తిమ్మాపూర్‌ ‌భూదాన్‌ ‌భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం

కేటీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల పాత్ర
రిజిస్ట్రేషన్‌ ‌పోర్టల్‌లో నిషేధిత జాబితాలో…
ధరణిలో మాత్రం నిషేధిత జాబితాలో కనిపించని వైనం
స్వగ్రామంలో భూదాన్‌ ‌భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్‌ ‌భూముల్లో కేటీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నాయకులు రూ. వేయి కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. తిమ్మూపూర్‌ ‌గ్రామంలో 146 ఎకరాల నిషేధిత భూమి విక్రయించారన్నారు. ఈ భూ కుంభకోణం వెనుక కేటీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ భూమిని విక్రయించొద్దని ఆదేశాలున్నా కూడా భూ విక్రయం ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. నిషేధిత భూముల క్రయ విక్రయాలు జరిపిన కలెక్టర్‌, ఎమ్మార్వో , సబ్‌ ‌రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌  ‌చేశారు. స్వగ్రామంలోని భూదాన్‌ ‌భూములు అన్యాక్రాంతం అవుతుంటే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? కలెక్టర్‌పై డీఓపీటీ, విజిలెన్స్ ‌కమిషన్‌కు కిషన్‌ ‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ఆయన  ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌లో రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…‘భూదాన్‌ ‌భూములన్నీ అసైన్డ్ ‌భూములే. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరగకూడదు. కానీ  ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవు.  తిమ్మాపూర్లో భూదాన్‌ ‌భూములు అన్యాక్రాంతం అయ్యాయని భూదాన్‌ ‌బోర్డు అప్పటి  కలెక్టర్‌కి లెటర్‌ ‌రాసింది. ఇదే అంశంపై కిషన్‌ ‌రెడ్డి ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు 2008లో భూదాన్‌ ‌భూములపై అప్పటి కలెక్టర్‌కి లేఖ రాశారు.

ధరణి రాకముందు నిషేధిత భూములుగా ఉన్న భూదాన్‌ ‌భూములపై  ధరణి వొచ్చాక నిషేధం ఎత్తేశారు’ అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ధరణి ద్వారా భూదాన్‌ ‌భూముల అమ్మకం, కొనుగోళ్లు జరుగుతున్నాయని రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. నిషేధిత  భూములన్నీ  ధరణి సహాయంతో  కేసీఆర్‌ అనుచరులకు వెళ్లాయని  రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వేల మంది రైతులకు భూములు పంచిపెట్టిందని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మండల వ్యవస్థ వొచ్చాక భూరికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భూముల వివరాలను పారదర్శకంగా రికార్డు చేసిందని చెప్పారు. డిజిటలైజ్‌ ‌చేసేందుకు, కాన్‌ ‌క్లూజివ్‌ ‌టైటిల్‌ ఇచ్చేందుకు 2004లో నిజామాబాద్‌ ‌జిల్లాలో భూభారతి పేరుతో పైలట్‌ ‌ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. ‘‘రంగారెడ్డి జిల్లాలోనే 15 వేల ఎకరాలు భూదాన్‌ ‌భూములు ఉన్నాయి. భూదాన్‌ ‌భూములన్నీ అసైన్డ్ ‌భూములే. భూదాన్‌ ‌భూములను కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాం. ఆ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరగకూడదు. ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవు. అన్నీ తొలగించారు’’ అని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ధరణిలో సమస్యల కారణంగా రంగారెడ్డి, మేడ్చల్‌, ‌సీసీఎల్‌ఏ ‌ముందు వేలాది మందు రైతులు పడిగాపులు కాస్తున్నారని రేవంత్‌ అన్నారు. 30 శాతం కమీషన్‌ ఇస్తే తప్ప ధరణి నిషేధిత జాబితాలోని భూములను క్లియర్‌ ‌చేయని పరిస్థితి ఉందని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్‌కి ఏడుపు ఎందుకు? అని ప్రశ్నించారు. రాహుల్‌ ‌గాంధీ చేసిన భారత్‌ ‌జోడో యాత్రలో కూడా ధరణి బాధితులు తమ ఆవేదన తెలియజేశారు. ధరణితో 20లక్షల మంది రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు.

