తుంట ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్లైందా..?

  • కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌దొందూ దొందే
  • చర్చలకు ససేమిరా అంటున్న ప్రభుత్వం
  • ఈ ప్రభుత్వానికీ నిరుద్యోగులు దూరమవుతున్నారా?

గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు దూరమవుతుందా అంటే గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అదేపోబడి కనిపిస్తున్నది. గత బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం ఓటమి పాలవడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, నిరుద్యోగులు కూడా ఒక కారణంగా విశ్లేషించుకుంటున్న తరుణంలో, కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా నిరుద్యోగుల వేదన వినకుండా భీష్మించుకోవడం వారిని దూరం చేసుకోవడమే అవుతుందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. తెలంగాణ పుట్టిందే నీళ్ళు, నిధులు, నియామకాలన్న ప్రధాన లక్ష్యంతో. నీళ్ళు, నిధులన్నవి కొంతవరకు కేంద్రంతో ముడివడిఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగే నియామకాల విషయంలో ఇంకా స్థానిక యువతకు అన్యాయం జరుగుతూనే ఉంది. మన రాష్ట్రం, మన ఉద్యోగాలు అన్న నినాదంపైన తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరుద్యోగ యువకులు ఉద్యమాన్ని ఉరకలెత్తించడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడింది. కాని, కోరితెచ్చుకున్న బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం గత పదేళ్ళుగా నిరుద్యోగులకు చేసిన ఆన్యాయమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోనూ పునరావృతం అవుతున్నది. గతంలో ప్రభుత్వ అధినేతను కలిసి తమ బాధలు చెప్పుకుందామంటే కంటికి కనిపించనట్లే, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా తమ గోడును వినిపించుకునే పరిస్థితిలో లేడని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలతోనే రాజకీయాలకు స్వస్తి, ఇక రాష్ట్ర అభివృద్దిపైనే దృష్టి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇంకా ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏలను తమ పార్టీలో చేర్చుకుని, పార్టీని పటిష్టపర్చుకోవడంలోనే సమయాన్ని వెచ్చిస్తున్నాడంటున్నారు వారు. కేవలం ఒకటి రెండు డిమాండ్లతో నిరుద్యోగులు గతకొద్ది రోజులుగా ఆందోళన చేస్తుంటే, కనీసం వారిని పిలిచి సాధక బాధకాలను అడిగి తెలుసుకునే తీరిక కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి గత బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదనిపిస్తుందని వారు వాపోతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతున్నదంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ‌పార్టీ నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కార్చిందనడానికి, ఆ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ బాటలోనే కొనసాగుతున్నదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం వొస్తే మార్పు వొస్తుందంటే నమ్మి, బిఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే మంచి మూల్యమే చెల్లించుకోవాల్సి వొస్తున్నదంటున్నారు నిరుద్యోగ విద్యావంతులు. యువత వోట్లను దండుకోవడమే తప్ప వారి గురించి ఈ పార్టీలు పట్టించుకోవని దీనివల్ల అర్థమవుతుందంటున్నారు.

కాగా శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ ‘యూత్‌ ‌డిక్లరేషన్‌’ ‌ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ‘యువ సంఘర్షణ’ పేర పెద్దఎత్తున నిర్వహించిన సభలో, ఆపార్టీ ముఖ్యనేత ప్రియాంకా గాంధీ సమక్షంలో ప్రకటించిన ‘యూత్‌ ‌డిక్లరేషన్‌’‌లో యువజనులకు అనేక హామీలను గుమ్మరించారు. తాము అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ‌ప్రకటించింది. దానితో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ బ్యాక్‌లాగ్‌ ‌పోస్టుల భర్తీ చేపడుతామంది. గతనెల అంటే జూన్‌ ‌రెండవ తేదీలోగా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని ఖాళీలతో జాబ్‌ ‌క్యాలెండర్‌ను ప్రకటిస్తామని కూడా తెలిపింది. ముఖ్యంగా అన్ని నియామకాలను సెప్టెంబర్‌ 17‌లోపు పూర్తి చేస్తామంది. కాని, ఇప్పుడు అదనపు పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు మాత్రం విలువ నివ్వడం లేదని వారు వాపోతున్నారు. ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీకి సంబంధించి ఈనెల 18నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఆగస్టు 5న పూర్తికానున్నాయి. అయితే రెండు రోజుల్లోనే అంటే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌ ‌రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో వరుస పరీక్షలు అభ్యర్థులను వత్తిడికి గురిచేసేవిగా ఉన్నాయి.

నోటిఫికేషన్‌ ‌విడుదలై, దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 20‌వరకు కొనసాగగా, ఈ నెల 18 నుండి పరీక్షలకు సిద్ధం కావాల్సి రావడం అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి కనీసం పద్నాలుగు సబ్జెక్టులైనా చదువాల్సి ఉంటుంది. అందుకు కనీసం 45 రోజుల నుండి నెలరోజులైనా పడుతుందంటున్నారు అభ్యర్థులు. అందుకు కనీసం రెండు నుంచి మూడు నెలలపాటు ప్రస్తుత డిఎస్సీని వాయిదా వేసి, మరిన్ని పోస్టు(25వేల)లతో మెగా డిఎస్సీని నిర్వహించాలంటూ వారు ఆందోళన బాటపట్టారు. అందుకు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ససేమిరా అనడం, సీమాంధ్ర ప్రభుత్వాలను తలపిస్తున్నదంటున్నారు. సమైక్యపాలనలో నలిగిపోయిన తెలంగాణ యువతకు స్వరాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేలు చేయక పోవడంపట్ల వారు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైన తన మొండి వైఖరిని విడనాడి, విద్యార్థులతో చర్చలు జరుపాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బిఆర్ఎస్‌ ‌పార్టీ మీడియా అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎ‌ర్రోళ్ళ శ్రీనివాస్‌ ‌శుక్రవారం తెలంగాణ భవన్‌లో గ్రూప్‌ ‌వన్‌ ‌విషయంలో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలన్న తమ డిమాండ్‌ను గుర్తుచేశారు. నేటి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వ కాలంలో అసెంబ్లీలో దీన్ని డిమాండ్‌ ‌చేసిన విషయాన్ని మరిచి, 1:50ని పిలవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతే కాకుండా గత సిఎం కెసిఆర్‌ ‌నోటిఫికేషన్‌ ఇచ్చిన 30 వేల ఉద్యోగా లను తామే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఇంతగొడవ జరుగుతున్నా కొంత సమయం ఇస్తే బాగుండేదని టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌సన్నాయి నొక్కులు నొక్కడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యార్థుల సాధకబాధకాలు తెలిసిన వ్యక్తిగా ఆయన ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌సూచించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించి, రాజకీయ పార్టీలతోపాటు, నిరుద్యోగ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.

-మండువ రవీందర్‌రావు,
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page