తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: తాండూరు నియోజకవర్గం లోని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.బుధవారం తాండూర్ నియోజకవర్గంలో 108 కోట్ల 48 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రభుత్వంపై ఎంత భారం ఉన్నప్పటికీ రైతుల సంక్షేమ కోసం రైతు బీమా, రైతు బంధు , రుణమాఫీ కార్యక్రమాలను చేపడుతూ రైతు పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎంపిక చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని మంత్రి సూచించారు. జీవంగి బ్రిడ్జి నిర్మాణంలో భూమిని కోల్పోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేదలకు అండగా ఉంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి అన్నారు. ప్రజల సౌకర్యార్థం బషీరాబాద్ మండలం నవల్గా నుండి కొడంగల్ వరకు అదేవిధంగా జీవంగి- మంతటి రోడ్డు సౌకర్యం ద్వారా ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని ఇలాంటి రోడ్ల నిర్మాణాలకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బషీరాబాద్ మండలం జీవన్గి పంచాయతీ పరిధిలో కాగ్నా నదిపై 8 కోట్ల 74 లక్షలతో చేపట్టే చెక్ డ్యామును, 6 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు.
తాండూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో రూపాయలు 9 కోట్ల 20 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని, కాగ్న నదిపై 16 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది.యాలాల్ మండలం దేవనూర్- నాగసముందర్ గ్రామాల మధ్య 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యాం శంకుస్థాపన అలాగే 14 కోట్లతో నిర్మించనున్న అడల్పూర్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెద్దముల్ మండలం కందనెల్లిలో 21 కోట్ల 38 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని , 5 కోట్ల 10 లక్షలతో నిర్మించిన మరో బ్రిడ్జితో పాటు అలాగే మన్సాన్ పల్లి గ్రామంలో 10 కోట్ల 20 లక్షల రూపాయల తో నిర్మించిన రెండు బ్రిడ్జిలను ప్రారంభించడంతో పాటు అదే గ్రామంలో 8 కోట్ల 86 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న చెక్ డ్యామ్ ను మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, జడ్పిటిసిలు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కరుణ, స్థానిక సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.