దండాలు పెట్టీ పెట్టీ
మంత్రాలతో పిలచి పిలచి
ఓ కల కోరినందుకు
వరమిచ్చినట్లే ఇచ్చి శాపాన్ని చూపావే…
కరుణించావనే నమ్మకం బతికుండగానే
అజ్ఞానపు ఆవేశంలో
కొత్త ఆలోచన వింత ప్రవర్తనలో
తలలో కుక్కుకున్న కోరికలు
గుండె వేగాన్ని పెంచి నిద్రను లాగేసుకుంటే
తమాషా చూస్తున్నావా?
నా భక్తికి నీ బాధ్యత లేదా?
నా పరువుకి నీ పూజలు దన్ను కాలేవా?
నా లోపలి బాధను పలుకరించలేవా?
నా లోతు ప్రశ్నకు జవాబు లేదా?
నెర్రెలుగా చీలిన ఆలోచనతో
ఒంటరితనంతో బీడుగా మారి
నాకు నేనే బరువుగా
నా అడుగులే శత్రువులే
దారులన్నీ ఉరిమి చూస్తున్నాయి
దూరం చూస్తే చాలా ఉంది
నీవు చూస్తే పరాయిలా ఉన్నావు
ఇప్పుడీక కోరికల కొరివి ఆరి,
భయం పోగ చుట్టేస్తుంది..
చేతల్ని మౌనం అల్లుకుని
ఒక్క నిజం ఆలస్యంగా పూచి,
రాత్రి పాఠాలు చెబుతుంటే
పగలు దిద్ది మార్కులు వేస్తుంది..
వయసును చీల్చి
మనసు వెతికే తేలికైన సుఖం ముందు…
నా కోరికలు కాగితాల పూలే
నా ఊహలు మంచు బిందువులు
కొత్త ఆలోచనల వింత ప్రవర్తనే
కొత్త చుట్టరికంలా కలుపుకు నడిచే
నిఘాల మధ్య నిజాలు ఎన్నో
గుప్పు గుప్పున సెగను చిమ్ముతూ
నాకు మించిన ఏ ఖరీదైన సుఖమైనా
రేపటి శత్రువని
మనసుకి రుచి తగలని
ఏ బ్రతుకైనా వృధాయని
నన్ను తూచుకుని విలువ కనుగొనలేని
గుడ్డితనం శిక్షగా అనుభవం అంగీకరించి,
ఇక ఇది మొదలు
నిన్ను ఎప్పటికీ ఏదీ కోరను
ఏ కోరిక వైపుకు తొంగి చూడను..
మనసు ముడుచుకుని
నన్ను తెలుసుకుని మలుచుకుంటా
నిన్ను తలచుకుని నడచుకుంటా …
ఏ కలతో రాత్రులకి దూరం కాను
ఏ కోరికతో బాధలను దగ్గర కాలేను…
– శ్రీ సాహితి
9704437247