ప్రశాంతంగా మొదలైన టెన్త్ పరీక్షలు
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే23: రెండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :45 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ హాల్ లోకి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రెండేళ్ల విరామం తరవాత విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల సందడి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో పరీక్షలను ఏర్పాటు చేశారు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ కలిపి మొత్తం 5,09,275 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి అనుమతించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని కూడా అనుమతించారు. పరీక్షా కేంద్రాలకు గంటముందే చేరుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు.