ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై ఒద్దిరాజుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

తెలుగు సాహిత్యంలో ఒద్దిరాజులది ప్రత్యేక స్థానం
•వారి రచనలు, సాహిత్యం, నవలలు మెచ్చని వారులేరు..
•ఒద్దిరాజుల పాండిత్యానికి పీవీ సాష్టాంగం..
•తెనుగు పత్రిక నడిపిన తీరు అమోఘం
•పత్రిక ద్వారా నిజాం, బ్రిటిషర్ల దురాగతాలను వెలుగులోకి..
•సీనియర్‌ ఎడిటర్‌ ‌దేవులపల్లి అమర్‌
•మానుకోటకు వారి పేరు పెట్టాలి
: ఒద్దిరాజు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్మెన్‌ ఒద్దిరాజు సుభాష్‌

‌మరిపెడ(ఇనుగుర్తి), ప్రజాతంత్ర, ఆగస్ట్27: ‌తెలుగు సాహిత్యాన్ని అవపోసన పట్టి, రచనలకు కొత్త సొబగులు అద్ది యావత్‌ ‌తెలుగు వారిని వారి ఏకాంకికలు, నవలలు, కవితలు, వార్తలతో కట్టి పడేసిన ఒద్దిరాజు సోదరులు రాఘవ రంగారావు, సీత రామచంద్రరావు ఎప్పటికి చిరస్మరణీయులని సీనియర్‌ ‌జర్నలిస్టు, దేవులపల్లి అమర్‌ అన్నారు. 1922లో తొలిసారిగా తెనుగు పత్రికను స్థాపించి మారుమూల ప్రాంతమైన మానుకోట జిల్లా ఇనుగుర్తి నుంచి ఆరున్నరేళ్లు పత్రికను వారు నడిపించిన తీరు అమోఘమన్నారు. ఎలాంటి ప్రచార సాధనాలు, కనీసం రోడ్డు వసతులు కూడా లేని ఆరోజుల్లో వారి పత్రిక జిల్లాలు దాటి వెళ్లటం అంటే వారి జర్నలిజం, వారి పట్టుదల కృషి ఎనలేదనిదన్నారు. మంగళవారం ఒద్దిరాజు ఛారిటబుల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్టు చైర్మెన్‌ ఒద్దిరాజు సుభాష్‌ ‌చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెనుగు పత్రిక శత వత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఒద్దిరాజు సొదరుల కుటుంబంతో వారికి ఉన్న అనుబంధం, వారి రచల గురించి, వారి పత్రికా విలువల గురించి వివరించారు. ఒద్దిరాజు సోదరులు తెలుగు కీర్తికి ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రాంతం నిజాం చేతిలో నలిగి పోతుంటే వారికి వ్యతిరేకంగా కథనాలు, వార్తలు రాసి వారి పత్రికలో ముద్రించి సైకిల్‌ ‌మీద వివిధ ప్రాంతాలకు చేరవేశారు. అంతే కాకుండా బ్రిటిషర్ల దురాగతాలను, దేశ స్వతంత్ర విలువ, తెలంగాణ ప్రాంత విమోచనం కోసం వారు పత్రికా ముఖంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. ఒద్దిరాజు సోదరుల కీర్తిని మహామహా కవులు గుర్తించి వారిని సకల రంగాల ప్రావీణ్యులుగా గుర్తించారని, 63కళలు తెలిసిన వారు చోర కళ లేకపోయిన వారి కవితలు, నవలలు, రచనల ద్వారా తెలుగు వారి మనసులను దోచుకున్న చోరులే అని చమత్కరించారు. వారి పాండిత్యానికి సాక్షాత్తు మాజీ ప్రధాని, బహుబాషా కోవిదుడు పీవీ నర్సింహారావు సాష్టాంగ పడ్డారంటే వారి విజ్ఞానానికి అంతా నమస్కరించాల్సిందే అన్నారు. స్వతహాగా తెలుగు వారే అయినా 7 భాషల్లో  అనర్కలంగా మాట్లాడగల ఉద్దండులు ఒద్దిరాజు సోదరులు అని కొనియాడారు.

ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..
ఇనుగుర్తి గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ఆ సోదరులకే దక్కుతుందన్నారు. అంతటి తెలుగు సాహితి కారులను నాడు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హయాంలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో మూడు ప్రాంగణాలు నిర్మించారే కానీ, పత్రికా రంగానికి, తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన వారి విగ్రహాలను ట్యాంగ్‌ ‌బండ్‌ ‌పై ప్రతిష్టించాలన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని, ప్రభుత్వానికి తన తరపున నివేదిస్తామన్నారు. అన్ని రంగాల్లో ఒద్దిరాజులు నేర్పరులు అలాంటి వారి స్వగ్రామమైన ఇనుగుర్తిలోని వారి ఇంటికి ఆధునీకరించి, వారి రచనలు, కవితలు, వారి పుస్తకాలను మ్యూజియంగా ఏర్పాటు చేసి భావి తరాలకు వారి గురించి తెలిసేలా చేయాలన్నారు. అదే విధంగా తమ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా ఎడ్యూకేషన్‌ ‌ఫౌండేషన్‌ ‌శిక్షణ పాఠశాలలో సెలబస్‌ ‌లో ఒద్దిరాజు సోదరుల గురించి పాఠ్యంశంగా చేర్చుతామన్నారు. అదే విధంగా తెలుగు పత్రికా రంగానికి వారు అందించిన విశేష సేవల గురించి ఫౌండేషన్‌ ‌నుంచి శిక్షణ పొందే ప్రతి జర్నలిస్టుకు తెలియజేస్తామన్నారు.

మానుకోట జిల్లాకు ఒద్దిరాజుల పేరు పెట్టాలి: ఒద్దిరాజు సుభాష్‌
‌తెలుగు భాషకు, పత్రికా రంగానికి, ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన ఒద్దిరాజు సోదరుల పేరును జిల్లాకు పెట్టాలని, అదే విధంగా ఇనుగుర్తి గ్రామంలో వారి విగ్రహాలను ప్రతిష్టింప జేయాలని ఒద్దిరాజు ఛారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్మెన్‌ ఒద్దిరాజు సుభాష్‌ ‌చంద్ర కోరారు. పత్రిక స్థాపించిన అనంతరం ఆరున్నరేళ్లకు దానిని వరంగల్‌ ‌కు మార్చడం అనంతరం ఆ పత్రిక మూత పడటంతో వారి వార్తలు నిలిచిపోయాయని, కానీ వారి రచనలు, ఏకాంకికలు ఇంకా ప్రజల్లో ఉన్నాయన్నారు. వారు రాసిన సౌదామిని పరిచయం పుస్తకాన్ని కాకతీయ యూని వర్సిటీ ముద్రించి ప్రస్తుతం ఆ పుస్తకం పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తున్నారన్నారు.

 

అంతే కాకుండా వారి క్లిష్టమైన పద్యాలను మాధ్యమిక విద్య, డిగ్రి కోర్సుల్లో చేర్చారన్నారు. విద్యుత్‌ ‌కూడా లేని ఆ రోజుల్లో వార్తలు రాసి ప్రింటింగ్‌ ‌చేసి వాటిని ప్రజలకు చేరవేసి వారిలో చైతన్యం నింపిన తొలితరం జర్నలిస్టులైన ఒద్దిరాజుల సేవలు ఎనలేనివన్నారు. నేటి జర్నలిస్టులకు వారి కథనాలు స్ఫూర్తి దాయకమన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ ‌జర్నలిస్టులు, సామాజిక రంగంలో విశేష సేవలందించిన రాజమౌళి, పరకాల రవీందర్‌, ‌సంపత్‌ ‌లను శాలువాతో సత్కరించి మెమోంటోలు అందించారు. అనంతరం ముఖ్య అతిథి దేవులపల్లి అమర్‌ ‌ను ట్రస్ట్ ‌సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్‌ ‌కార్యదర్శి వనం లక్ష్మీ కాంతరావు, టీయూడబ్లయూజే ఐజేయూ 143 సెక్రెటరీ పర్కాల రవీందర్‌, ‌ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు కిషన్‌, ‌మాజీ సర్పంచ్‌ ‌దార్ల రామ్మూర్తి, పీఏసీఎస్‌ ‌చైర్మెన్‌ ‌దీకొండ వెంకన్న, రైతు కోఆర్డినేటర్‌ ‌మంగ్యానాయక్‌, ‌పంజాల వాసుదేవ్‌, ఒద్దిరాజు శ్యాంసుందర్‌, ‌గంజి జనార్ధన్‌, ‌రచయితలు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page