జర్నలిజాన్ని రక్షించండి

  •  గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి
  • జర్నలిస్టులంటే ఎంతో గౌరవమన్న తమిళిసై

దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. మీడియా రంగం పట్ల పాలకుల కుట్రలను నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఇచ్చిన “సేవ్ జర్నలిజం” దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా టీయూడబ్ల్యూజే హైదరాబాద్ లో ఆందోళన చేపట్టింది. అనంతరం ఐజేయూ అధ్యక్షులు  కే. శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసింది.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మీడియా స్థితిగతులను, జర్నలిస్టుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాగా ఆమె ఎంతో ఓపికగా విన్నారు. పాలకుల ఇష్టాయిష్టాలకు లొంగని జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కక్ష్యసాధింపు ధోరణులు సరైంది కాదని ఆయన సూచించారు. బడా కార్పోరేట్ సంస్థల ఆధిపత్యం నుండి మీడియాను తప్పించాలని ఆయన కోరారు. సంపాదకుల, స్వతంత్ర జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాలన్నారు.

జర్నలిస్టులపై క్రూరమైన చట్టాల ప్రయోగాన్ని వెంటనే నిలిపివేయలన్నారు. ఐటీ నిబంధనల ముసుగులో డిజిటల్ మీడియాకు సమస్యలు సృష్టించడం సరైంది కాదన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జర్నలిస్టులు సాధించుకున్న రైల్వే ప్రయాణాల్లో రాయితీ లాంటి సౌకర్యాలను పునరుద్ధరించాలన్నారు. 

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై దాడులను అరికట్టి, అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. జర్నలిస్టుల భద్రతకు కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.  ఈ సందర్భంగా గవర్నర్ స్పందిస్తూ జర్నలిస్టులంటే తనకు ఎంతో గౌరవమని, వార్తల సేకరణ కోసం నిద్దరహారాలు మాని శ్రమిస్తుంటారన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏళ్ల వేళలా తన సహకారం ఉంటుందని భరోసానిచ్చారు. గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, కోశాధికారి కే. మహిపాల్ రెడ్డి, హెచ్.యు.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, అబ్దుల్ హమీద్ షౌకత్ లు ఉన్నారు.

పిఐబీ కార్యాలయం ముందు ఆందోళన 

ఐజేయూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం రోజు హైదరాబాద్ లోని కవాడిగుడలో సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తెలంగాణ రీజియన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. అనంతరం పీఐబీ జాయింట్ డైరెక్టర్ వి.బాలకృష్ణ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రతినిధి బృందం అందించింది.

 

 

Show quoted text

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page