తెలంగాణలో రైతు రాజ్యాన్ని తీసుకువొస్తాం

రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆదరించాలి
కొడుకును సిఎం చేయడం తప్ప…రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు
సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయి
రైతు సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వొచ్చిన తర్వాత తెలంగాణలో రహదారుల కోసం లక్షా 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించారని.. వ్యవసాయ, పారిశ్రామిక, ఉత్పత్తి, విదేశీ విధానం, దేశంలో మౌలిక వసుతుల కల్పన లాంటి అనేక అంశాల్లో గత తొమ్మిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని మనం గుర్తుకు తెచ్చుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ…ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక అనేక మార్పులు వొచ్చాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గతంలో కరెంట్‌ కొరత ఉండేదని, ఇప్పుడు ఏ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సరిపోను కరెంట్‌ ఈ దేశంలో ఉన్నదని, విద్యుత్‌ కోతలు లేని దేశాన్ని మోదీ ఆవిష్కరించారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఉత్తర భారత్‌ నుంచి దక్షిణ భారత్‌ వరకు కేంద్ర ప్రభుత్వం పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసిందని, తెలంగాణలో కూడా మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మోదీ అనంతరం జాతికి అంకితం చేశారన్నారు. నీటిపై సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను తెలంగాణలో మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారన్నారు. ఒకప్పుడు డబ్బులు ఇచ్చినా.. ఎరువుల కోసం రాత్రింభవళ్లు క్యూలైన్లలో ఉండాల్సి వొచ్చేదని, తెల్లవారు జామున 4 గంటలకే రైతులు వొచ్చి చెప్పులు క్యూ పెట్టే వారని, కానీ ఈ రోజు ఆ పరిస్థితి మారిందని, రైతులకు సరిపోను ఎరువులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. యూరియా ఎక్కువ వాడితే..భూమి దెబ్బతింటుందని భావించి నీమ్కోటెడ్‌ యూరియాను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 250 రూపాయలు ఒక బస్తాకు రైతు ఇస్తే..కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 వేల వరకు సబ్సిడీ భరిస్తున్నదని, ఒక ఎకరానికి ఒక ఏడాదికి మోదీ ప్రభుత్వం 20 వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నదన్నారు. ఎరువుల కొరత లేనిది నూతన భారతవానిని మోదీ ఆవిష్కరించారని, మన రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారని అన్నారు. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామగుండం వొస్తే..మన ముఖ్యమంత్రి ఫామ్‌ హౌజ్‌లో ఉన్నారని, మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వొస్తే.. కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నారని విమర్శించారు. తన కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన తప్ప..తెలంగాణ అభివృద్ధి మీద కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. వ్యవసాయం బాగుపడాలంటే..సాగునీరు రావాలని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం జరిగిందని కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్‌ పేరుతో.. 30 వేల కోట్ల బడ్జెట్‌ను లక్షా 50 వేల కోట్లకు తీసుకువెళ్లారని, అంతా చేస్తే..ఆ ప్రాజెక్టుకు ఫీసిబిలిటి లదని, కరెంట్‌ బిల్లులు కట్టలేని పరిస్థితి వొచ్చిందని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. వొచ్చే నీళ్లకు, పండే పంటకు పొంతన లేదని, స్వయంగా ముఖ్యమంత్రే ఫామ్‌ హౌజ్‌ ఇంజనీర్‌గా మారి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను ముంచారని ఆయన విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 20 వేల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఉన్న ప్రాజెక్టును..57 వేల కోట్లకు పెంచారని, ఒక్క పంపు హౌజ్‌ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారని విమర్శించారు కిషన్‌ రెడ్డి. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ సుప్రీమ్‌ కోర్టుకు వెళ్లిందని, కేసు విత్‌ డ్రా చేసుకోమని కేంద్రం చెబితే.. ఏండ్ల తరబడి జాప్యం చేసింది కేసీఆరేనని, ఆయన కారణంగానే కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందని అన్నారు. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం కావాలంటే నదుల అనుసంధానం కావాలని, ఏటా గోదావరి నీళ్లు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నయని, ఆ నీటిని రైతులకు సాగునీరుగా ఇవ్వాలని దేశంలో చర్చ జరుగుతున్నదని కిషన్‌ రెడ్డి తెలిపారు. గోదావరి కృష్ణా లింక్‌ చేస్తే..గ్రావిటీ ద్వారా తాగు, సాగునీరు అందించే అవకాశం ఉన్నదని, కానీ సీఎం కేసీఆర్‌కు అది ఇష్టం లేదని, ఎందుకంటే ప్రాజెక్టులు కడితే కమీషన్లు వొస్తాయని అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని, అందుకే కేసీఆర్‌కు నదుల అనుసంధానం ఇష్టం లేదని, మనం కోరుకున్న తెలంగాణకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఓ తెలంగాణ సమాజమా? అర్థం చేసుకో.. అంటూ ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో వేల కోట్లతో వోటర్లను నాయకులను కొని తన కొడుకును సీఎం చేయాలని కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో కెసిఆర్‌ పగటి కలలు కంటున్నారన్నారని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉన్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే అప్పు ఇచ్చిందని, విద్యుత్‌ ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వమే అప్పు ఇచ్చిందని, 9 ఏండ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అండగా నిలబడుతున్నదని కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11 ప్రాజెక్టులు డబ్బులు లేక పూర్తి కాక ఆగిపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకున్నదని అన్నారు. 2014లో రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది రూ.3,400 కోట్లు అయితే, మోదీ ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుల పంట ఉత్పత్తులను కొంటున్నదని కిషన్‌ రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేయడమే తప్ప..రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ప్రకృతి విపత్తులతో పంట పోతే..రైతు తీవ్రంగా నష్టపోతాడని, పంటల బీమా పథకం దేశం మొత్తం అమలు అవుతుంటే… కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ వాటా ప్రీమియం కట్టకపోవడంతో.. తెలంగాణలో పంటల బీమా పథకం అమలు కావడం లేదని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వొచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని, పంటల బీమా అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పంటకు కనీస మద్దతు ధర ధాన్యంకు 60 నుంచి 80 శాతం పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, రైతు ఆదాయం రెట్టింపు చేసే క్రమంలో కేంద్రం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, అండగా ఉండాలని కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా రైతులను కోరారు. తెలంగాణలో రైతు రాజ్యాన్ని బీజేపీ నేతృత్వంలో తీసుకువొస్తామని, కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో వ్యవసాయం చేస్తూ.. ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నా అంటాడని, ఎలా వొస్తున్నాయో చెప్పడని ఎద్దేవా చేశారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం తప్ప..తెలంగాణ ఏమై పోయినా కేసీఆర్‌కు ఏం ఫర్వాలేదన్నట్టు వ్యవహరిస్తున్నాడని కిషన్‌ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page