చాప కింద నీరులా డ్రాగన్

తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 
rehana pendriveసాల్మన్ దీవులు అనే దేశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదంటే  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  అటువంటి ఓ చిన్న, అనామక దేశం ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో హెడ్ లైన్లలోకి ఎక్కింది. అంతేకాదు ఈ దేశం తీసుకున్న ఓ నిర్ణయంతో అగ్రరాజ్యం అమెరికా సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కలవర పడుతున్నాయి. వీళ్ళ ఆందోళనలకు సహేతుకమైన కారణాలే ఉన్నాయి. ఆ విషయాల లోతుల్లోకి వెళ్లే ముందు సాల్మన్ దీవుల నేపథ్యం ఏమిటో ఓసారి చూద్దాం.
 
దీవుల సమాహారం
ప్రపంచ పటాన్ని పరిశీలిస్తే సాల్మన్ దీవులు పసిఫిక్ మహా సముద్రంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సమీపంలో కుడివైపున చుక్కల సమూహంగా కనిపిస్తాయి. మొత్తం తొమ్మిది వందల చిన్న దీవుల సమాహారం ఈ దేశం. వీటిలో కేవలం ఆరు మాత్రమే కాస్త పెద్దవి. ఈ దేశ విస్తీర్ణం 28, 400 చదరపు కిలోమీటర్లు. జనాభా కేవలం 6,68, 000. దేశ రాజధాని హోనియరా. 1978లో ఇంగ్లాండ్ నుంచి ఈ దేశం స్వాతంత్ర్యం పొందింది ఆర్థికంగా బాగా వెనుకబడిన దేశం. పర్యాటకానికి అవకాశాలున్నా… మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రపంచంలోనే అతి తక్కువ. సాల్మనీయుల వేషా, భాష అంతా యూరోపియన్ స్టైల్ లోనే ఉంటుంది. అధికార భాష కూడా ఇంగ్లీషే. కాస్త విచిత్రంగా కనిపించే విషయం ఏంటంటే ఈ దేశానికి సొంత ఆర్మీనే లేదు. ఉన్న కొద్దిపాటి పోలీస్‌ బృందాలే శాంతిభద్రతలు పర్యవేక్షిస్తారు.  ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సముద్ర తీర పర్యవేక్షణ కూడా వీళ్ల బాధ్యతే.
 
తాజా పంచాయితీ
ప్రపంచం పై ఆధిపత్యం కోసం ఉవ్విళ్లూరుతున్న డ్రాగన్ దేశ చాప కింద నీరులాంటి వ్యూహాలకు సాల్మన్ ద్వీపం తాజా ఉదాహరణ. ఓ రెండు స్వతంత్ర దేశాలు ఒప్పందం చేసుకుంటే ఎలా తప్పుబడతాం అనుకోవచ్చు కానీ…ప్రపంచ రాజకీయ క్షేత్రం కోణంలో ఈ పరిణామాలను పరిశీలించక తప్పదు. నిన్నటి వరకు సాల్మన్ దేశంకు ఆస్ట్రేలియా పెద్దన్న. అటువంటి దేశానికి ఇప్పుడు డ్రాగన్ దేశం పక్కలో బల్లెం అవటానికి వేదిక అవుతోందా అన్నదే తాజా ప్రపంచ దేశాల అనుమానం. చైనాతో సాల్మన్ చేసుకున్న ఒప్పందంలోని అసలు విషయాలేవీ అధికారికంగా బయటకు రాకపోవటం, చైనా ఆకాంక్షల వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న చైనా ఏడు లక్షల జనాభా కూడా లేని ఈ చిరు దేశంతో భద్రతా ఒప్పందం కుదుర్చుకుందన్న విషయం ఆందోళనకు కారణమైంది. ఈ దీవుల్లో చైనా నావికా స్థావరాన్ని నిర్మిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
సాల్మన్ దీవుల్లో చైనా యుద్ధ నౌకలు త్వరలో పాగా వేయనున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే చైనా బలగాలు వచ్చి అదుపు చేసే విధంగానూ ఒప్పందం లోని అంశాలు ఉన్నాయి అంటున్నారు. అదే నిజమైతే ఆస్ట్రేలియా పెరట్లో చైనా నీడలు విస్తరించటం ఖాయం.  అయితే ఇవన్నీ ఒక్క రోజులో జరిగిన పరిణామాలు కావు. దాదాపు పదిహేను, ఇరవై ఏళ్ల నుంచే కొనసాగుతూ వస్తున్న పరిణామక్రమం. సాల్మన్ రాజకీయ నాయకులతో చైనాతో వ్యాపార వర్గాలు కొన్నేళ్లుగా సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. 2006లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నైడర్ రిని ఆ దేశ ప్రధాని అయ్యారు. అయితే చైనా వ్యాపారవేత్తల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేశారనే ఆరోపణలు అప్పట్లోనే రిని పై వచ్చాయి. ఓ దశలో రాజధాని హోనియరాలో చైనా వ్యాపారస్తులు ఎక్కువగా ఉండే చైనాటౌన్ అనే  ప్రాంతాన్ని స్థానికులు దగ్ధం చేశారు.  అప్పట్లో చైనా తన చార్టర్డ్ ఫ్లైట్‌లను  పంపించి వందల సంఖ్యలో చైనీయులను వెనక్కి పిలిపించుకుంది. ఇక రెండో పరిణామం చూస్తే 2019లోనే సాల్మన్ తైవాన్‌తో సంబంధాలు తెగ తెంపులు చేసుకుంది. అసలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించిన అతికొద్ది దేశాల్లో సాల్మన్ ఒకటి. అయినా చైనా నాయకత్వ ఒత్తిడితో తైవాన్‌ నుంచి దూరంగా జరిగి తన తొలి ప్రాధాన్యత చైనా అని స్పష్టం చేసింది.
ఏం జరిగే అవకాశం ఉంది?
దేశ ఆర్ధిక వెనుకబాటుతనం, రాజకీయ నాయకత్వ ఆర్ధిక అవసరాలనే డ్రాగన్ తనకు అనుకూలంగా మలుచుకుందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లోనూ రాజధాని నగరంలో  పెద్ద ఎత్తున నిరసనలు రేగాయి.  ప్రధానమంత్రిని తప్పించాలని ఆందోళనకారులు పార్లమెంట్‌ను ముట్టడించారు. రాజకీయ ప్రాబల్యం స్థిరపరుచుకోవటానికి విదేశీ శక్తులతో చేతులు కలపటం ఏ దేశ చరిత్ర చూసినా కనిపిస్తుంది. ఒప్పందం చేసుకోవద్దని ఆస్ట్రేలియా చేసిన సూచనను పరిగణలోకి తీసుకోలేదు ఈ దేశ నాయకత్వం. తాజా ఒప్పందం వల్ల పసిఫిక్ రీజియన్‌లో శాంతి, సామరస్యాలకు ఎటువంటి ప్రమాదం లేదని ఆ దేశ ప్రధాని మనాసె సోగోవరె స్పష్టం చేశారు. అయినా పొరుగు దేశాలు నమ్మే పరిస్థితిలో లేవు. ఆస్ట్రేలియాలో త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో ఈ పరిణామాలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి. తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. పెద్ద దేశాల వ్యూహాత్మక అవసరాల పోటీలో  ఈ చిన్న దేశం భవిష్యత్తు ఏ దిశను తీసుకుంటుంది అన్నదే అసలు ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page