గురువింద గింజలా ప్రవర్తించకండి

 

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి

తిన్న సొమ్మంతా కక్కిస్తాం

మంత్రి పొంగులేటి ఫైర్‌

 

 

కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు చేసారని, బిఆర్‌ఎస్‌లా తూతూ మంత్రాలలా మమ అనిపించకుండా మాట ఇచ్చిన విధంగా హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రినివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు బిఆర్‌ఎస్‌ నేతలు గురువింద గింజలా ప్రవర్తిస్తున్నారంటూ ఎద్దేవ చేశారు. క్యాబినెట్‌ మంత్రి పదవులు చేపట్టిన సందర్భంగా ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ఉమ్మడి జిల్లాలో తొలి సారి పర్యటించారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని సుమారు రూ 5లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవ చేశారు. అధికాంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకున్నారని, అధికార మత్తు వదలగానే పథకాలు అమలు చేయాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహించారు. మాజీ మంత్రులు నిసిగ్గుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పథకాల అమలుపై కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌ నేతలకు లేదని ఘాటుగా విమర్శించారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని అప్పులకుప్పగా మార్చారని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. ప్రజల సొమ్ము ప్రతీ పైసా వసూళ్ళు చేసి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని అధికార దుర్వినియోగంతో అప్పులపాలు చేశారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడిరచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండు రోజులు గడవక ముందే మాపై ఆరోపణలు చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన మీరా మాట్లాడేదని మండి పడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం పండికొక్కులా నువ్వు, నీ మామా అకౌంట్‌లోకి వేసుకున్నారని ధ్వజమెత్తారు. అపుడే ఏమైందని, ముందుంది ముసళ్ళ పండుగ అంటూ చురకలు అంటించారు. రైతుబంధు పైసలు రైతుల ఎకౌంట్‌లో వేయడానికి 3 నెలలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ సమ న్యాయం చేస్తామన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన బిఆర్‌స్‌ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, తిన్న సొమ్మంతా కక్కిస్తామని తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కావాలని ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారని, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page