- లైఫ్‌సైన్సెస్ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్
- తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్ చర్చలు
- విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్ పిలుపు
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్ మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలో తన అమెరికా పర్యటనలో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీలైన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ (జేఅండ్‌జే), జీఎస్‌కే అధిపతులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. మొదట ఫైజర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్‌డెర్మాట్‌తో చర్చలు జరిపారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్‌రంగం పురోగతిని వివరించారు. అలాగే, ఇండియాలో హెల్త్‌కేర్, ఫార్యాస్యూటికల్ రంగానికి సంబంధించి ఫైజర్ కంపెనీ వ్యూహాలు, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉవే స్కోన్‌బెక్‌తో కూడా సమావేశమయ్యారు.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో హైదరాబాద్ ఎకోసిస్టంను తెలియజేసేందుకు మంత్రి కేటీఆర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మథాయ్ మామెన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మరో అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్‌క్లైన్(జీఎస్‌కే) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆగం ఉపాధ్యాయ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను వివరించారు. మంత్రి వారితో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన తన విజన్‌ని పంచుకున్నారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడంలో సహాయపడే సాధ్యమైన మార్గాలు, కార్యక్రమాలపై సూచనలను కోరారు. ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఏషియా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్‌తోపాటు ఇన్నోవేషన్‌పై దృష్టి సారించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫార్మా కంపెనీల అధిపతులు మెచ్చుకున్నారు. ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు.
విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్ పిలుపు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న విద్యా యజ్ఞంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. న్యూజెర్సీలోని ఎడిషన్ టౌన్ షిప్‌లో మన ఊరు మన బడి ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేపట్టిన విద్యా యజ్ఞానికి తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, వాటి రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. అది నిజానికి మన ఊరు – మన బడి కార్యక్రమం కాదు.. విద్యా యజ్ఞం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ యజ్ఞంలో భాగంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం రూ. 7,300 కోట్లు కేటాయించారని తెలిపారు.
ఎన్‌ఆర్‌ఐలు కూడా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కేటీఆర్ కోరారు. 21 ఏండ్ల క్రితం ఏర్పడ్డ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాలు ఇంకా కుదుటపడలేదు. కానీ ఏడున్నరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. లక్షా 24 వేలు ఉంటే.. ఏడేండ్ల తర్వాత రూ. 2 లక్షల 78 వేలకు పెరిగిందన్నారు. జీఎస్‌డీపీ 2014లో రూ. 4.9 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ. 11.54 లక్షల కోట్లకు చేరిందన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో పురోగతి సాధించింది. భౌగోళికంగా అతిపెద్ద 11వ రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 12వ రాష్ట్రం. దేశానికి ఆదాయం సమకూరుస్తున్న అతి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 4వ రాష్ట్రంగా ఉందని ఆర్బీఐ నివేదికలో వెల్లడైందన్నారు. ఏడున్నరేండ్ల రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతుందన్నారు. తాను చెప్పేవన్నీ సొంత గణాంకాలు కాదు.. మోదీ గణాంకాలు అని కేటీఆర్ స్పష్టం చేశారు.