తెలంగాణలో బిజెపి స్వయంకృతం .. !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఉధృత ప్రచారమే చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించడం తగ్గించి కేసీఆర్‌ అవినీతిపై విమర్శలు సంధించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నివ్వడం ద్వారా, జనసేనతో పొత్తు ఏర్పర్చుకోవడం ద్వారా తెలంగాణలో కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగం, ధరణి పేరిట అక్రమాలు, ఫామ్‌ హౌజ్‌లో విశ్రమించడం, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పటి వరకూ బీజేపీ నేతలెవరూ ఇలాంటి విమర్శలు చేసినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కాని ప్రధాని తన బహిరంగ సభల ద్వారానూ, రోడ్‌ షోల ద్వారానూ మళ్లీ బీజేపీకి ఒక ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఇదంతా బిఆర్‌ఎస్‌, బిజెపిల అవగాహన మాత్రమే అనుకున్నారు.

తెలంగాణలో అధికారం వొస్తుందన్న ప్రతిసారీ బిజెపి తప్పులో కాలేస్తోంది.తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా పార్లమెంటులో మద్దతు తెలిపి తనవంతు పాత్ర పోషించినా దానిని పెద్దగా ప్రచారం చేసుకోలేక పోయింది. ఆనాడు సుష్మాస్వరాజ్‌ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ఏర్పాటయ్యేది కాదు. విపక్షంగా తాము మద్దతు ఇస్తున్నామన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేసుకోలేక పోయారు. సరికదా ఏదో ఓ సందర్భంలో తెలంగాణ విషయంలో మోదీ విషం కక్కుతూ వొచ్చారు. తల్లిని చంపి బిడ్డను రక్షించారనో..విభజన సరిగా జరగలేదనో అంటూ వొచ్చారు. దీనికితోడు విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఇచ్చిన ఏ హావిూని సక్రమంగా అమలు చేయలేదు. ఇకపోతే వీటన్నింటిని పట్టించుకోకున్నా ప్రజలు మెల్లగా బిజెపి వైపు మొగ్గుచూపారు. కెసిఆర్‌ పాలనను అంతమొందించాలంటే బిజెపికి మాత్రమే సాధ్యమని నమ్మారు. ఈ క్రమంలో తెలంగాణ లో బిజెపిదే తదుపరి అధికారం అన్న దిశగా పార్టీ ఎదిగింది. బండి సంజయ్‌ నియామకం తరవాత పాదయాత్రలతో ప్రజల్లో ఊపు తెచ్చారు. తెలంగాణలో పార్టీ ఎదుగుతున్న క్రమంలో ఒక్కొక్కరే పార్టీలో చేరారు. కెసిఆర్‌ను ఢీకొనే దమ్ము బిజెపికి మాత్రమే ఉందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకున్న తరుణంలో ఎన్నికల ముందు బిజెపి నాయకత్వం తీసుకున్న నిర్ణయం పార్టీని అధ:పాతాళానికి తొక్కింది.

పరుగలు తీస్తున్న బండికి బ్రేకులు వేసుకుంది. నాయకత్వాన్ని మార్చడంతో పాటు..బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టింది. తాము అధికారంలోకి రావడమెలా అన్నదానిని పక్కన పెట్టి కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేయడమేలా అన్న సూత్రంతో బిఆర్‌ఎస్‌తో లోపాయకారి ఒప్పందం చేసుకుందన్న ప్రచారం ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. అదే తెలంగాణ ఎన్నికల్లో ఫలితం చూపింది. ప్రజలు బిజెపిని నమ్మలేదు. కేవలం 8 సీట్లతో సరిపుచ్చారు. ముందుగా ఉన్న పద్దతిలో బండి నడిచివుంటే తెలంగాణలో అధికారంలోకి రాకున్నా..కనీసం 20కి తక్కువగా సీట్లు వొచ్చేవి కావని విశ్లేషణలు ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటులో బిజెపి నిర్ణయాత్మకంగా ఉండేది. బండి సంజయ్‌ ఉన్ననాటి ఊపు కొనసాగివుంటే పార్టీలో చేరిన వారెవ్వరూ పార్టీని వీడేవారు కాదు. పార్టీని అధికారం దగ్గరకు తీసుకుని వెళ్లి ఉండేవారు. పార్టీలో చేరిన వారే కాకుండా కొత్తగా అనేకులు పార్టీలో చేరేందుకు సిద్దమయినా..ఇది కెసిఆర్‌తో కొట్లాడే పార్టీ కాదని నిర్ణయించుకున్నారు. లిక్కర్‌ కేసులో ఊకదంపుడు ఉపన్యాసాలు, కెసిఆర్‌ అవినీతిపై ఒక్కటంటే ఒక్క చర్య తీసుకోక పోవడం వంటి చర్యలన్నీ బిజెపిని తెలంగాణలో ఎదగకుండా చేశాయి. దీనిని కాంగ్రెస్‌ అంది పుచ్చుకుందనే చెప్పాలి. రేవంత్‌ రెడ్డి ఈ అవకాశాన్ని బాగా మలచు కున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కెసిఆర్‌ అవినీతిపై నేరుగా పోరాటానికి దిగింది. కాంగ్రెస్‌ మాత్రమే ప్రజాస్వామ్య పునరద్దరణ చేయగలదన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించింది. బిజెపి వైఫల్యంతో కెసిఆర్‌ వ్యతిరేకతను అందిపుచ్చుకున్న కాంగ్రెస్‌ అనూహ్యంగా దూసుకుని వొచ్చింది. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని ప్రచారం చేసింది. దిల్లీ మద్యం స్కామ్‌లో కవితను ఎందుకు అరెస్ట్‌ చేయలడం లేదని సూటిగా ప్రశ్నించింది. లిక్కర్‌ స్కాంలో ఫోన్లు మార్చి డబ్బు తీసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు కూడా జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వొస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించినా పట్టించుకోలేదు.

ఇది మోదీ గ్యారెంటీ, ఈ గ్యారెంటీకి తిరుగుండదని చెప్పినా ప్రజల్లో విశ్వాసం కలగలేదు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగి ఆదిత్యానాథ్‌, నడ్డా తదితరులంతా ప్రచారం చేసినా బిజెపి కేవలం ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. గోషామహల్‌లో మాత్రం రాజాసింగ్‌ సొంత ప్రతిష్టతో గెలుస్తున్నారు. ఇలా ఎందుకు చేశామన్న ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కిషన్‌ రెడ్డి ఓటమి చెందారు. తరవాత సికింద్రాబాద్‌ నుంచి ఎన్నికై కేంద్రమంత్రి పదవిని పొందారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం అంబర్‌పేటలో పట్టు సాధించుకోలేక పోయారు. అలాగే బిజెపి నుంచి రాజ్యసభ పొందిన లక్ష్మణ్‌ది ముషీరాబాద్‌ నియోజకవర్గం. ఈ రెండుచోట్లా బిజెపి ఘోర పరాజయం పొందింది. ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఉధృత ప్రచారమే చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించడం తగ్గించి కేసీఆర్‌ అవినీతిపై విమర్శలు సంధించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నివ్వడం ద్వారా, జనసేనతో పొత్తు ఏర్పర్చుకోవడం ద్వారా తెలంగాణలో కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగం, ధరణి పేరిట అక్రమాలు, ఫామ్‌ హౌజ్‌లో విశ్రమించడం, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పటి వరకూ బీజేపీ నేతలెవరూ ఇలాంటి విమర్శలు చేసినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

కాని ప్రధాని తన బహిరంగ సభల ద్వారానూ, రోడ్‌ షోల ద్వారానూ మళ్లీ బీజేపీకి ఒక ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఇదంతా బిఆర్‌ఎస్‌, బిజెపిల అవగాహన మాత్రమే అనుకున్నారు. అందుకే బిజెపిని ఆదరించలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి రోజుల్లో మోదీ రంగంలోకి దిగడం వల్ల కూడా బీజేపీకి ప్రయోజనం కలగలేదు. బిజెపికి చెందిన ముఖ్యనేతలు ఓటమి చెందడం చూస్తే… ప్రధాని మోదీని కూడా ప్రజలు పట్టించుకోలేదు. పార్టీ ఎంపిలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావులు ఓడారు. పార్టీలో కీలకనేతగా ఉన్న ఈటల రాజేందర్‌ రెండు పడవల్లో కాలు పెట్టి కొట్టుకు పోయారు. ఇలా ఎదుకు జరిగిందో ఆత్మవిమర్శ చేసుకుంటుందా అన్నది చూడాలి. అయితే జరిగిన నష్టం వల్ల ఇప్పట్లో కోలుకోవడం మాత్రం కల్ల. పార్టీని ఒక్కొక్కరే వీడుతున్నా పట్టించుకోక పోవడం కూడా బిజెపి అసమర్థతను బయటపెట్టింది. ఇప్పటికైనా కెసిఆర్‌ అవినీతికి పాల్పడివుంటే..లిక్కర్‌ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉంటే దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేఛ్చను ఇవ్వాలి. వాటి పనిని అవి చేసుకు నేలా చేయాలి. దార్యప్తు సంస్థలను ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఉపయోగించుంటే ..అది ఎప్పటికీ ప్రమాదమే. అధికారం శాశ్వాతం కాదని గుర్తించుకోవాలి.

-ప్రజాతంత్ర డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page