‘గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పరీక్షకు 80 వేల మంది, డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్ ప్లానింగ్ పరీక్ష కోసం 55 వేల మంది, దరఖాస్తు చేసుకున్నారు. మీ నిర్లక్ష్యం, మీ అసమర్థత కారణంగా పేపర్ లీకులు, పరీక్షలు రద్దు చేసే దుస్థితి ఏర్పడింది…’’
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
నీళ్లు..నిధులు.. నియామకాలు నినాదంతో తెలంగాణ యువతను ఆకర్షించి మీరు అధికారంలోకి వచ్చారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఏడాది క్రితం బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదు. సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది మంది యువత నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో కూడా మీ ప్రభుత్వంలో చలనం లేదు. మీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్ ల పేరుతో పోరాటాలు చేస్తే వాటిని కూడా పోలీసులను అడ్డుపెట్టి అణచి వేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి వోట్లు వేయించుకొని మోసం చేశారు. తాజాగా మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు, షెడ్యూల్స్ ప్రకటించారు. కనీసం ఈ కొన్ని ఉద్యోగాలనైనా సక్రమంగా పారదర్శకంగా భర్తీ చేస్తారని ఆశించాం.
మీరు భర్తీ చేసే కొద్దిపాటి ఉద్యోగాల కోసం 30 లక్షల మంది నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు పంపించే చాలిచాలనీ డబ్బులతో హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి పరీక్షలకు ప్రిపేరయ్యారు. ఈ విధంగా గ్రూ-1కు పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పరీక్షకు 80 వేల మంది, డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్ ప్లానింగ్ పరీక్ష కోసం 55 వేల మంది, దరఖాస్తు చేసుకున్నారు. మీ నిర్లక్ష్యం, మీ అసమర్థత కారణంగా పేపర్ లీకులు, పరీక్షలు రద్దు చేసే దుస్థితి ఏర్పడింది. తప్పు చేసింది మీరైతే శిక్ష మాత్రం నిరుద్యోగ యువతకు ఎందుకు వేయాలి..? పేపర్ల లీకేజీ స్కాం వెనుక ప్రభుత్వంలోని పెద్ద తలకాలయల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పరీక్షలు రద్దు చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. ఈ పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు వ్యవహారాలు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదు. కేసులో నిందితులుగా ఉన్న వారికి మీ పార్టీతోపాటు బీజేపీతో రాజకీయ సంబంధాలు ఉన్నట్లు విచారణ అధికారులే చెబుతున్నారు. పరీక్షలు రద్దు చేసి కీలకమైన ఈ అంశాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే భావన కలుగుతుంది.
టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ దాని చైర్మన్, సభ్యుల నియామకం చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. అంటే ముఖ్యమంత్రిది ప్రధాన బాధ్యత. పేపర్ లీకేజీ విషయంలో సాంకేతికపరమైన లోసుగులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మీ కుమారుడు కేటీఆర్ కుడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైర్మన్, సభ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐటీ మంత్రిగా కేటీఆర్ పై కూడా చర్యలు తీసుకోలేదు. ఇంత భారీ కుంభకోణంతో రాష్ట్రం అతలకూతలం అవుతుంటే మీరు కనీస సమీక్ష చేయలేదు. నిరుద్యోగులలో మానసిక స్థైర్యం కలిపించేందుకు మీ నుంచి కనీస ప్రకటన కూడా రాలేదు. ప్రతి అంశానికి తుమ్మితే, దగ్గితే ట్విటర్ ద్వారా స్పందించే ఐటీ మంత్రి కూడా దీనిపై స్పందించలేదు. ఈ స్కాం విషయంలో ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారు..? మీ వైఖరి చూసిన తర్వాత సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం లేదు. తక్షణం టీఎస్పీఎస్సీ బోర్డుపై చర్యలు తీసుకోండి. ఐటీ శాఖ బాధ్యత వహిస్తున్న కేటీఆర్ ను బర్తరఫ్ చేయండి. టీఎస్పీఎస్సీ అన్ని వ్యవహారాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలలో ఆటలాడుకుంటామంటే చూస్తు ఊరుకోం. మీ స్పందనను బట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉంటుంది.
ఎ. రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి,టీపీసీసీ అధ్యక్షుడు.