవరకు తన పవర్‌ను చూపించవచ్చన్న భావనలో ఉంది. మండలి చైర్మన్‌ కూడా బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవాడే కావడం వల్ల శాసనసభలో కాకున్నా, మండలిలో కాంగ్రెస్‌ దూకుడును అడ్డుకునే అవకాశం ఆ పార్టీకి లేకపోలేదు. అయితే  అనూహ్యంగా ఇప్పుడు చైర్మన్‌ పైనే స్వీయపార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు వార్తలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. వాస్తవంగా తాజా పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులకు కారణంగా మారాయి. పదేళ్ళు రాష్ట్రాన్ని ఏలిన బిఆర్‌ఎస్‌ను అరునెల్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అధికారానికి దూరం చేయడం ఒకటైతే, పార్లమెంటు ఎన్నికలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారాయి.

 

రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా ఆ పార్టీ గెలుచుకోలేక పోవడమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల సందర్భంగా పార్టీ అనేక ఒడిదొడుకులను ఎదుర్కుంది. పార్టీ టికెట్‌ తీసుకుని కొందరు, పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన మరికొందరు మరోపార్టీ కండువ కప్పుకున్నారు. అలాంటివారిలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడొకరు కావడం ఆ పార్టీలో మరో రాజకీయ సంక్షోభానికి కారణంగా మారింది. సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి నల్లగొండ లేదా భువనగిరి లోకసభ స్థానాన్ని ఆశించాడు. కాని, బిఆర్‌ఎస్‌ అధిష్టానం ఆయన్ను పక్కకు పెట్టడంతో విధిలేక ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయాడు. కాంగ్రెస్‌లో ఉన్నా, బిఆర్‌ఎస్‌లో ఉన్నా ఉద్యమకారుడిగా సుఖేందర్‌ రెడ్డికి మంచి పేరుంది. ఆయన తన కుమారుడిని నిరాశపర్చడం పట్ల మనస్థాపం చెండమే కాకుండా, బిఆర్‌ఎస్‌ ఓటమిపైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చెప్పుడు మాటలు వినడం వల్లే కెసిఆర్‌ ఓటమి చవిచూడాల్సి వొచ్చిందన్నది ఆయన మాటల్లోని సారాంశం. దానికి తోడు పార్లమెంటు ఎన్నికల సందర్భంలో గుత్తా అనుచరులంతా కాంగ్రెస్‌ తీర్థం తీసుకోవడం బిఆర్‌ఎస్‌ ఆగ్రహానికి కారణమైంది.

 

శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు పెద్దల సభ ఆమోదానికి వొచ్చినప్పుడు తమ బెట్టును చూపించాలనుకున్న బిఆర్‌ఎస్‌కు చ్నైర్మన్‌ తీరు ఇబ్బందికరంగా మారింది. దీంతో మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తాపై అవిశ్వాసాన్ని ప్రకటించి, మరో వ్యక్తిని ఆ స్థానంలో ఎన్నుకోవాలన్నది బిఆర్‌ఎస్‌ అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. అయితే ఈ విషయంలో పార్టీ పెద్దలు మాత్రం పెదవి విప్పడంలేదు. ఏది జరిగినా బడ్జెట్‌ సమావేశాల్లో ఈ తంతు పూర్తి అవుతుందనుకుంటున్నారు. ఒకవేళ మండలి చైర్మన్‌ పైన బిఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే, దాన్ని తమకు అనుకూలంగా ఏవిధంగా మలుచుకోవచ్చన్న ఆలోచనలో ఇప్పుడు కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. మండలిలో నామమాత్రం బలమున్న కాంగ్రెస్‌, తన సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎంఎల్‌ఏలు, ఇతర నాయకులు ఇప్పటికే ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. మండలిలో మొత్తం ఎంఎల్‌సీ సభ్యుల సంఖ్య 40. కాగా రెండు ఎంఎల్సీ స్థానాలు ఖాలీగా ఉండడంతో 38గా ఉంది. వీరిలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీల సంఖ్య 26. అలాగే కాంగ్రెస్‌ ఎంఎల్సీలు కేవలం ఆరుగురు మాత్రమే.

 

ఎంఐఎం నుండి ఇద్దరు, బిజెపి నుండి ఒకరున్నారు. టీచర్‌ ఎంఎల్సీలు ఇద్దరున్నప్పటికీ వారు వోటింగ్‌కు దూరం ఉంటున్నారు. మండలిలో కూడా తమదే పై చెయ్యి కావాలంటే కాంగ్రెస్‌కు కనీసం 14 మంది ఎంఎల్సీలు అవసరం. ఇప్పటికే చాలా మందితో కాంగ్రెస్‌ మంతనాలు జరిపినట్లు వార్తలు వొస్తున్నాయి. వారి డిమాండ్ల పట్ల హామీలిచ్చి తమ పార్టీలోకి తెచ్చుకునే బాధ్యతలను పలువురు సీనియర్‌ నాయకులకు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది మొదలు, మరో రెండేళ్ళకు టర్మ్‌  పూర్తి అవనున్న ఎంఎల్సీలకు తిరిగి మరో అవకాశం ఇవ్వడంతో పాటు వారి అదనపు కోరికలను కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ హామీ ఇస్తున్నట్లు తెలుస్తున్నది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే సభలో టు బై త్రి మెజార్టీ ఉండాలి. అందుకోసం బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీలకు కాంగ్రెస్‌ గాలం వేస్తున్నది. ఇక్కడ మరో విషయమేంటే బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీల్లో  కాంగ్రెస్‌ నేపథ్యం ఉన్న బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్‌ లాంటివారు కొందరున్నారు. అలాంటివారితో పాటు, టిడిపి నుండి వొచ్చినవారు, నిన్నటివరకు బిఆర్‌ఎస్‌ విధేయులుగా ఉన్నవారిపైన కాంగ్రెస్‌ ఆకర్ష్‌ పథకాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా మండలిలోనైన  ప్రతిష్ట దిగజారకుండా బిఆర్‌ఎస్‌ తన సభ్యులను ఎలా కాపాడుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page