టార్గెట్‌ ‌హరీష్‌ ‌రావేనా?

రేవంత్‌ ‌రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి!
సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం
నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు
సిద్ధిపేటపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌
‌స్థానికంగా మరింతగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరగనుందా?
హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు

‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌ ‌స్టోరీ…

(ఎ.సత్యనారాయణ రెడ్డి)
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : చూస్తుంటే…బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూ•ర్‌, ‌సిద్ధిపేట శాసన సభ్యుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావుపై, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టినట్లు కనబడుతుంది. సిద్ధిపేటలో గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు…తాజాగా సెబీ ఛైర్‌పర్సన్‌ అ‌క్రమాలపై విచారణ చేపట్టాలంటూ జాతీయ కాంగ్రెస్‌ ‌పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడి)కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…
నిన్న మొన్నటి వరకు సిద్ధిపేటకు మా మైనంపల్లి వెళ్లాడు…ఇక నుంచి మా జగ్గన్న(టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే)ను పంపిస్తున్నానంటూ మాట్లాడిన మాటలను చూస్తుంటే ఎమ్మెల్యే హరీష్‌ ‌రావును సిఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌ ‌చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి సిఎం రేవంత్‌రెడ్డి మాటల దాడిని తీవ్రం చేయడమే కాకుండా, ఈ ఇద్దరు నేతల్లో మరీ ముఖ్యంగా హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు మరింత పదును పెడుతున్నారు.
సిద్ధిపేటలో హరీష్‌ ‌రావుతో అమీతూమీ తేల్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వరుస పర్యటనలు, బైక్‌ ‌ర్యాలీలు, సవాళ్లతో పొలిటికల్‌ ‌హీట్‌తో సిద్ధిపేట ఉడుకుతుంది. ఇది చాలదన్నట్లుగా…ఇక జగ్గారెడ్డిని సిద్ధిపేటకు పంపిస్తానని స్వయంగా సిఎం రేవంత్‌రెడ్డి చెప్పడం చూస్తుంటే ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుపై ఎంత కసిగా ఉన్నాడోనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో కొత్త టాక్‌ ‌నడుస్తుంది. ఇదిలా ఉంటే,  గత కొన్ని రోజులుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, ‌ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌కు మధ్య రైతు రుణమాఫీపై మాటల మంటలు, ఫ్లెక్సీల యుద్ధం నడుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 15(పంద్రాగస్టు)వరకు రైతులకు 2లక్షల రుణమాఫీ చేసినందున…
image.png
రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానన్న హరీష్‌రావు ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలంటూ ఈ నెల 16న అర్ధరాత్రి వేళ…సిద్ధిపేటలో ‘దమ్ముంటే రాజీనామా చెయ్‌..‌రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే అగ్గిపేట హరీష్‌ ‌రావు’అంటూ.. కాంగ్రెస్‌ ‌పార్టీ సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పూజల హరికృష్ణ యువసేన పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హోర్డింగ్‌ ‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణుల మధ్య  వివాదం రాజుకుంది. హరీష్‌ ‌రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన హోర్డింగ్‌పై స్థానిక బిజెఆర్‌ ‌చౌరస్తా వద్ద బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హరీష్‌ ‌రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన హోర్డింగ్‌ను బిఆర్‌ఎస్‌ ‌నేతలు తీసేసే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి బిఆర్‌ఎస్‌ ‌నేతలను వాహనంలో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ ‌నేతృత్వంలో కొందరు స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను చించివేయడంతో పాటు హరీష్‌రావు ఫోటోలు ఉన్న హోర్డింగ్‌లను కూడా చించివేశారు. పోలీసులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని కేసీఆర్‌, ‌హరీష్‌రావు ఫ్లెక్సీలను చించివేసిన కాంగ్రెస్‌ ‌శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఆ తెల్లవారు జామున బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు సిఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా..
దీనికి నిరసనగా కాంగ్రెస్‌ ‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ‌నాయకులు ఎమ్మెల్యే హరీష్‌రావు క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. కొందరు కాంగ్రెస్‌ ‌నాయకులు క్యాంపు కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. హరీష్‌ ‌రావు  కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ ‌నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞత పేరుతో రాజీవ్‌గాంధీ జయంతి(ఆగస్టు 20)రోజున మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో వందలాది కార్ల కాన్వాయ్‌తో, పొన్నాల రాజీవ్‌ ‌గాంధీ విగ్రహం నుండి సిద్ధిపేట పాత బస్టాండ్‌ ‌వరకు భారీ బైక్‌ ‌ర్యాలీగా బయలుదేరాడు.
అదే రోజు సంపూర్ణ రైతు రుణమాఫీ సాధనకై తాజా మాజీ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంటర్నల్‌ ‌సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోటా పోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో మళ్లీ ఏమైనా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో సిద్ధిపేట పట్టణంలో జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం వేలాది మంది పోలీస్‌ ‌బలగాలను మోహరించింది. కాంగ్రెస్‌ ‌నేత మైనంపల్లి బైక్‌ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా వెళ్లితే గొడవలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బారీకేడ్లను, భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు మైనంపల్లి బైక్‌ ‌ర్యాలీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కాకుండా బైపాస్‌, ‌భారత్‌నగర్‌ ‌మీదుగా పాత బస్టాండ్‌ ‌వరకు వెళ్లేలా పోలీస్‌ ఉన్నతాధికారులు మైనంపల్లిని ఒప్పించడంతో ఆరోజు ఎలాంటి టెన్షన్‌ ‌లేకపోవండతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, హారీష్‌రావు రాజీనామా ..ఏడబోయే ఫ్లెక్సీతో రాజుకున్న వివాదంతో సిద్ధిపేట గత కొన్ని రోజులుగా అట్టుడుకుతుంది. పోలీసుల వలయంలోనే ఇంకా  సిద్ధిపేట ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అగ్గికి ఆజ్యం పోసినట్లుగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఇక సిద్ధిపేటకు జగ్గన్న(జగ్గారెడ్డి)ను పంపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలతో ఇప్పట్లో సిద్ధిపేటలో టెన్షన్‌ ‌వాతావారణం తగ్గేలా కన్పించడం లేదు. బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్య నెలకొన్న మాటలు, ఫ్లెక్సీల ‘వార్‌’‌మరింత పెరిగే అవకాశం ఉంటుందని అటు పోలీసులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఇదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు రాజకీయాలలో ఇదే హాట్‌ ‌టాపిక్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page