తెలంగాణపై పట్టుకే బిజెపి కార్యవర్గ సమావేశాలు

తెలంగాణపై పట్టు సాధించడంలో భాగంగానే భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ ఏర్పాటుచేస్తోంది. దీంతో కమలనాథుల్లో కూడా జోష్‌ ‌పెరిగింది. గడచిన రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణ లో అధికారం లోకి రావాలని• లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌వొచ్చినప్పటినుండి ఈ విషయంలో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతున్నది. ఏదో ఒక వరుస కార్యక్రమాలతో ఆయన ప్రజల సమక్షంలో ఉండేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాను చేపట్టే కార్యక్రమాలకు తరచు జాతీయ స్థాయి నాయకులను తీసుకురావాడంద్వారా స్థానిక కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కొనసాగిస్తున్నారాయన. పాదయాత్రలని, ప్రజా సంగ్రామ యాత్రలపేరున ప్రధాని నరేంద్రమోదీ మొదలు, హోంమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలను ఇప్పటికే ఆయన పలు దఫాలుగా రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ అధికార టిఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. పార్టీ సభ్యత్వ నామోదు విషయంలోనైతేనేమీ, రాబోయే ఎన్నికలకు ముందస్తుగానే అభ్యర్థులను ఖారారు చేయడం ద్వారా భవిష్యత్‌లో రెబల్స్‌గా ఎవరూ పోటీ చేడకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా ఆయన చేపట్టిన దీక్షలు, అందుకు ప్రభుత్వ నిర్బంధాలను చవిచూస్తూ తమకోసమే పోరాటం చేస్తున్నాడని ప్రజలు అనుకునే విధంగా పరిస్థితులను తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఎక్కడ వెనకబడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు తాజాగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ నడిబొడ్డున రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత సన్నిహితం అయ్యేప్రయత్నాలు చేస్తున్నారు. వొచ్చేనెల ఒకటి నుండి మూడు రోజుల పాటు ఇక్కడ జరిగే సమావేశాల్లో భాగంగా చివరి రోజున పరేడ్‌ ‌గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు.

ఈ సమావేశాల సందర్భంగా మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు బిజెపి పాలిత పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలు, పార్టీ సీనియర్‌ ‌నాయకులు దాదాపుగా మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు వొచ్చే అవకావాలున్నాయి. ఈ సమావేశాలతో తెలంగాణలో తమ పార్టీని సుస్థిత పర్చుకోవాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. అందుకే చివరిరోజున ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కనీసం పది లక్షలకు తక్కువ కాకుండా జనాన్ని పోగు చేయాలని బిజెపి ప్రణాళికను రూపొందించుకుంది. అందుకు రాష్ట్రం నలుమూలలనుండి పోలింగ్‌ ‌బూత్‌ ‌స్థాయిలో కనీసం ముప్పై మందికి తక్కువ కాకుండా సమావేశంలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. ఇందుకు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన నాయకులకు పూర్తిస్థాయి బాధ్యలను అప్పగించింది. దీనివల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు బిజెపిని పరిచయం చేయడం, వారిలో చైతన్యాన్ని కలిగించాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మరో సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతుండడంతో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీలుకూడా తమ వంతు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ పార్టీలన్నీ తెలంగాణనే లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తుంటే, తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం జాతీయ రాజకీయల వైపు ఎక్కువగా శ్రద్ద చూపిస్తున్నారు.

బిజెపి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో ఆయన ఇప్పటికే దేశ యాత్రలు చేస్తున్న విషయం తెలియందికాదు. అయితే ఆయన పట్టువీడని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ చెప్పుకోదగినంతగా విజయవంతం కావడంలేదనడానికి ఆయన ఇటీవల కాలంలో చాలా •సైలెంట్‌గా ఉండటమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే బిజెపి దూకుడు చూసి ఆయన జాతీయ రాజకీయలపై వెనక్కు తగ్గుతున్నాడని బిజెపి వర్గాలు విమర్శిస్తుండగా, బిజెపి అధికారంవైపు దూసుకు వొచ్చే క్రమంలో రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేయడానికైనా వెనుకాడటంలేదని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేంద్రంనుండి రాష్ట్రానికి 7800 కోట్లు రూపాయల నిధులు విడుదల కావాల్సి ఉండగా కావాలని కేంద్రం తొక్కిపెడుతున్నదని ఆ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వాస్తవంగా రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సకాలంలో చెల్లించలేకపోతున్నది.

వెసులు బాటు కాకపోవడంతో రైతుల దగ్గర యాసంగిలో కొన్న ధాన్యానికి కూడా వెంటనే డబ్బులు చెల్లించలేకపోతున్నది. వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు సుమారుగా ఇరవై అయిదు వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్న వార్తలు వొస్తున్నాయి. దానికి తగినట్లుగా కొత్త పించన్లను అందించాలన్నా మరింత డబ్బు అవసరం. కేంద్రం ఇవ్వదు, అడుక్కోనివ్వదనట్లు, అప్పు చేసుకోవడానకి కూడా అనుమతి ఇవ్వడంలేదన్న ఆరోపణ ఉంది. ఒక విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్బంధం చేసి, ప్రజలముందు దోషిగా నిలబెట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నది టిఆర్‌ఎస్‌ ‌నాయకుల వాదన. కాగా ప్రస్తుత టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి ఉన్న బలాన్ని విశ్లేషిస్తే ఆ పార్టీకి పెద్దగా భయపడాల్సిందేమీ లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏదిఏమైనా జూలై మూడవ తేదీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page