భక్తులరాకతో జనసంద్రగా మారిన భద్రగిరి
కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టి పూజలు చేసిన భక్తులు…..
భద్రాచలం, ప్రజాతంత్ర , డిసెంబర్ 10 : శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గో – గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ గోవుని గోవిందున్న ఏక కాలంలో దర్శిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అటువంటి గో గోవింద కల్పవృక్ష నారసింహ ఆశ్రమాన్ని భద్రాద్రి దివ్యక్షేత్రం లో నిర్మాణం చేయడం చాలా ఆనందం గా ఉన్నదని,భక్తుల సౌకర్యార్థం శ్రీనృసింహ నిత్యాన్న ప్రసాద నిలయం ద్వారా ప్రతి నిత్యం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రతినిత్యం నృసింహ సేవా వాహిని ద్వారా అన్న ప్రసాదాన్ని అందించడం మా నృసింహ భక్త కుటుంబం పూర్వజన్మ సుకృతమని అన్నారు. కల్పవృక్ష నారసింహ సాలగ్రామ తీర్థం తీసుకోవడం వలన అనేక రుగ్మతలను నివారిస్తుందని భక్తుల విశ్వాసం,అలానే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు నారసింహసాల గ్రామానికి ముడుపులు కట్టుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది రావడం చాలా ఆనందం గా ఉన్నదని అన్నారు.
గత ఐదు రోజులుగా సుదర్శన హోమం, లక్ష్మీనారసింహ హోమం, మహా లక్ష్మిహోమం నిర్వహించడం జరిగినది తధనంతరం లక్ష్మీనారసింహునికి కళ్యాణం జరిపించడం తో పాటు విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించి స్వామి వారి దర్శనం కొరకు వచ్చిన వారికి అన్నప్రసాద వితరణ అందజేశామని అన్నారు.గో గోవింద దర్శనం అందరికి కలగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు, డా. కృష్ణ చైతన్య స్వామి, వేద పండితులు శ్రీనివాస శర్మ, నవీన్ శర్మ, పవన్ కుమార్ శర్మ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.