తిరుపతి, జూన్ 23 : తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి అమ్మవారి తొలిదర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 18వ తేదీన అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరిగాయి. 23వ తేదీన మహా సంప్రోక్షణ అవాహణ, ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. టీటీడీ, దాతల సహకారంతో ఆలయాన్ని అందంగా పునర్ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా దశాబ్దాల నాటి కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. తిరుపతికి దగ్గరలోని వకుళాదేవి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 18 నుంచి వైభవంగా ప్రారంభం జరిగాయి.
23వ తేదీన ఉదయం నాలుగున్న గంటల నుంచి 7 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన కార్యక్రమం జరిగింది. 10 గంటల 20 నిమిషాలకు ధ్వజారోహణం, పదిన్నర గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్న గంటల వరకు శాంతి కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు. గతంలో వకుళామాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి గంట మోగించిన తర్వాతే తిరుమలలో వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించే వారని చరిత్రకారులు చెబుతారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పునర్ నిర్మించాలని కొందరు భక్తులు 2010లో హైకోర్టును ఆశ్రయించారు. 2015లో కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
దీంతో రెవెన్యూ అధికారులు ఆలయానికి నాలుగున్నర ఎకరాలు కేటాయిస్తూ బఫర్ జోన్ ఏర్పాటు చేసి, టీటీడీకి అప్పగించారు. 2017లో పనులు ప్రారంభమయ్యాయి. పురాతన రాతికట్టడంపైనే ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. గర్భగుడికి శిఖరం ఏర్పాటు చేసి, బంగారు వర్ణంతో రాగితాపడం చేయించారు. ఆలయ పునర్నిమానంలో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి. టీటీడీ, దాతల సహకారంతో పూర్తి చేయగలిగామన్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ తో పాటు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.