‘‘గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది.’’
కడెం ప్రాజెక్టు ఆధునీకరణ ఇక అనివార్యం?
గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది. కడెం ప్రాజెక్టు గరిష్ఠ ఎత్తు 700 అడుగులు కాగా… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పై నుండి వరద నీరు చేరడంతో ఎడమ కాలువ తెగి వరద నీరుదిగువకు వెళ్లడంతో కడెం ప్రాంతంలోని సుమారు 12 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రి ఇతర సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించక తప్పని స్థితి నెలకొంది. అంతేకాక కడెం ప్రాజెక్టు గేట్ల పైనుండి నీరు ప్రవహించి, ప్రాజెక్టు తెగే ప్రమాదంలో చిక్కుకు పోయింది. అవిభక్త ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత విభక్త నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఉపనది అయిన కడెం, గోదావరి నదిలో కలిసే ప్రదేశంలో కడెం ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం, ప్రయోజనం ఆదిలాబాద్ జిల్లాలోని 25000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందించడం. 1944లో నిజాం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు తయారు చేయగా….1949 నుంచి 1952 మధ్య కాలంలో ప్రాజెక్టును నిర్మితమైంది. కడెం ఆనకట్ట లేదా కడం రిజర్వాయర్ ప్రాజెక్ట్ అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది కడెం నదిలో కలిసే ప్రదేశంలో పెద్దూరు గ్రామంలో నిర్మల్ పట్టణం నుండి 40 కి.మీ దూరంలో నిర్మించ బడింది.
ఈ ప్రాంతంలో అనేక యాజ్ఞ యాగాలు చేసిన కండవ రుషి పేరున ముందుగా పిలువ బడిన ఈ ప్రాజెక్టు… తరువాత ఈ ప్రాంత నాయకుడు కడెం నారాయణరెడ్డి జ్ఞాపకార్థం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌గా అధికారికంగా నామాంకిత అయింది.
ఆదిలాబాద్ జిల్లా బోర్డ్ సమీపంలోని పొచ్చెర, ఇచ్చోడ వద్ద ఉన్న కుంటాల జలపాతం వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతోనే మొదల వుతోంది. కడెం ప్రాజెక్టు మొదట 5.5 -టీఎంసీల సామర్థ్యంతో కొన్ని గేట్లు 2.50లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాటిసితో నిర్మించారు.
ఇది ఎడమ, కుడి కాలువల ద్వారా అనేక మండలాలకు నీరును అందిస్తుంది. ఎడమ కాలువ ద్వారా పెద్ద బెల్లాల్, చిన్న బెల్లాల్, చిట్యాల్, కొండుకూర్, కన్నాపూర్, మోరిగూడెం, పాత కొండుకూర్, ఉప్పరగూడెం, చిన్నా శిబిరం, పెర్కపల్లి, కడెం మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. కుడి కాలువ ద్వారా జన్నారం, దండేపల్లి, తాళ్లపల్లి, మ్యాదార్ పేట్, లక్సెట్టిపేట మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది.1984లో శ్రీరాంసాగర్ నార్తు కెనల్ సరస్వతీ కాలువ నుండి కడెం ప్రాజెక్టుకు లింకు చేశారు. దీంతో మొత్తం 68వేల ఎకరాల ఆయకట్టుకు కడెం ప్రాజెక్టు నుండి నీరు అందుతుంది. కడెం ప్రాజెక్టు దిగువన ఐదారు కిలోమీటర్ల దూరంలో కడెం నది గోదావరిలో కలుస్తుంది. అలా ప్రస్తుతం ఈ డ్యామ్ 68000 హెక్టార్ల వ్యవసాయానికి సాగునీటి అవసరాలను తీరుస్తుంది. 1958 ఆగస్టు 30, 31న వచ్చిన వరదకు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 5.19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ఉంటుందని అప్పటి అధికారులు అంచనా వేశారు. అంటే ప్రాజెక్టుకు డిశ్చార్జి కెపాసిటి కన్నా రెండింతల వరద ఎక్కువగా వచ్చింది. ఈ డ్యాంను కాపాడటం కోసం అప్పటి ఏఈ చంద్రశేఖర్ డ్యామ్ను బ్రీచ్ సెక్షన్ వద్ద డిటోనేటర్తో పేల్చి కట్టను తెంపాలని విఫల ప్రయత్నం చేశారు.
తర్వాత ప్రాజెక్టు ఎత్తును 1.20 మీటర్ల పాతవి, కొత్తవి కలిపి 18 గేట్ల 3.28 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీతో ప్రాజెక్టును 1959 నాటికి పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ 1995లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వరద తాకిడికి కడెం ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకు పోయాయి. పొచ్చెర, కుంటాల, బజార్ హత్నూర్ ప్రాంతాల్లో గుట్టల పైనుండి వచ్చే వరద నీరు చేరుతుండటం, ఇసుక మేటలు వేస్తున్న కారణంగా ఏటా మామూలు రుతుపవన వర్షాలకే ప్రాజెక్టు నిండు కుండగా మారుతున్నది. ఇక ప్రస్తుతం…కడెం ప్రాజెక్టు గరిష్ఠ ఎత్తు 700 అడుగులు కాగా… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పై నుండి వరద నీరు చేరడం, ఎడమ కాలువ తెగడం వల్ల సుమారు 12 గ్రామాల ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా, 17 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. సాంకేతిక లోపంతో 18వ గేటు తెరుచుకోలేదు. ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరితే, మూడు లక్షల క్యూసెక్కుల నీటిని వదలగలిగిన స్థితిలో ముప్పు పొంచి ఉంది.
గతంలో గరిష్ఠగా 2.90 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఈసారి ఒకేసారి 5 లక్షల క్యూసెక్కుల పైన వచ్చిన కారణంగా… అధికమైన నీరు గేట్ల పైనుండి పారిన నేపథ్యంలో అధికారులు చేతులెత్తక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడటంతో భారీగా వరద నీరు బయటకు వెళ్ళిపోయి, ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే గేట్లలో చెట్లు, కొమ్మలు, చెత్తా చెదారం ఇరుక్కుపోయి మూసి వేయలేని స్థితి తయారైంది. ప్రాజెక్టులోని 18 గేట్లలో 1, 2 నెంబరు గేట్ల కౌంటర్ వెయిట్ కొట్టుకుపోగా 12వ నెంబరు గేటు తెరుచుకోలేదు. నాలుగో నెంబరు గేటు పగుళ్లు తేలింది. ఫలితంగా ప్రాజెక్టు లోని నీరు గేట్ల ద్వారా వెళ్ళి పోయి డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నది. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిం చిన ప్రాజెక్టు గేట్ల పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు చేపట్టేం దుకు సోమవారం ప్రత్యేక నిపుణుల బృందం వచ్చి వెళ్ళింది. ఇలాంటి స్థితిలో కడెం ప్రాజెక్టు ఆధునీకరణ అనివార్యంగా మారింది. మళ్లీ భారీ వరదలు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. భారీ వరద నీరు తట్టుకునేలా, వరద తాకిడి నుండి కడెం ప్రాజెక్టును కాపాడుకునేలా శాశ్వత పరిష్కారం కోసం కనీస డిశ్చార్జి కెపాసిటీని 5 లక్షల క్యూసెక్కులకు పెంచేవిధంగా తక్షణ చర్యలు తీసుకోక తప్పని స్థితి నెలకొంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494