‘తెనుగు’ ఎగరేసిన చైతన్యబావుటా నేటి తరానికీ వెలుగుబాట

బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణగా నిలిచిన ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ పత్రిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసింది. చైతన్యబావుటా ఎగురవేసింది. ఇనుగుర్తి కేంద్రంగా మొదలై, జనసామాన్యానికి వెలుగు చూపింది ‘తెనుగు’. భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిరుపమానమైన ప్రతిభ కనబర్చిన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా లబ్ధప్రతిష్టులయ్యారు. కేవలం ఏదో ఒక రంగానికే పరిమితమైన మేధస్సు కాదు వారిది. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, అల్లోపతి, హోమియో, ఆయుర్వేదం మొదలైనవి అభ్యసించారు. వాద్యసంగీతం నేర్చుకున్నారు. వడ్రంగం, తాపీ, ఫోటోగ్రఫీలతో పాటు విద్యుత్, చర్మకారపనుల్లోనూ నిష్ణాతులనిపించుకున్నారు.

పత్రికారచనకు ప్రధానమైన భాషారంగంలో చిన్నప్పటి నుండే అభినివేశం ఏర్పర్చుకున్నారు ఒద్దిరాజు సోదరులు. భాషాధ్యయనానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా భాషలపై సాధికారత సాధించారు. తల్లి తొలి గురువుగా చిరుప్రాయంలోనే పద్యాలను వీరిరువురూ నేర్చుకున్నారు. ఐదేళ్ల ప్రాయంలోనే సీతారామచంద్ర రావు ఐదు వందల పద్యాలను కంఠతా పట్టడం విశేషం. తర్వాత పెద్ద బాలశిక్ష, గణితం మొదలైనవి హసన్ అనే గురువు దగ్గర నేర్చుకున్నారు. స్వగ్రామం ఇనుగుర్తిలో తరికంటి కృష్ణశాస్త్రి, చెరుకుపల్లి గోపాల కృష్ణ శాస్త్రి అనే గురువుల దగ్గర సంస్కృత అధ్యయనం చేశారు. ఆంగ్లం, ఉర్దూ, తమిళం, హిందీ భాషలను వారు నేర్చుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పట్లో ఇనుగుర్తిలో పని చేసే నీటిపారుదల శాఖ ఉద్యోగి జి.డబ్ల్యు.డి.కెంపు దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నారు. రాత్రి పహరా తిరిగే పోలీసులు పగలు విశ్రాంతి తీసుకునేవారు. వారి దగ్గర పగటిపూట ఉర్దూ నేర్చుకునేవారు ఈ సోదరులు. అలా నేర్చుకున్న ఉర్దూను ఉపయోగించి తమిళ భాషపై అవగాహన పొందడం విశేషం. వస్తు మార్పిడి పద్ధతిలాగే ఉర్దూను ఒకరికి నేర్పి, వారి దగ్గర తమిళం నేర్చారు. గొర్రెలు, మేకల చర్మాల వ్యాపారం చేసేందుకు ఇనుగుర్తికి వచ్చిన తమిళ వ్యాపారి దగ్గర అలా తమిళ భాషాధ్యయనం చేశారు. ఆ భాష నేర్చుకోవడంతో ఆగిపోకుండా అందులోని అనేక సాహిత్య, వ్యాకరణ గ్రంథాలను అధ్యయనం చేశారు. తులసీదాసు రామాయణం, గోపీచంద్ నవలలు మొదలైనవి హిందీ నేర్చుకోవడానికి మార్గనిర్దేశం చేశాయి. ఈ భాషల అధ్యయనంతో జ్ఞాన తృష్ణ తీరని ఈ సోదరులు పార్శీ, అరబ్బీ, కన్నడ, మరాఠీ భాషలను కూడా నేర్చుకున్నారు.

విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల స్థాపన నిర్ణయం హైదరాబాదులో 1918 మార్చి మూడో తేదీన జరిగింది. కోదాటి రామకృష్ణారావు, కోదాటి వెంకటేశ్వర్ రావు, ఎస్.బి రామానుజాచార్యులు, షబ్నవీసు వేంకట రామనరసింహారావు, అక్కినేపల్లీ జానకిరామారావులతో పాటు ఒద్దిరాజు సోదరులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. సంప్రదాయ గ్రంథాలు, విజ్ఞానదాయక గ్రంధాలు, దేశభక్తిని ప్రేరేపించే గ్రంథాలు ప్రచురించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇనుగుర్తి గ్రామంలో విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల స్థాపన జరిగింది. మొదటగా సీతారామచంద్ర రావు రచించిన ‘రుద్రమ దేవి’ అను చారిత్రక నవలను విజయవాడ మారుతీ ప్రెస్సులో ముద్రించారు. ఒద్దిరాజు సోదరులు ఈ నవల ముద్రణ సమయం లో విజయవాడ లో ఉన్నారు. నేర్చుకోవాలనే ఉబలాటం ఉన్న మనసు ఒక్క చోట కుదురుగా ఉండనీయదు కదా! అందుకే అక్కడి మారుతీ ప్రెస్సులో అక్షరాల కూర్పు, అచ్చు వేయడం మొదలైన పనులను ఈ సోదరులు నేర్చుకున్నారు. ముద్రణకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో ఆ విధంగా నైపుణ్యం సాధించారు ఒద్దిరాజు సోదరులు. ఇనుగుర్తి కేంద్రంగా ముద్రణాలయ వ్యవస్థాపనకు ఆ నైపుణ్యం బీజం వేసింది.

