ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ‘ఇచ్చిన మాట తప్పం’
గ్రేటర్ పరిధిలో జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే సమావేశం
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం
అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం
మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 09 : పాత్రికే యుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు.
హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగ శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అయిన కాంగ్రెస్… ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్దితో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, వాటిని పరిష్కరించడంలో మీడియాది ప్రముఖ పాత్ర ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో హెచ్.యూ.జే తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు. అక్రిడేషన్, హెల్త్ కార్డ్స్, ఇండ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్గర్ మెమోరియల్ అవార్డ్ స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డికి ప్రధానం చేశారు. మీడియా అకాడమీ ఛైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి, టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన కె.విరాహత్ అలీలతో పాటు, కార్యదర్శి వి.యాదగిరి, కోశాధికారి వెంకట్ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్ కుమార్, టియుడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, అనిల్, గౌస్ మోహినుద్దీన్ తదితరులను మంత్రి పొన్నం సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ.మాజీద్, ఐజేయు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, హెచ్.యూ.జే కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.