నానమ్మ ఇందిరాగాంధీ నుంచి కొనసాగుతుంది
అందుకే చెల్లిని కూడా తీసుకుని వొచ్చా
దేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తుంది
సిఎం కేసీఆర్ తెలంగాణను దోచుకు తిన్నాడు
నరేంద్ర మోదీ ఆయనకు మద్దతిస్తున్నాడు
అన్యాయంగా నాపైన 24 కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకి
అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతి నెల రూ. 2500…రూ.500 కే గ్యాస్ సిలిండర్
భూపాలపల్లి రోడ్ షోలో రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రాంతంతో తమది రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధమని ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ బంధం తన నాన్నమ్మ స్వర్గీయ ఇందిరాగాంధీ నుంచి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. కుటుంబ బంధాన్ని పరిచయం చేసేందుకే తన చెల్లి ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకువచ్చానని అన్నారు. అబద్ధాలు చెప్పేందుకు, మోసం చేసేందుకు తెలంగాణకు రాలేదని, ఇక్కడి ప్రజల కన్నీళ్లను తుడిచి, నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలు నింపేందుకే తాను వొచ్చానని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలు, రైతులు, నిరుద్యోగుల బాధలు తీరుతాయని చెప్పారు. బిజెపి, బీఆర్‌ఎస్‌లను ఓడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఉదయం భూపాలపల్లి నియోజకవర్గంలోని ఘనపురం మండలం చెల్పూర్‌లో బైక్ ర్యాలీ రాష్ట్రంలో మూడు రోజుల బస్సు యాత్రలో భాగంగా రెండవ రోజు చల్పూర్ నుంచి కాటారం వరకు బైక్ ర్యాలీ జరిగింది. అంతకు ముందు రోజు రాత్రి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చెల్పూర్ లోని జెన్కో గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు బైక్ ర్యాలీని ప్రారంభించారు. వేలాదిగా నిరుద్యోగులు ఈ బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ వెంట పాల్గొన్నారు. ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వద్దకు చేరగానే అక్కడ రోడ్ షోలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంకుశంగా పాలిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నదన్నారు. ఆ పోరాటంలో భాగంగా తనపైన 24 కేసులు మోపారని రాహుల్ గాంధీ తెలిపారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నదన్నారు. దేశంలో నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోగా పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. వంట గ్యాస్ ధరను కేంద్రం పెంచడంతో మహిళలు అవస్థలు ఎదుర్కుంటున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం అబద్ధాలను చెబుతూ, నిజాలను వెల్లడించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అవినీతిని ప్రశ్నించేందుకు మోదీ వెనకాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంతులేని అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టుతో ఇక్కడి రైతులకు అదనంగా వొచ్చిన లాభం ఏమీ లేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు అనుకూల వాతావరణ ఉన్నదని తప్పకుండా అధికారంలోకి వొస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తాము అధికారంలోకి రాగానే అనేక పథకాలను, ఇచ్చిన హామీలను వరుస క్రమంలో నెరవేరుస్తున్నామని, ఎలాంటి అనుమానం ఉన్నా వెళ్లి పరిశీలించుకోవచ్చునని చెప్పారు. మహిళలు యువకులు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని, అధికారంలోకి రాగానే వాళ్ల కష్టాలను నెరవేరుస్తామని చెప్పారు. ఉద్యమంలో అసువులు బాసిన వీరులను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కెసిఆర్ దోచుకున్న తెలంగాణ సంపద ఎక్కడికి వెళ్లిందో పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుండి రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ మంథని నియోజకవర్గం కాటారం మండలానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు మధుయాష్కిగౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పిసిసి సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.