ప్రపంచంలోనే గొప్ప ప్రజాపో రాటంగా పేరొందిన భారత స్వాతంత్య్ర సమ రానికి రథసారధిగా జాతిపిత మహాత్మాగాంధీకి మహోన్నత స్థానం దక్కింది. ధర్మం, సత్యం, అహింస, శాంతిని ప్రభోదించి ఆచరించి చూపిన మహితాత్మునిగా గాంధీజీ అందరి హృద యాలలో నిలిచిపోయారు. గాంధీజీ స్వరాజ్య సాధన కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, ఆయన ఆశయాలను, ఆచరణారీతిని కథనమయ గేయాలుగా మలిచి బాలల తాత బాపూజీ అన్న పేరుతో ప్రఖ్యాత బాలసాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ పుస్తకంగా అందించారు.
మానవ రూపంలోని మహాత్ముడు మహితాత్ముడై మనలో ఒకరయ్యారంటూ ప్రారంభించిన గేయంలో సత్యదీక్షను ధ్యేయంగా, సమానతను మానవ ధర్మంగా చాటిచెప్పిన భారత జాతి మహనీయునిగా గాంధీజీని ఇలా అభివర్ణించారు.
భూమి మీద నడిచినాడు
మన కాలపు బుద్ధుడు
ధర్మపథం మార్గమని
నమ్మి ఆచరించినాడు
మనుషులలో మహర్షిగా గాంధీని సూచించారు. జోతలు గేయంలో గాంధీ తాత భరత జాతికి స్ఫూర్తి ప్రదాత అని దక్షిణాఫ్రికా నుండి దండి దాకా సాగిన ఉద్యమ నౌకగా తెలిపారు. పరాయిల గుండెల్లో మరఫిరంగిగా మారి బోసి నవ్వుతో స్వాతంత్య్రపు దీప్తులను వెలిగించి భరతజాతికి జ్ఞాపికగా నిలిచారని చెప్పారు. సత్యాగ్రహ ఆశ్రమాలు సమతకు సందేశాలని పోరుబాటలో జాతిని నడిపించిన జన చైతన్య కేంద్రాలని, కస్తూర్బా – గాంధీజీ కలల కార్యక్షేత్రాలని అన్నారు. అదే విధంగా ఆ ఆశ్రమాలను మహోన్నత ఆశయాల వజ్ర మందిరాలుగా సంభావిస్తూ ఇలా చెప్పారు.
సత్యాగ్రహ ఆశ్రమాలు
సమానత్వ ఆశ్రయాలు
మహాత్ముని ఆలోచన
వర్ధిల్లిన మందిరాలు
సబర్మతి మౌని గాంధీజీ సత్యాగ్రహ ఆయుధం చేపట్టి సహాయ నిరాకరణ జరిపి మానవులను సత్య,ధర్మ మార్గంలో నడిపించేందుకు శాంతి యుద్ధ వీరునిగా భువిపై వెలసినారని తెలిపారు. బాపూజీ ఇచ్చిన సందేశం జాతికి ఆదర్శం, ఆచరణం, సదా ఆదేశమని చెప్పారు. ఒక చెంప కొడితే మరో చెంప చూపమన్న సాత్వికమార్గ నిర్దేశకునిగా గాంధీజీని కొనియాడారు. ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలని గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్య కేంద్రాలు అవేనని తెలిపారు. పల్లెలు సమృద్ధిగా ఉంటే అదే రామరాజ్యమని తెలిపారు. అలుపెరగని స్వాతంత్య్ర రథసారధి గాంధీ జనహృదయ విజేతగా నిలిచారని తెలిపి ఇలా గేయంలో కీర్తించారు.
ఈ విశాల విశ్వంలో
ధృవతారవు గాంధీతాత
అస్తమించని సూర్యుడివి
నువ్వేగా గాంధీతాత
బాలల తాత బాపూజీని కొత్త దేవుడు, సత్యమూర్తిగా, ఖద్దరు నేతగా, రాముడు, రహీం, క్రీస్తుగా, బంగరు మూర్తిగా తెలిపారు. జాతినంతా కలిపిన జనజాగృత ధీరునిగా, పుత్లీబాయి – కరంచంద్ కలల పంటగా కొనియాడారు. పంద్రా అగస్టు ఎర్రకోట మీద మువ్వన్నెల పతాక ఎగిరిన రోజని చెబుతూ ఆ ప్రత్యేకతను గేయ పంక్తుల్లో సుబోధకంగా మలిచారు.
అమరుల త్యాగాలన్నీ
సార్థకమై నిలిచిన రోజు
గాంధీ మంత్రం ఫలించి
స్వేచ్ఛ విరిసిన రోజు
మనిషిగా పుట్టి మనీషిగా మారి స్వాతంత్య్రం సాధించి చరితార్థుల కోవలో చేరిన గాంధీని గుజరాత్ రాష్ట్రం పోరుబందరు నగరపు విఖ్యాతిగా కీర్తించారు. గాంధీ ఇంటి పేరని, మునియ ముద్దు పేరని, మోహన్దాస్ కరంచంద్ గాంధీ పూర్తి పేరు అని తెలిపారు. 1869 అక్టోబర్ 2వ తేదీని గాంధీ పుట్టిన మహా పుణ్యదినంగా చెప్పారు. చిన్ననాటి నుండి బడి, గుడి, కన్నతల్లి ఒడిలోనూ సత్యధర్మ దీక్షలను పాటించిన గొప్ప బాలునిగా గాంధీని ఇప్పటి బాలలకు పరిచయం చేశారు. శ్రవణ కుమారుని, సత్య హరిశ్చంద్ర గాథలు గాంధీజీపై చిన్ననాడే వేసిన చెరగని ముద్రను వివరించారు. సత్యాన్నే పలకాలన్న తల్లిమాటను వేదంగా ఆచరించిన గాంధీని మంచితనం, సమభావన కలిగిన మనిషిగా చూపించారు. యువకునిగా గాంధీ గొప్పతనం, కస్తూర్భాతో ఆదర్శమైన దాంపత్యాన్ని వివరి ంచారు. ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివి జన్మభూమికి చేరి న్యాయవాద వృత్తి కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ భారతీయుల కష్టాలను చూసి చలించి సమాజ జాగృతికై పోరాటాన్ని గాంధీజీ అక్కడే ఎంచుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. ప్రజలను సంఘటితం చేసి తెల్లవారి చట్టాలను మొక్కవోని ధైర్యంతో గాంధీజీ ఎదిరించారని తెలిపారు. నల్లజాతి చట్టాలను దిక్కరించి జైలుకు వెళ్లి సత్యాగ్రహ దీక్షను పాటించిన తీరును చెప్పారు. ఫినిక్స్ ఆశ్రమాన్ని స్థాపించి నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తూ అఖిల జనులకు ఆదర్శవంతంగా మారిన గాంధీని ఇలా కొనియాడారు.
స్వేచ్ఛా వాయువుల కొరకు
తపించెను నిరంతరం
ఆశయ సాధన కొరకై
శ్రమించెను అహరహం
భరతమాత దాస్యశృంఖలాల విముక్తికై పల్లెపల్లె తిరిగి, కొల్లాయి గట్టి, చేతకర్ర బట్టి గాంధీ అడుగు వేసినాడని చెప్పారు. తెల్ల దొరలను ఎదిరించే చైతన్య స్ఫూర్తిని నింపుతూనే అసమానత, పేదరికం, కులతత్వం, అంటరాని తనం, అస్పృశ్యతను అంతం చేసే యజ్ఞం చేపట్టారని తెలిపారు. చేతి వృత్తులను ప్రగతికి సోపానాలని చెప్పి ఆర్థిక పరిపుష్టితో ఆత్మగౌరవం కలగాలని భావించిన గాంధీజీ స్వదేశీ వస్తువులు వాడుతూ విదేశీ వ్యామోహాన్ని విడనాడలన్న సందేశమి చ్చారని అన్నారు.
రాట్నంపై వడికి
చరఖాపై నూలు తీసి
స్వదేశీయ అభిమానం
చాటి చెప్పినాడు
పన్నులతో ప్రజలను ఆంగ్లేయులు పీడించడాన్ని నిరసించడమే కాకుండా ఉప్పును పండి ంచేందుకు దండి వరకు నడిచి గొప్ప ఉద్యమంగా మార్చినాడని చెప్పారు. రైతన్నల దీనగాథ విని ఉత్తర బీహార్లోని చంపారన్ జిల్లాలో మోటహరి టౌన్లో రైతులకై గాంధీజీ పోరాడిన తీరును వివరించారు. ఆంగ్లేయుల దమన నీతిని ప్రశ్నించి భారతీయుల క్షేమాన్ని ధ్యేయంగా మలచుకొన్నారని చెప్పారు. రోగులు, అనాథలు, అనారోగ్య పీడితులు, కుష్టు వ్యాధి గ్రస్తులను చేరదీసి సేవలు చేశారని తెలిపారు. ప్రజలను చైతన్య పరిచేందుకు పత్రికలను స్థాపించి తన మాటను, బాటను వివరించారని తెలిపారు. రౌలత్ చట్టాలను నిరసించాలని, స్వాతంత్య్ర కాంక్షను దేశమంతా రగిలించి తన మార్గంలో నడిపించారని తెలిపారు. కాంచరబ్ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించి సేవలు అందించిన తీరును పేర్కొన్నారు. తెల్లదొరల దమన కాండను అరికట్టేందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి స్వాతంత్య్రోద్యమ దిశగా యావత్ భారతాన్ని ఒక్కతాటిపై నడిపించి, ప్రజా పోరాటం జరిపించి వలస రాజ్య పరిపాలనను అంతం చేశారని చెప్పారు. 1947 అగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరి స్వాతంత్య్ర దేశమై భారతావని గాంధీజి ఆకా ంక్షతో వర్ధిల్లిన తీరును వివరించారు. 1948 జనవరి 30న ప్రార్థనామందిరం వద్దకు కదిలిన గాంధీ గాడ్సే తూటాలకు నేలకొరిగిన విషాదాన్ని వెల్లడించారు. దేశం కోసం అహరహం తపించిన గాంధీ కలకాలం మహితాత్ముడుగా వెలిగారని చెప్పారు. గాంధీ ఈ నేల మీద పుట్టి నూటా యాభై యేండ్లు గడిచినప్పటికీ తరతరాలకు ఆయన స్ఫూర్తి అందుతుందని చెబుతూ ఈ గేయ కావ్యాన్ని ఇలా ముగించారు.
గాంధీ తాతకు జైజై
బాపూజీకి జైజైజై
బాలల తాతకు జైజై
బంగరు తాతకు జైజై!
జగన్నేత గాంధీజీకి జయహోలు పలికేందుకు వెన్నముద్దల్లాంటి పదాలను ఎన్నుకుని, చందమామ లాంటి చల్లని వాక్యాలను అల్లి, ఆకుపచ్చని పత్రాల్లాంటి గేయాలను మాధుర్య పఠనీయ శైలీలో, అత్యంత సులభంగా, ఆత్మీయ గాన యోగ్యంగా మలచిన తీరు కవిలోని నిర్మాణ నిపుణతకు నిదర్శనంగా నిలిచింది.
( కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం – 2022 పొందిన గ్రంథం… )
– తిరునగరిశ్రీనివాస్, 84660 53933.