నిషేధిత భూములన్నీ ధరణి సహాయంతో కేసీఆర్‌ అనుచరులకు వెళ్లాయని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడేందుకు ధరణిని రద్దు చేస్తామని తాము చెబుతున్నందుకే కేసీఆర్‌ ‌పెడబొబ్బలు పెడుతున్నాడని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకువస్తామని రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ ‌వొస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు బీమా రాదని కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలని కన్ఫ్యుజ్‌ ‌చేస్తున్నారు. 2018లోనే రైతు బీమా, రైతు బంధు పథకాలు ప్రారంభమయ్యాయి. ధరణి 2020లో ప్రారంభమైంది. అంటే ధరణి ప్రారంభానికి కంటే ముందు మూడేళ్లు ఏ డేటా ఆధారంగా ఈ పథకాలను అమలు చేశారని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర భూముల వివరాలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవు. ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని భూ డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ ‌సెంటర్‌) ‌నిర్వహిస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ‌నిర్వహణను ప్రభుత్వం ఇన్‌ ‌ఫాస్ట్రక్చర్‌ ‌లీజింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్షియల్‌ ‌సర్వీసెస్‌(ఐఎల్‌ఎఫ్‌ఎస్‌) అనే సాఫ్ట్ ‌వేర్‌ ‌సంస్థకు అప్పగించింది. వివిధ ప్రభుత్వ రంగ వెబ్సైట్స్‌ను మెయింటేన్‌ ‌చేస్తున్న సెంటర్‌ ‌ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్(‌సీజీజీ), టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ‌విప్రో లాంటి దిగ్గజ సంస్థలు ఉండగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ‌సంస్థకు కట్టబెట్టింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ‌కంపెనీ బ్యాంకులకు సుమారు వేల కోట్లు ఎగ్గొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ.. ఇటీవల టెర్రాసిస్‌ ‌టెక్నాలజీస్‌ ‌తన వాటాను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫాల్కన్‌ ‌గ్రూప్‌నకు అమ్మేసింది. ఈ విధంగా వ్యక్తుల డేటా గోపత్యకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు దాపురించాయని ఆయన ఆరోపించారు. నేడు ధరణిలో ఏ చిన్న సర్వీసుకు దరఖాస్తు చేయాలన్నా తక్కువలో తక్కువ రూ. వెయ్యి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒక వేళ ఇచ్చినా దరఖాస్తు తిరస్కరణకు గురైనా మళ్లీ నగదు చెల్లించి దరఖాస్తులను సమర్పించాల్సిందే. ఇచ్చిన ఫిర్యాదుకు ట్రాకింగ్‌ ‌వ్యవస్థ లేదు. సమస్యల పరిష్కారానికి చేసే ప్రతి దరఖాస్తుకు వేలల్లో ఖర్చు అవుతుందన్నారు. అసలు చెల్లిస్తున్న సొమ్ము ప్రైవేట్‌ ‌సంస్థకు పోతుందో, ప్రభుత్వానికి వెళ్తుందో తెలియని పరిస్థితి ఉందని రేవంత్‌ ‌పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే ధరణి విషయంలో కేసీఆర్‌ ‌స్వార్థం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందన్నారు. ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తెస్తామన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాలో అనుమానస్పద భూలావాదేవీలు ఎక్కువగా జరిగాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆ మూడు జిల్లాల కలెక్టర్లను ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చాక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ ‌భూములపై విచారణ జరిపిస్తామన్నారు. ధరణి అనేది కేసీఆర్‌కి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా మారింది.

తిమ్మాపూర్‌ ‌భూముల విషయంలో కిషన్‌ ‌రెడ్డి రాసిన లెటర్‌ ఆయనకే కొట్‌ ‌చేస్తూ లెటర్‌ ‌రాస్తానన్నారు రేవంత్‌ ‌రెడ్డి. ధరణి విషయంలో కేసీఆర్‌ ‌పెద్ద దలారీ. కేసీఆర్‌ ‌కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇల్లు కట్టించే బాధ్యత మాది..అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వేల మందికి భూములను పంచి పెట్టిందన్నారు. మండల వ్యవస్థ వొచ్చాక భూ రికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయన్నారు. భూహక్కుల కోసమే తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. సమస్యలు ఉన్నంత వరకు ప్రజా పోరాటాలుంటాయని రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. భూస్వాములపై తిరుగుబాటు కోసమే నక్సల్‌ ‌బరి ఉద్యమాలు వొచ్చాయని రేవంత్‌ ‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వామ్యులకు వ్యతిరేకంగా తెలంగాణలో  ఉద్యమాలు  వొచ్చిన విషయాన్ని రేవంత్‌ ‌రెడ్డి గుర్తు  చేశారు. ఈ పోరాటాల కారణంగానే  కేంద్ర ప్రభుత్వం  సీలింగ్‌ ‌యాక్ట్ ‌తెచ్చిందన్నారు. కుటుంబానికి 54 ఎకరాలకు  మించి భూమి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిన విషయాన్ని రేవంత్‌ ‌రెడ్డి ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page