డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తం

క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందికి తగు సూచనలు
వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలకు ఆదేశం

రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలను నియంత్రించేం దుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎం‌సీతో పాటు ఇతర మున్సిపాలిటీలు, గ్రామాల్లో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్‌ ‌జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌జ్వరాలను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, ‌పంచాయతీ రాజ్‌ ‌శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ వ్యాధులు ప్రబలకుండా ముఖ్యంగా డెంగీ నివారణ చర్యల గురించి ప్రజలను చైతన్యపరచుటకై అవగాహన, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జ్వర సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని మున్సిపల్‌, ‌పంచాయతీ రాజ్‌ ‌శాఖ అధికారులను ఆదేశించింది. ప్రతి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశిరచింది. ఈ కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమ సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులందరు సామాజిక భాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. డెంగీ కేసుల నిర్దారణకై రాపిడ్‌ ‌కిట్స్‌ను అన్ని బస్తీ దవాఖానాలలోను, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలోను అందుబాటులో ఉంచింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్‌ ‌శాఖ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బందిని ఈ కార్యక్రమాల నిర్వహణలో వారి సేవలను విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులు కూడా తమ గృహాల్లో ప్రతి ఆదివారం పది నిమిషాల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్‌ ‌మాద్యమంలో బాగా ప్రచారం నిర్వహించాల న్నారు. డెంగీ జ్వరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలను, వాల్‌ ‌పోస్టర్లను, రేడియో, స్ధానిక టీవీ చానళ్ళలో వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో విస్తృత ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు కావని, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్‌ ‌మాత్రలు వాడాలని, పండ్ల రసాలు (ద్రవ పదార్దాలు) ఎక్కువ మొత్తంలో తీసుకోనేలా ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కంటి లోపలి భాగంలో నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాలు, కీళ్ళ నొప్పులు, చర్మంపై దద్దుర్లు, పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం (తీవ్రమైన కేసులలో మాత్రమే), డెంగీ హెమరేజిక్‌ (‌రక్తస్రావం) జ్వరం ఈ విధంగా లక్షణాలు ఉంటాయని ప్రజలకు తెలియపరిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page