మారుతీ ప్రెస్సులో పొందిన సాంకేతిక పరిజ్ఞానం వెన్నుదన్నుగా ఉండడంతో తామే ఒక అచ్చుయంత్రాన్ని సమకూర్చుకోవాలని ఒద్దిరాజు సోదరులు భావించారు. మద్రాసులోని జయశంకర్ ప్రెస్ అధినేత వీరన్నశెట్టి, విజయవాడ మారుతీ ప్రెస్సులను సంప్రదించి ఒక అచ్చు యంత్రము, అక్షరాలు తెచ్చుకున్నారు. అలా ఇనుగుర్తి లో ‘విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయం’ నెలకొల్పారు. ముద్రణ పని తెలియడంతో అందులోని పనులన్నీ తామే చేసుకున్నారు. అందులో మొదటగా అచ్చయిన పుస్తకం విశిష్టాద్వైత గ్రంథం ‘ఉపదేశ రత్నమాల’. దీన్ని సోదరులిద్దరూ కలిసి రాశారు. ఈ ముద్రణాలయం నుండి నెలకో గ్రంథం వెలువరించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఒద్దిరాజు సోదరులు వేర్వేరుగా రాసిన బ్రాహ్మణ సాహసము, వరాహముద్ర, వీరావేశము, శౌర్య శక్తి, చాయాగ్రహణ తంత్రము, పంచ కూళ కషాయము, చేతి పనులు, విషములు-చికిత్సలు మొదలైన ఇరవై గ్రంథాలు ప్రచురితమయ్యాయి. చాట్రాతి నర్సమాంబ రాసిన ‘అనురాగ విపాకము’ మొదలైన ఇతర గ్రంథాలు కూడా ఈ ప్రెస్సులోనే ముద్రితమయ్యాయి. కార్యసమర్థులైనప్పటికీ పనిభారం పెరగడంతో గ్రామస్తులకు కొందరికి కూర్పు, ముద్రణ, బైండింగు పనులను నేర్పించారు.

ఒద్దిరాజు సోదరుల కృషి వల్ల ఆ రోజుల్లోనే ఇనుగుర్తి గ్రంథ ముద్రణకు కేంద్రంగా నిలిచింది. అయితే ఈ ప్రాంతంలో విజ్ఞాన దాయక అంశాలను అందించే పత్రికలు లేకపోవడాన్ని సోదరులిద్దరూ ఒక లోటుగా భావించారు. అందుకే ఒక పత్రికను నెలకొల్పాలన్న నిశ్చయం వారిలో కలిగింది. నిజాం పరిపాలనా ప్రాంతంలో తెలుగు పత్రికలు లేని కాలమది. ఆంగ్ల, ఉర్దూ పత్రికల్లో కొన్నిటిపై ప్రభుత్వ ఆంక్షలుండేవి. ప్రభుత్వ వ్యతిరేకమైన వార్తలు ప్రచురించకూడదనే నిబంధన ఉండేది. అలాంటి పరిస్థితుల్లో పత్రికను స్థాపించాలన్న నిర్ణయం సాహసోపేతమే. అప్పటికే కోస్తా ప్రాంతంలోని బందరు నుండి కృష్ణా పత్రిక వస్తుండేది. ఆ పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావును కలిసేందుకు బందరు వెళ్ళిన ఒద్దిరాజు సోదరులు పత్రిక వ్యవస్థాపనకు ఆయన సలహాలు కోరారు. అలాగే ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు సలహాలను కూడా కోరారు. వారిద్దరూ సానుకూల అభిప్రాయంతో పచ్చ జెండా ఊపడంతో అదనంగా మరో ముద్రణా యంత్రాన్ని తెప్పించారు. ప్రభుత్వ అనుమతులు సాధించారు. ఆ విధంగా 1922 ఆగస్టు 27 వ తేదీన ‘తెనుగు’ వారపత్రిక తొలి సంచిక వెలువడింది.

మొదట్లో ఐదు వందల ప్రతుల ముద్రణతో ‘తెనుగు’ ప్రారంభమైంది. చందా మొత్తం ఏడాదికి మూడు రూపాయలు. పత్రికలో ప్రచురితమయ్యే వార్తలన్నీ ప్రజలను చైతన్య వంతులను చేసేవి. నిజాం నిరంకుశ ప్రభుత్వ పాలనకు దర్పణంగా నిలిచేవి. స్వాతంత్ర్యోద్యమ వార్తలకు ఆ పత్రికలో ప్రముఖ స్థానం లభించేది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిరాదరణకు గురవుతున్న సామాన్య ప్రజలకు అండగా నిలిచేది ఆ పత్రిక. అయితే పోస్టల్ సౌకర్యం కూడా అందుబాటులో లేని ఆ కాలంలో ముద్రణ అయినప్పటికీ ప్రతుల పంపిణీ కష్టసాధ్యమైంది. అందువల్ల పోస్టల్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించి, ఇనుగుర్తి గ్రామంలో పోస్టాఫీసు ఏర్పాటు చేయించారు ఒద్దిరాజు సోదరులు. అయితే పత్రికల పంపిణీ, చందాదారులను చేర్పించే బాధ్యతతో పాటు పోస్టాఫీసు నిర్వహణ భారం కూడా వారే చూడాల్సి వచ్చేది.

పత్రిక నిర్వహణలో రూపకల్పన ఒక బాధ్యత అయితే పంపిణీ మరో ప్రధాన కర్తవ్యం. పత్రికకు వ్యాసాలు పంపే రచయితలను గుర్తించి, వారిని వ్యాసాలు పంపవలసిందిగా ప్రోత్సహించాలి. చందాదారులను చేర్పించగలిగితేనే పత్రిక మనుగడ సాధ్యమవుతుంది. అందుకే వ్యాస రచయితలను వ్యాసాలు పంపవలసిందిగా కోరేందుకు, చందాదారులను చేర్పించేందుకు హైదరాబాదు, వరంగల్లు, ఖమ్మం, సూర్యాపేట, మానుకోట, నల్గొండ, మహబూబ్ నగర్, విజయవాడ, బందరు, చెన్నై తదితర ప్రాంతాలకు సోదరులిద్దరూ స్వయంగా వెళ్ళేవారు. అలా పత్రికకు వార్తలు, వ్యాసాల కొరత లేకుండా చూసుకున్నారు. చందాదారులను చేర్పించారు. దాంతో రెండో ఏడాదికి ముద్రించవలసిన ప్రతుల సంఖ్య వెయ్యికి చేరింది.

శేషాద్రి రమణ కవులు, హరిబాపయ్య, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి వేంకట చలపతిరావు, నామపల్లి కృష్ణారావు, చకిలం శ్రీనివాస శర్మ మొదలైన ప్రముఖ రచయితలు ‘తెనుగు’ పత్రిక కోసం రచనలు అందించారు. వారితో పాటు చాట్రాతి లక్ష్మీ నరసమాంబ, పందింటి సత్యవతీబాయి, పాపమ్మ మొదలైన రచయిత్రుల రచనలనూ ‘తెనుగు’ పత్రిక ప్రచురించింది. నల్లగొండ షబ్నవీసు వేంకట రామనరసింహారావు నిర్వహించిన ‘నీలగిరి’ పత్రికను కూడా తొలినాళ్ళలో ఈ విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయం లోనే ముద్రించారు. తర్వాత ఆ పత్రిక ముద్రణ నల్లగొండకు మారింది.

ఆరు సంవత్సరాలు ఇనుగుర్తిలో ‘తెనుగు’ పత్రికను ఒద్దిరాజు సోదరులు నిర్వహించారు. అయితే రజాకార్లు చేసిన దాడిలో అనేక విలువైన గ్రంథాలు తగలబడ్డాయి. ముద్రణా యంత్రాలు ధ్వంసమయ్యాయి. దాంతో మనస్తాపానికి గురైన ఒద్దిరాజు అన్నదమ్ములిద్దరూ పత్రిక నిర్వహణను వరంగల్లుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దేవులపల్లి వేంకట చలపతి రావు, తూము వరదరాజులు మొదలగు వారి సహకారంతో పత్రిక నిర్వహణను వరంగల్లుకు మార్చారు. అయితే అక్కడ కొద్దికాలమే నడిచింది. ఆరేళ్ల స్వల్ప కాలమే ‘తెనుగు’ పత్రిక కొనసాగినా, ఆ పత్రిక అందించిన స్ఫూర్తి నేటి పత్రికలకూ మార్గదర్శకత్వం వహిస్తుంది. పాలకవర్గాల దాష్టీకాలకు వ్యతిరేకంగా జనచైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. సమకాలీన సమాజంలో పత్రికల పాత్రకు దిశానిర్దేశం చేసే చోదకశక్తిలా నిలుస్తుంది. వెలుగుబాట పరుస్తుంది.

-డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు,
9441046839

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page