తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు కీలక నిర్ణయం

సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ ‌నియంత్రణకు సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ ‌వాడకం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు గ్రామస్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్‌కు సమీపంలో ఉన్న దుకాణాల్లో కూడా డ్రగ్స్ ‌పెడ్లర్లు అమ్మకాలు మొదలు పెట్టారు. ఇలా రోజుకో రూపంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించే ముఠాలను అరికట్టడం పోలీసులకు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఒకట్రెండు డిపార్టమెంట్లతో దీన్ని నిర్మూలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ప్రజల సహకారంతో ఈ సమస్యకు చెక్‌ ‌పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓవైపు పెడ్లర్లపై ఉక్కుపాదం మోపుతూనే వినియోగదారులను అరికట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొస్తోంది.

ప్రభుత్వ టీచర్లు, ప్రిన్సిపాల్‌, ‌రెవెన్యూ అధికారులను ఇందులో భాగస్వాములను చేయనుంది. వీరితోపాటు వైద్యులు, పారామెడికల్‌ ‌స్టాఫ్‌, ఆశా వర్కర్లు, అంగన్వాడీలతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. వీళ్లకు డ్రగ్స్ ‌కంట్రోల్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామస్థాయిలో పోలీస్‌ ‌సర్వేలెన్స్‌కు దూరంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారి వివరాలు సేకరించనున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, వాటికి దూరంగా ఉండేలా చేయనున్నారు. ఇలా దశల వారీగా వివిధ ప్రణాళికలు అమలు చేసి డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పబ్బులు, ఇతర ప్రైవేటు పార్టీలపై దాడులు చేస్తోంది. అమ్మేవారిపై నిఘా పెట్టారు. కొంటున్న వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. విమానాశ్రయం, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు విస్తృతం చేశారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులందరితోపాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page