జగ్గారెడ్డిని 50వేల వోట్ల అధిక్యంతో గెలిపించాలి
టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు…పార్టీ శ్రేణులు ఫుల్ హ్యాపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విజయభేరి జన సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా చేసింది. సంగారెడ్డిలో జగ్గారెడ్డి అన్నీ తానై నిర్వహించిన ఎన్నికల సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేసిన సభలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..డిసెంబర్‌లో వొచ్చే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటులో కీలక పాత్ర పోషించే మీ అభిమాన నాయకుడు జగ్గారెడ్డిని గెలిపించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖర్గే ఇక్కడకు వచ్చారు. మా జగ్గన్నను 50 వేల వోట్ట మెజారిటీతో గెలిపించండి. ఆయన రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డిని ఉద్దేశించి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్యన కొంత గ్యాప్ ఉందనీ ప్రచారం ఉంది. రేవంత్, జగ్గారెడ్డి మధ్య దూరం ఉందని ప్రచారంలో ఉన్న వేళ…జగ్గన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలోనే సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి పేరును ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సిఎల్‌పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క, టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్రంలోని పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జగ్గారెడ్డి అభిమానులు భారీగా హాజరయ్యారు. సభ సక్సెస్ కావడమే కాకుండా, టిపిసిసి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి…జగ్గన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు…జగ్గారెడ్డిని 50వేల వోట్ల అధిక్యంతో గెలిపించాలంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే జగ్గారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటారని చెప్పకనే చెప్పారు. మొత్తానికి జగ్గారెడ్డిని ఉద్దేశించి టిపిసిసి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపాయని చెప్పాలి. అంతేకాకుండా, ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు.