‘‘తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభా తో బాధపడే దేశాలు అభివృద్ధి ని సాధించలేవు.అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం కష్టం. ఈ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటున్నాయి. విద్య,వైద్య,వసతి సౌకర్యాలు అరకొరగా ఉంటున్నాయి.సరైన విద్యా సదుపాయాలు లేక నైపుణ్యం కొరవడి ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్నాయి.’’
మన పూర్వకాలంలో ఎంత మంది పిల్లలుంటే కుటుంబానికి అంత సంపదగా భావించేవారు. కాని వర్తమానంలో అలాంటి పరిస్థితులు లేవు.కుటుంబంలో ఒక్కరిని పెంచి,పెద్ద చేసి,విద్యా బుద్దులు నేర్పించే సరికి కుటుంబ పెద్దలకు ఆయువు హారతి కర్పూరంలా హరించుకు పోతున్నది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనడం తలకు మించిన భారంగా మారింది.బాధ్యత గల తల్లిదండ్రులంతా ఈ విషయాన్ని అవగతం చేసుకుని సంతానాన్ని పరిమితం చేసుకున్నారు. ఇక బాధ్యత తెలియని వారే నారు పోసిన వాడే నీరు పోస్తాడనే నమ్మకంతో సంతానాన్ని పెంచుకుంటూ పోతున్నారు. కొంతమంది పిల్లలను కని,గాలికి వదిలేసి,తమ దారి తాము చూసుకుంటున్నారు. పెద్దల ఆలనా పాలనా లేక, వీధి బాలలుగా,బాల కార్మికుల్లా పెరిగి అసాంఘిక శక్తుల చేతుల్లో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న అభాగ్యజీవుల యథార్థ గాథలను ఒక్కసారి పరిశీలించాలి. సమాజాన్ని మేల్కొలపాలి. బాధ్యతను గుర్తు చేయాలి. జనాభా పెరిగితే కలిగే నష్టాలను వివరించాలి
కుటుంబంలోని జనసంఖ్యను ఆదాయ వనరుగా భావించే నాటికాలం పోయింది. మంది పెరిగితే మజ్జిగ పలచనౌతుందన్న పాత కాలపు సామెత నిజమైనది.2050 నాటికి ప్రపంచజనాభా 9.8 బిలియన్లకు చేరుకుంటుందన్న అంచనా ఉంది.
ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారు 7.96 బిలియన్ల కు చేరింది. అదే భూమి,అవే వనరులు పెరిగిన జనాభా కు సరిపెట్టడం సాధ్యమా? యుద్దాలవలన,వివిధ రకాల మహమ్మారుల వలన గతంలో చాలా దేశాల్లో విపరీతమైన జననష్టం జరిగింది. జనసంఖ్య తగ్గడంతో కొన్ని దేశాలు ఆర్ధికంగా ప్రగతి సాధించాయి.కొన్ని దేశాలు జనాభా పెరగడంతో ఆర్ధికంగా వెనుక బడ్డాయి. 1987 వ ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా పెరుగుదలను అరికట్టాలని పిలుపునిచ్చింది. సందర్భానుసారంగా జరిగే జనాభా ఉత్సవాలు కేవలం ప్రహసనాలుగా మిగిలి పోతున్నాయి. ఇకనైనా ప్రపంచం మేలుకోవాలి. రాబోయే జనాభా పెరుగుదల ప్రళయాన్ని ఆపాలి. నేటి ప్రపంచం అన్ని రంగాల్లో ముందంజలో పయని స్తున్నది. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఈ మార్పుల పర్యవసానంగా అనేక దేశాలు అభివృద్ధి చెందాయి. అనేక మందికి ఉపాధి లభిస్తున్నది. అయితే అభివృద్ధి అనేది కొద్ది దేశాలకే పరిమితమైనది. వర్ధమాన దేశాలు దశాబ్దాలు గడిచినా ఇంకా అభివృద్ధి చెందిన దేశాలుగా పరివర్తన చెందకపోవడానికి కారణం జనాభా సమస్య. జనాభా సమస్య కారణంగా వివిధ దేశాలలోని మానవ వనరులు పరాయి దేశాల అభివృద్ధి కి సోపానాలుగా వినియోగించబడుతున్నాయి.
