- కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి
- నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు
- తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర
- మోసపోతే గోస పడుతాం
- మేడ్చెల్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్
- 24 గంటల కరెంట్ దేశానికే ఆదర్శమని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. అభివృద్ధి చెందిన తెలంగాణను ధ్వంసం చేసే కుట్ర జరుగుతుందని బిజెపిపై మరోమారు ఫైర్ అయ్యారు. అభివృద్ధి చెందిన తెలంగాణను ఇలాగే ముందుకు తీసుకునిపోవాల్సి ఉందన్నారు. కానీ దీన్ని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కొనసాగడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వారు ఎప్పటికీ ఉంటారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మేడ్చల్ జిల్లా శావి•ర్‌పేట సవి•పంలోని అంతాయిపల్లి వద్ద 30 ఎకరాల్లో 56 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్ ఎస్ హరీశ్‌ను కూర్చుండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి. శుభాకాంక్షలు తెలిపారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శావి•ర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సవి•కృత కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎస్ హరీశ్, తదితరులు పాల్గొన్నారు. మనం జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఏమాత్రం మోసపోయినా గోస పడతామని ప్రజలను సీఎం హెచ్చరించారు. మేడ్చల్‌లో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ప్రజలకు పరిపాలన ఎంత దగ్గరకు వొస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. మనం ఆంధప్రదేశ్‌లోనే ఉంటే నిరంతర విద్యుత్, సంక్షేమం వొచ్చేదా అని ప్రశ్నించారు. దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరగాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తాం. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లీ ఏకం కావడం కష్టం. అభివృద్ధి చెందిన దేశాల బాటలో కుల, మత రహితంగా ముందుకు సాగాలి. నీచ రాజకీయల కోసం ఎంతకైనా తెగించే ఎప్పటికీ ఉంటారు. అందుచేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలం అన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కరెంటు పోదని, కానీ దేశరాజధాని దిల్లీలో మాత్రం 24 గంటల కరెంటు రాదని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ఈ విషయం పదే పదే చెప్పడానికి కారణం ఉందన్నారు. హైదరాబాద్‌లో కరెంటు పోదు..అదే దేశరాజధాని దిల్లీలో 24 గంటల కరెంటు రాదు. దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా. ఆదిలాబాద్ గోండు గూడెంలో, వరంగల్ లంబాడీ తండాలో, హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఎక్కడైనా సరే 24 గంటలూ ఉంటుంది. ఇంతకు ముందు చాలా మంది కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్లు, పొడుగున్నోళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళెందుకు కరెంటు ఇవ్వలేదు? ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే మెదడు రంగరించి ఫలితాలు సాధిస్తారు. ఒకప్పుడు మంచి నీళ్ల కోసం నానా తంటాలు పడేవాళ్లు. ట్యాంకర్ల వెంటపడేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
అంతకు ముందు కలెక్టరేట్ వద్దకు వొచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివర్ణ బెలూన్లను ఎగుర వేశారు. మేడ్చల్‌లో గ్రావి•ణ ప్రాంతాలు తక్కువ. దాంతో ఇక్కడ పరిశ్రమలు వొస్తాయి. ఉపాధి దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. వీటి వల్ల చాలా పనులు చెయ్యాల్సి వొస్తుంది. వీటికోసం అందరు ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల నిధులు ఇచ్చాం. ఇవి చాలడం లేదని ఎమ్మెల్యేలు చెప్పారు. అందుకే ఈ ఏడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు మరో రూ.పది కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా. రేపే దీనికి సంబంధించి జీవో విడుదల చేస్తా. ఇలా మనకు నిధులు ఉన్నాయి. కానీ కొందరు మూర్ఖులు కారుకూతలు కూస్తున్నారని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను ఎప్పుడో చెప్పా. ఎందుకంటే మనకున్న వనరులు అలాంటివి. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొలిచే విధానంలో రెండు ముఖ్యమైన విషయాలుంటాయి. వాటిలో ఒకటి తలసరి ఆదాయం. ఒకప్పుడు ఇది కేవలం రూ.లక్షగా ఉండేది. ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్‌గా రూ.2,78,500కు పెరిగింది. మనకన్నా ముందే రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లను మనం దాటేశాం. ఇది వట్టిగానే జరుగుతుందా? అవినీతి రహితంగా అనుకున్నది అనుకున్నట్లు చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుంది. తెలంగాణ రాష్ట్రం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమమైన జీతాలు దొరుకుతాయని చెప్పా. ఇప్పుడు మన ప్రభుత్యోద్యోగులే దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్నారు. పేద పిల్లల పెళ్లిళ్లు జరిగితే ఏ రాష్ట్రంలోనైనా రూ.లక్ష ఇస్తున్నారా? ఇప్పటికే పదకొండు లక్షల కుటుంబాలకు రూ.9వేల కోట్లపైగా ఖర్చు చేశాం.
