ఏ అల్లా… ఏ ఖుదా
ఓ యాకోబు… ఓ జీసస్
ఓరి దేవుడా… ఓ ప్రభువా
మతానికో దేవుళ్ళారా
మీరంతా చెప్పే స్తుతి వాక్యం
అమ్మ అంటే దేవతని
అమ్మ ఒడంటే దైవత్వమని
తల్లిపాదాల క్రిందనే స్వర్గముందని
అమ్మే సర్వస్వమని బ్రతికే చిన్నారులం
రాక్షస యుద్ధోన్మాది
మానవతను నిర్దయగా దహిస్తూ
ఏ విద్వేష కాలనాగో బుసకొడుతూ
కనిపించే.. కనిపించని
అమాయక పాలస్తీనియన్లను
కసిగా కాటేస్తూ
జాత్యహంకారం మితిమీరి
నిప్పుల బాంబులతో
మర ఫిరంగుల దాడులతో
నింగీ నేలా ఒకటిగా
సృష్టిస్తున్న విధ్వంసంలో
కూలిన భవన శిథిలాల నడుమ
నాన్న అక్క చెల్లి సమాధైనా
అమ్మ బాహువుల నీడలో
భయం గుప్పిట దాగి
యుద్ధం ఆగిపోతుందని
ఎదురిచూస్తూంటే కర్కశ తూటాలెక్కడ
పిల్లల ప్రాణాలు తీస్తాయోనని
ఎదురు నిలిచి బలైన
అమ్మ శవమై నిద్రిస్తుంటే
పైనున్నాడని నమ్ముకున్న దేవుళ్ళను
నిలదీస్తున్న చిన్నారులు…
ఎడారి ఇసుకలో జీర్ణ గాజానడుమ
నిటారుగా తలెత్తి మొలకెత్తుతున్న
‘ఆలివ్‘లి మొలకలుగా
రేపటి వెలుగుల ప్రస్థానపు
దివ్వెలుగా భాసించక మానరు !
లి విజయానికి ప్రతీక
(హృదయాన్ని కదిలించిన గాజా యుద్ధ
దయనీయ చిత్రాన్ని చూసి)
– డా.కె.దివాకరాచారి