‘గూడెం’ లో ఎంపీ కు వినేదేలేదు..!

గూడెంలో అదుపు తప్పుతున్న కారు

కౌన్సిలర్లతో కుదరని బేరసారాలు

బుజ్జగింపులు వినకుంటే బెదిరింపులు ? 

కొత్తగూడెం : ఎన్నికల వేళ కొత్తగూడెం నియోజకవర్గంలో సిఎం కెసిఆర్‌ జన ఆశిర్వాద సభకు ముందే కారు పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. వనామా నమ్మిన బంటుగా పేరున్న సీనియర్‌ నాయకుడు కాసుల వెంకట్‌ కారు పార్టీలో తిరుగు బావుటా ఎగురవేసి రాజకీయ చిచ్చు రాజేశారు. అప్పటి నుండి ఆ చిచ్చుకాస్తా బిఆర్‌ఎస్‌ పార్టీలోని అసంతృప్త నేతలరూపంలో కార్చిచ్చులా పార్టీలో విస్తరిస్తూ వస్తోంది.నిన్న మొన్నటివరకు గ్రూపులుగా చీలిన అధికార పార్టీ కౌన్సిలర్లు ఇప్పుడు ఒక్కటయ్యారు. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో అసమ్మతి సెగలు రాజేస్తుంది. దీనితో కారు పార్టీ ఒక్క సారిగా కుదుపులకు గురతోంది. గూడెం రాజకీయాలతో ఇంచార్జీలు సైతం విస్తుపోతున్నారు. ఎటూ తేల్చ లేక తలలు పట్టుకుంటున్నారు. సర్థి చెప్ప లేక సతమతం అవుతున్నారు. ఒక్కపట్టాన అంతు పట్టడం లేదు. ఎలా అసమ్మతి గళాలను బుజ్జగించాలో తెలియక తికమక పడుతున్నట్లు సమాచారం. అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు నిరవేర్చలేక నేతలను బుజ్జగించ లేక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. నేతల మధ్య విభేదాలు అధికార పార్టీలో అలజడి రేపుతుంది.

బెడిసి కొట్టిన బేరసారాలు

అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రతీ కౌన్సిలర్‌కు  తగిన న్యాయం చేయాలని, తమ డిమాండ్లను నెరవేరిస్తే పార్టీలో ఉంటామని లేదంటే వీడుతామని పట్టుబట్టినట్లు సమాచారం. అడిగినంత ఇస్తేనే పార్టీలో కొనసాగుతామని లేదంటే పార్టీని వీడుతామని అల్టిమేటం జారీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు మొండికేయడంతో చేసేదేమీ లేక మధ్యవర్తులు రాయబారాలు నడుపుతున్నా ససేమీరా అంటున్నారు అధికార పార్టీ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే, కౌన్సిలర్లకు  మధ్య మద్యవర్తిత్వం వహిస్తున్న పార్టీ పెద్దలు నయానా భయాన అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నారు. అయినా చర్చలు కొలిక్కి రావడం లేదు. కౌన్సిలర్లు నేతల మాటలకంటే నోట్ల మూటలవైపే మొగ్గు చూపుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం 25 మంది కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయానికి అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్యే తనయుడి బూతు పురాణం

కొత్తగూడెం మున్సిపాలిటీ అధికార పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే తనయుడి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్లతో మట్లాడేందుకు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్‌ ఎంపి వద్ది రాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవ ప్రజా ప్రతినిథులు అని చూడకుండా అసభ్యకర పదజాతంతో దూషించాడని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాఘవ వల్లించిన భూతు పురాణంతో అధికార పార్టీ కౌన్సిలర్లు మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీనితో గురువారం రాత్రి కొత్తగూడెం క్లబ్‌లో కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. సమావేశం జరుగుతుండగానే అధికార పార్టీ ప్రతినిధి బెదిరింపులకు సైతం పాల్పడినట్లు సమాచారము. రాఘవ తీరుతో రగిలిపోతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రతీకార చర్యలకు సిద్దం అవుతున్నారు. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ గొడవ కాస్తా ఎమ్మెల్యే తనయుడు వర్సెస్‌ కౌన్సిలర్లుగా మారింది. ఈ విషయంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ను కౌన్సిలర్ల బృందం కలవనున్నట్లు తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పుడప్పుడే సద్దు మనిగేలా లేదనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రయ పడుతున్నాయి. గూడెంలో గులాబీ వాడిపోకుండా ఎంపి వద్దిరాజు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యేలా కనిపించడం లేదు. ఇదిలా కొనసాగితే  గూడెంలో కారు అదుపు తప్పడం కాయమని, గులాబీ జెండా ఎగరడం కష్ట తరమే అవుతుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page