కూల్చివేతపై స్టేకు నిరాకరణ..!
కూల్చివేతలపై హైడ్రా పరిధిని ప్రశ్నించిన హైకోర్టు
అనుమతి తీసుకున్న నిర్మాణాలను కూల్చివేయడమేంటని స్యాయస్థానం ప్రశ్న
హైదరాబాద్, ఆగస్ట్ 21(ఆర్‌ఎన్‌ఎ) : జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం..నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీని ధర్మాసనం సూచించింది. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది, ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించారా? అని ప్రశ్నించింది.
హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందని, ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులను రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామని తెలిపారు. ఈ పిటిషన్‌కు విచారణర్హత లేదని, కొట్టివేయాలని కోరారు. 2014లో జన్వాడలో ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారని, 2019లో ప్రదీప్ ఫామ్ హౌజ్ కొనుగోలు చేసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ ఎందుకు కూల్చాలనుకుంటున్నారు? ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్‌టీఎల్ గుర్తుకు రాలేదా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని సూచించింది. ప్రాథమికంగా నోటిఫై చేశామని.. తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని ఏఏజీ తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
అనుమతి తీసుకున్న నిర్మాణాలను కూల్చివేయడమేంటని హైకోర్టు ప్రశ్న
స్థల యజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని, 15-20 ఏళ్ల తర్వాత హైడ్రా వొచ్చి అక్రమ నిర్మాణమంటూ కూల్చివేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఏఏజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలో హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని ఏఏజీ పేర్కొన్నారు. మరోవైపు చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ తెలిపారు. ప్రదీప్‌రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ జీ ఓ 111లోకి వొస్తుందని పేర్కొన్నారు. జీ ఓ 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌజ్‌లు నీటిపారుదల శాఖ చూస్తుందని వివరించారు.
వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదని ఏఏజీ తెలిపారు. కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. కాగా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్‌పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజినీర్‌ను చేర్చారు. ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్, పొలం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 14న తన ఫామ్ హౌస్‌ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ లేదని ఆధారాలు చూపించానని తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నిర్మాణం ఉందని అధికారులు వాదించారన్నారు. 2019లో ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేశానని, రాజకీయ కారణాలతో తన ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని ప్రదీప్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.