రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగ్యూ, సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ పట్టణాలలో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
ఈ వ్యాదులు ప్రభలకుండా ముఖ్యంగా డెంగ్యూ నివారణ చర్యల గురించి ప్రజలను చైతన్యపరచుటకై అవగాహన, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
జ్వర సర్వే నిర్వహించాలని అధికారులకు సూచనలు జారీచేసింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. ప్రతి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం గం.10.10 ని. లకు ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్య కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమ సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని, పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులందరు సామాజిక భాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. డెంగ్యూ కేసుల నిర్దారణకై రాపిడ్ కిట్స్ లను అన్ని బస్తీ దవాఖానాలలోను, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలోను అందుబాటులో ఉంచింది.
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బందిని ఈ కార్యక్రమాల నిర్వహణలో వారి సేవలను విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ప్రతి ఆదివారం పది నిమిషాల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ మాద్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలను, వాల్ పోస్టర్లను, రేడియో, స్ధానిక టి.వి చానళ్ళలో వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో విస్తృత ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రలు వాడాలని, పండ్ల రసాలు (ద్రవ పదార్ధాలు) ఎక్కువ మొత్తంలో తీసుకోనేలా ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
డెంగ్యూ వ్యాధి లక్షణాలు :
తీవ్రమైన జ్వరం , తీవ్రమైన తలనొప్పి, కంటి లోపలి భాగంలో నొప్పి, వాంతులు మరియు విరేచనాలు, కండరాలు, కీళ్ళ నొప్పులు, చర్మంపై దద్దుర్లు (తీవ్రమైన కేసులలో మాత్రమే), పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం (తీవ్రమైన కేసులలో మాత్రమే), డెంగ్యూ హెమరేజిక్ (రక్తస్రావం) జ్వరం ఈ విధంగా లక్షణాలు ఉంటాయని ప్రజలకు తెలియపరిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ:
ప్రభుత్వ దవాఖానల యందు ఉచితముగా డెంగ్యూ వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయబడును.
జ్వరం వచ్చిన మొదటి రోజు నుండి అయిదవ (5) రోజు వరకు NS1 ఎలీసా మరియు ఆరవ (6) రోజు నుండి IgM AC ఎలీసా పరీక్షలు ప్రభుత్వ దవాఖానల లోని (SSH) సెంటర్లో ఉచితంగా చేయబడును.
డెంగ్యూ వ్యాధి వ్యాప్తి:
ఎడిస్ దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమలు ఇండ్లలోని మరియు ఇంటి కృత్రిమ నీటి నిల్వ ఆవాసాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఎడిస్ దోమలు పగటివేళలో కుడతాయి..
డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు
మీ ఇంటిలోని నిల్వయున్న నీటిపాత్రలను వారానికి ఒక్కసారి ఒలకపోయండి. డెంగ్యూ నుండి దూరంగా ఉండండి. ఈ రోజు లార్వా రేపటి దోమ. అది డెంగ్యూకి కారణం. లార్వాను తొలగించు. డెంగ్యూ నుండి దూరంగా ఉండు. ఇంటిలోపల ఇంటి చుట్టుప్రక్కల నీరు నిలువు ఉండకుండా చూసుకోండి. నీళ్ల ట్యాంకులు, డ్రమ్ములు మరియు మంచి నీటిపాత్రలపై మూతలు ఉంచవలెను. దోమను చంపు….. డెంగ్యూని పారద్రోలు… దోమలు వ్యాప్తి చెందకుండా…పరిసరాలలో నిలిచి ఉన్న నీటిని తొలగిద్దాం, దోమ తెరలను వాడుదాం,శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచిన దుస్తులను దరించుదాం.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