మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఉత్సహంగా ముందుగా సాగుతుంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో కలిస నడుస్తున్నారు.
రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించిన సమయంలో.. లంబాడ కళారూపాలతో ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఎమ్మెల్యే సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాహుల్‌తో కలిసి కాలు కదిపారు. ఇక, పాదయాత్ర చేస్తున్న సమయంలో.. సమస్యలపై ప్లకార్డులు చూపిస్తున్న వారివద్దకు రాహుల్ గాంధీ వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక, పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కూడా రాహుల్ గాంధీ ముచ్చటించారు.
ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్స్, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ జేఏసీ సభ్యులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ స్కాలర్స్, వర్సిటీ జేఏసీ సభ్యులు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. ఇక, పలువురు పారిశుద్ద్య కార్మికులు రాహుల్ గాంధీతో కలిసి ఫొటో దిగారు.
రాహుల్ గాంధీ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు పూనమ్ కౌర్ కొద్దిసేపు కలిసి నడిచారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీతో మాట్లాడినట్టుగా పూనమ్ కౌర్ చెప్పారు. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని అన్నారు. చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌ను కోరానని చెప్పారు.
ఇక, ఏనుగొండ జంక్షన్ వద్ద రాహుల్ లంచ్ బ్రేక్ తిరిగి సాయంత్రం 4 గంటల తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం జడ్చర్ల ఎక్స్ రోడ్ జంక్షన్‌లో జరిగే కార్నర్ మీటింగ్‌లో గాంధీ ప్రసంగిస్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాయంత్రం రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారు.