‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేయండి

మళ్లీ నిర్వహించండి….టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు
పరీక్షను రద్దుచేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్‌ 11‌న నిర్వహించిన గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌-1 ‌పోస్టుల కోసం మొదటిసారిగా గతేడాది టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ‌జారీ చేసి..అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడంతో పాటు ఫలితాలనూ వెల్లడించింది. అయితే గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో తేలడంతో అక్టోబరు 16 నాటి పరీక్షను రద్దు చేసి.. జూన్‌ 11‌న తిరిగి నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో 2 లక్షల 33 వేల 506 మంది ప్రిలిమ్స్ ‌రాశారు. ప్రాథమిక కీ విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ ‌షీట్లనూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేసింది. అయితే గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేయాలంటూ.. జూన్‌ 22‌న ముగ్గురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. జూన్‌ 11 ‌నాటి పరీక్షలో బయోమెట్రిక్‌ ‌వివరాలు నమోదు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఓఎంఆర్‌ ‌సమాధాన పత్రంపై హాల్‌ ‌టికెట్‌ ‌నంబర్‌, ‌ఫొటో లేకపోవడంపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేశారు.

అక్టోబరు 16న నిర్వహించిన పద్ధతిలోనే జూన్‌ 11‌న పరీక్ష జరపకపోవడం అనుమానాలకు తావిస్తుందని పిటిషనర్లు వాదించారు. నోటిఫికేషన్‌కు భిన్నంగా పరీక్ష నిర్వహించడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎ.గిరిధర్‌ ‌రావు, నర్సింగ్‌ ‌వాదించారు. యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్నే పాటించామని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌బీఎస్‌ ‌ప్రసాద్‌, ‌టీఎస్‌పీఎస్సీ న్యాయవాది రాంగోపాల్‌రావు వాదించారు. కొందరు అభ్యర్థులే హైకోర్టుకు వొచ్చారని.. మిగతా లక్షల మంది అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. అభ్యర్థిని నిర్ధారించేందుకు.. అవకతవకలు జరగకుండా అనేక విధానాలు పాటించామని పేర్కొంది. ఇటీవల వాదనలు విని రిజర్వ్ ‌చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌పి.మాధవి దేవి శనివారం తీర్పు వెల్లడించారు. జూన్‌ 11‌న జరిగిన గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేసి.. బయోమెట్రిక్‌ ‌సహా నోటిఫికేషన్‌లో నిబంధనలన్నీ అమలు చేస్తూ మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులతో పాటు టీఎస్‌పీఎస్సీ కూడా కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు మార్చుకునే అధికారం టీఎస్‌పీఎస్సీకి ఉందని.. అయితే ఒకవేళ మారిస్తే నోటిఫికేషన్‌ను సవరించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

పరీక్ష మళ్లీ నిర్వహించినప్పటికీ.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు లేవని గుర్తు చేసింది. గ్రూప్‌-4 ‌నోటిఫికేషన్‌లో సవరణలు చేసిన విధంగా.. గ్రూప్‌-1‌కు చేయలేదని హైకోర్టు ప్రస్తావించింది. గ్రూప్‌-1 ‌ప్రాధాన్యం, అభ్యర్థులపై ప్రభావం తెలిసినప్పటికీ.. పరీక్ష నిర్వహణ, పరీక్ష రాసిన అభ్యర్థుల డేటా సేకరణలో టీఎస్‌పీఎస్సీ జాగ్రత్తగా కనిపించలేదని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పరీక్ష రాసిన వారి సంఖ్య వెబ్‌ ‌నోట్‌లో ఒక విధంగా.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మరో విధంగా ఉందని పేర్కొంది. ఇక గ్రూప్‌-1 ‌పరీక్ష మరోసారి రద్దు కావడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు సింగిల్‌ ‌జడ్జి తీర్పును సవాల్‌ ‌చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతుంది. తీర్పు ప్రతిని వెంటనే ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ న్యాయవాది హైకోర్టును కోరారు. తీర్పు పూర్తి వివరాలు అధ్యయనం చేసిన తర్వాత..సోమవారం లేదా మంగళవారం హైకోర్టు డివిజన్‌ ‌బెంచి వద్ద అప్పీలు చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page