హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : కరీంనగర్ జిల్లా రేకుర్తి మండలానికి చెందిన కొంతమంది ముస్లిం మహిళలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాధితుడు రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరు దశబ్దాల క్రితం టర్కీ నుండి వలస వచ్చిన షేక్ ఫ్యామిలీ కరీంనగర్ లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. అయితే కరీంనగర్ చుట్టు పక్కల మండలాల్లో సర్వే నం.194, మరికొన్ని సర్వే నంబర్లతో 400 నుండి 500 మంది రైతులకు చెందిన 4500 వ్యవసాయ భూములను కబ్జా చేశారాని ఆరోపించారు. ఈ విషయంపై 1996లో వచ్చిన కలెక్టర్, ఆ తరువాత వచ్చిన కలెక్టర్లు ఈ భూమి కబ్జా చేసినట్లు తేల్చి హైకోర్టుకు నివేదిక ఇచ్చారని ఆయన వెల్లడించారు. దింతో హైకోర్టు 2022లో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. షేక్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అబుబాకర్ అలియాస్ ఖాళీద్ తనకున్న పలుకుబడితో తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుల నుండి స్టేలు తీసుకు వచ్చి ఆ భూముల రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూములు పోతాయానే భయంతో కొంత మంది ముస్లిం మహిళలతో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడు అంటూ కుల రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకోని అబు బాకర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.