జనాభా పెరుగుదల అభివృద్ధి పై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నమాట యథార్థం.ఏదైనా ఒక నిర్ధిష్ఠ ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే ‘‘జనాభా’’ అని నిర్వచించవచ్చు. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభా సంఖ్యను జనసాంద్రత అంటారు. ఈ జనసాంద్రతను బట్టే ఆయా దేశాల అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా,భారత్ లు మొదటి,రెండవ స్థానాలను ఆక్రమించాయి. అయితే అధిక జనాభా కలిగినప్పటికీ చైనా ఒక అగ్రరాజ్యంగా,అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడడానికి కారణం ఆ దేశంలో జనసాంద్రత మనకంటే తక్కువ గా ఉండడమే. సరికొత్త గణాంకాల ప్రకారం 140 కోట్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి ఇండియా జనసాంద్రత 427.9 కాగా,145 కోట్లతో అత్యధిక జనాభా గల దేశం గా అవతరించిన చైనా జనసాంద్రత 154. మాత్రమే. ఈ తారతమ్యమే ఇరుదేశాల జి.డి.పి లోని వ్యత్యాసానికి మూలకారణం. అమెరికా జనాభా 33 కోట్లు దాటింది కాగా,జనసాంద్రత కేవలం 34 .పాక్ జనాభా 22 కోట్లు,జనసాంద్రత 287. ఈ కారణంగానే ఆర్ధిక అసమానతలు ఏర్పడుతున్నాయి.
భూభాగం తక్కువ,జనాభా ఎక్కువగా ఉంటే పెరుగుతున్న జనాభాకు చోటెక్కడ? నిలువ నీడెక్కడ?
చైనా, ఇండియాల తర్వాత అమెరికా, ఇండోనేషియాలు, పాక్,బ్రెజిల్ దేశాలు అధిక జనాభాను కలిగి ఉన్నాయి. ఉత్తర అమెరికాలో కెనడా,యు.ఎస్, మెక్సికో లు అధిక జనాభాను కలిగి మొత్తం ఖండంలో 90% శాతం జనాభాను ఈ దేశాలే ఆక్రమించాయి. దక్షిణ అమెరికాలో బ్రెజిల్, కొలంబియా, అర్జెంటినాలు అధిక జనాభా గల దేశాలు. ఆసియా ఖండం ప్రపంచ జనాభాలో సుమారు 59 శాతం, ఆఫ్రికా 17శాతం, యూరోప్ 9.5 శాతం, ఉత్తర,దక్షిణ అమెరికాలు ప్రపంచ జనాభా లో 10 శాతం పైగా ఆక్రమించాయి. ప్రపంచ జనాభాలో సగభాగం పైగా ఆసియా ఖండం ఆక్రమించింది.2025 నాటికి అసియాలో మరింత గా జనాభా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే భారత్ జనాభా చైనా ను మించి పెరిగే అవకాశాలున్నాయి.
1987 వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నది. ఈ విషయాన్ని గమనించి,అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదల వలన ఏర్పడే విపత్కర పరిణామాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి విశేష కృషి చేస్తున్నది.సుమారు మూడు దశాబ్దాలకు పైబడి ప్రతీ ఏటా జనాభా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఫలితం మాత్రం నామమాత్రం. జనాభా సంఖ్య ఊహాతీతంగా పెరుగు తూనే ఉంది. పేదరికం కూడా అదే నిష్ఫత్తిలో పెరుగుతున్నది. ఉగ్రవాదం,మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,ఇతర అసాంఘిక కార్యకాలాపాలకు, శాంతి భద్రతల సమస్యకు మూలకారణం జనాభా సమస్య. పెరిగిన జనాభాకు సరైన సౌకర్యాలు అందిం చలేక ప్రభుత్వాలు సతమతమౌతుంటే యువత బ్రతుకు దెరువు కోసం అసాంఘిక కార్యకాలాపాల వైపు మళ్ళుతున్నది. ఈ పరిస్థితిని నిలువరించాలి.యువశక్తిని అభివృద్ధికి వినియోగి ంచాలి.వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించాలి. అందరికీ అన్ని సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు లభించాలంటే జనాభా విస్ఫోటనాన్ని అరికట్టాలి. కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలి.
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఏ దేశ జనాభాకు సరిపడా వనరులుండాలి.విద్య,వైద్య,ఆరోగ్యసదుపాయాలు,ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండాలి.తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభా తో బాధపడే దేశాలు అభివృద్ధి ని సాధించలేవు.అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం కష్టం. ఈ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటున్నాయి. విద్య,వైద్య,వసతి సౌకర్యాలు అరకొరగా ఉంటున్నాయి.సరైన విద్యా సదుపాయాలు లేక నైపుణ్యం కొరవడి ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్నాయి.ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోవడం,ఉన్నత చదువులు చదివి స్వదేశంలో సరైన ఉపాధి లేక విదేశాలకు పోవడం వలన ‘‘బ్రెయిన్ డ్రెయిన్’ సమస్య ఏర్పడింది.మత విశ్వాసాలు,మూఢ నమ్మకాలను ప్రక్కన బెట్టి శాస్త్రీయ దృక్పథంతో వాస్తవ పరిస్థితులను ప్రజలు అర్ధం చేసుకోవాలి.