దేశంలో మరెక్కడా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వరు. వికలాంగ సోదరులకు రూ.3016 ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటే. ఈ మధ్యనే డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. వీళ్లకే కాదు చేనేత, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి ఇస్తున్నం. చాలామంది తెలంగాణ పల్లెల్లో ఏమమ్మా ఎలా ఉన్నావ్? అనడిగితే..హైదరాబాద్‌లో నా పెద్దకొడుకు కేసీఆర్ ఉన్నాడు. డబ్బులు పంపిస్తాడని చెప్తున్నారు. అందుకే చాలా మంది కోడళ్లు అత్తమామల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముసలాళ్లే మోతుబరిగా ఉన్నారు. నేను పంపే డబ్బులో కూడా ఎంతో కొంత దాచుకుంటున్నారు. బియ్యానికి కూడా గతంలో ఇంట్లో ముగ్గురు, నలుగురికే ఇస్తామనే వారు. ఇప్పుడు ఎంత మంది ఉంటే అంతమందికి నాలుగు కాకుండా ఆరు కిలోలు ఇస్తున్నాం అని వివరించారు. మన వనరులు మనకే దక్కడంతో ఆర్థికంగా మనం పెరిగినట్టు కెసిఆర్ వెల్లడించారు. జీఎస్‌డీపీ అంటే రాష్ట్ర స్థూలఉత్పత్తి. ఇది కూడా ఒక గీటురాయి. ఇది 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5 లక్షలకోట్లు ఉండేది. ఇయ్యాల అది అద్భుతంగా పెరిగి రూ.11.5 లక్షలకోట్లకు చేరింది. అధికారులు అంకితభావం, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి, ప్రభుత్వం లక్ష్యశుద్ధి వల్లే ఇది సాధ్యమైంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ప్రారంభించుకున్న కలెక్టరేట్ వంటి భవనాలు కూడా లేవు. మొత్తం 33 జిల్లాల్లో వీటితోపాటు పోలీసు భవనాలు కూడా తీసుకొస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం కూడా మనదే. వీటిలో చదువుకుంటున్న పేద విద్యార్థులు దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు సాధిస్తున్నారు. కొరోనా రాకుంటే మరిన్ని గురుకులాలు పెంచేవాళ్లం. ఈ మధ్య బీసీల కోసం కొన్ని పెంచినా..మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ల కొరత కూడా తీర్చుకున్నాం. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి కూలీల కోసం పోయేవారు. ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకు బతుకుతెరువు కోసం వొస్తున్నారు. వాళ్లందరికీ పని కల్పించే అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగాం. ఉద్యమకాలంలో ఏది కావాలని కోరుకున్నామో అది సాధించుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎవరూ మేడ్చల్ జిల్లా అవుతుందని ఏనాడూ కల కూడా కనలేదన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల కలిగిన శుభపరిణామం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వొస్తే అంత చక్కగా పనులు జరిగే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సమయంలో జిల్లా చేసే సందర్భంగా పెద్దగా చెర్చ జరిగింది. మూడు జిల్లాలు అవుతాయని చెప్పారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కావొచ్చు..అలా చేస్తే భవిష్యత్‌లో బాగుంటుందని పెద్దలు చెప్పడం, ప్రజాప్రతినిధులు, మంత్రులు కోరడం.. జనాభాను పరిశీలించినప్పుడు చాలా పెద్ద జిల్లాగా ఉండడం, పరిపాలన సౌలభ్యం గొప్పగా ఉండాలంటే, ప్రజలకు అన్నీ మంచి పనులు నెరవేరాలంటే తప్పకుండా మేడ్చల్ జిల్లా కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే 33 జిల్లాలు వొచ్చినయ్. రైతులు వేదికలు ఏర్పాటు చేయాలంటే మన రాష్ట్రంలో మన వ్యవసాయ భూమిని ప్రతి 5వేల ఎకరాలకు క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, ఒక్కో వ్యవసాయాధికారిని నియమించాం.
2601 క్లస్టర్లు అయ్యాయి. వాటన్నింటికి కూడా పేరుకే రైతులు కానీ..కూర్చుకునేందుకు వేదిక లేదని చెప్పి..ఆరేడు నెలల్లో నిర్మించాం. పరిపాలన వికేంద్రీకరణ జరిగిందింది కాబట్టి.. అంత సులభంగా భవనాలు కట్టుకోగలిగాం. రాష్ట్రంలో ఇప్పటికే 11వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకాబోతున్నాయి. రాష్ట్రంలో తీసుకున్న కార్యక్రమాల ప్రజలకు చకాచకా ప్రజలకు వేగంగా అందుతున్నయ్. ఇవాళ మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు..దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు అద్భుతంగా ఈ రోజు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దళారీల ప్రమేయం లేకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఠంచన్‌గా వారందరికీ అందుతున్నయన్నారు. రాష్ట్రంలో 36లక్షల పెన్షన్లు ఉన్నయ్. మరో 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి పంచుతున్నం. కరోనాతో కొంత ఆలస్యమైంది. 57 సంవత్సరాల వారికి ఇస్తామని చెప్పాం. కొరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తికమక అయిన పరిస్థితుల్లో కొంత ఆలస్యమైంది. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటే 46లక్షలకు పెన్షన్లు చేరుకుంటున్నయ్. ఈ 46లక్షల పెన్షన్‌దారులకు అద్భుతమైన కొత్త కార్డులు ఎలక్ట్రానిక్ బార్‌కోడ్లతో పంపిణీ చేస్తున్నారు. రాబోయే వారం పదిరోజుల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.