- మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు మంత్రి హరీష్ రావు ఆదేశం
- సహచరులతో కలిసి పరిశీలించిన మంత్రి
వరంగల్, ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను, నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన మంత్రివర్గ సహచరులతో కలిసి పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం తన సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి హాస్పిటల్ పనులతోపాటు, నిర్మాణ నమూనా పరిశీలించారు. ప్రస్తుతం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారని దసరా తర్వాత 2,500 కార్మికులతో నిర్మాణ పనులు చేయిస్తామని హరీష్ రావు తెలిపారు.
వర్షాలు తగ్గాకా 2,500 మంది కార్మికులతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, 24 అంతస్థుల భవనానికి అన్ని అనుమతులు తీసుకున్నామని, భవనంలో 16 అంతస్థులు హాస్పిటల్ నిర్మాణం, మిగిలిన 8 అంతస్థుల్లో వైద్యులకు వసతి, సెమినార్ హాళ్ల నిర్మాణం జరుగుతుందని హరీష్ రావు, తెలిపారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్, వరంగల్ మేయర్ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.