తెలంగాణా ఆత్మ గౌరవాన్ని కొనలేరు ..!

  • దిల్లీ బ్రోకర్లు కొందామని చూశారు
  • వారికి మన ఎంఎల్‌ఏలు తగిన బుద్ధి చెప్పారు
  • అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చింది
  • వొడ్లు కొనని మోదీకి ఎంఎల్‌ఏలను కొనడం చేతవుతుంది
  • కార్పొరేట్ల జేబులు నింపడానికే మోదీ ప్రభుత్వం పని చేస్తుంది
  • వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం
  • ఆలోచించి వోటేస్తే మునుగోడు, రాష్ట్రం, దేశం బాగు పడుతుంది
  • గెలిపిస్తే మునుగోడును కడుపులో పెట్టుకుంటా
  • చండూరు బహిరంగ సభలో సిఎం కెసిఆర్‌
  • ‌కెసిఆర్‌ ‌వెంట నలుగురు ఫామ్‌ ‌హౌజ్‌ ఎంఎల్‌ఏలు

నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌కొందరు దిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని చూస్తే మన ఎమ్మెల్యేలు వారికి చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పారని సిఎం కెసిఆర్‌ అన్నారు. వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి..ప్రభుత్వాలను కూల్చాలని మోదీ చూస్తున్నారని దుయ్యబట్టారు.తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ ‌రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు రాజకీయాలకు కావాలన్నారు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా..వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలని, వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ ‌సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొల్లగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా..అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి..రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్‌ ‌ప్రశ్నించారు.

మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వొచ్చి ఇదంతా చేస్తారా అని, వారు ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నారని అన్నారు. వాళ్లు ఆఫర్‌ ‌చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వొచ్చాయో విచారణ జరగాలని, దీని వెనుక ఎవరు ఉన్నరో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదని మండిపడ్డారు సిఎం కెసిఆర్‌. 75 ‌సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా..ఆలోచించాలని కోరుతున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆదివారం మునుగోడు ఎన్నిక ప్రచారం సందర్భంగా చండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడుతూ…మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చిందని, అయినా ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారని అన్నారు. ప్రజలు ఆలోచించుకుని వోట్లు వేయాలని, ఒళ్లు మర్చిపోయి వోటేస్తే ఇల్లు కాలిపోతుందని కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా హెచ్చరించారు. దోపిడీదారులు మాయమాటలు చెబుతూనే ఉంటారని, కరిసే పామును మెడలో వేసుకుంటామా? అని ప్రశ్నించారు. చేనేతలపై కేంద్రం 5శాతం జీఎస్టీ విధించి చేనేతలకు ఏ ప్రధాని చేయని దుర్మార్గం ప్రధాని మోదీ చేశారన్నారు.

బీజేపీకి ఎందుకు వోటేయాలని చేనేతలు ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క వోటు కూడా పోవద్దని, చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రజలు కాపాడుకోవాలని వోటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ల జేబులు నింపడానికే బీజేపీ పనిచేస్తుందన్నారు. విద్యుత్‌ ‌సంస్కరణ ముసుగులో మీటర్లు పెడతారట. ఇళ్లల్లో మీటర్లు కూడా ముప్పై వేలు పెట్టి మార్చుకోవాలట. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమే అంటూ కేసీఆర్‌ ‌హెచ్చరించారు. మీటర్లు పెట్టి కొంపలు ఆర్పుకుందామా…లేక మీటర్లు పెట్టమన్నవారికి మీటర్లు పెడదామా ంటూ ప్రశ్నించారు. బిజెపికి వోటేస్తే విద్యుత్‌ ‌చట్టాలకు అంగీకరించినట్టేనని హెచ్చరించారు. ఇప్పుడు కనుక బిజెపికి డిపాజిట్‌ ‌వొచ్చినా తనను పక్కకు నెట్టేస్తారన్నారు. పెట్టుబడిదారులను మనమే ప్రోత్సహించినట్లవుతుందని, తమ బలం బలగం ప్రజలేనని, వారి ండ లేకపోతే తాము ఎవరి కోసం పోరాడాలని ప్రశ్నించారు.

ప్రపంచంలో ఏ దేశానికైనా అనుకూలమైన భూమి భారత దేశానికి  ఉందని, అటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని కెసిఆర్‌ అన్నారు. తెలంగాణ మాదిరాగానే దేశాన్ని చేయాలనే  సంకల్పంతో పుట్టిందే బిఆర్‌ఎస్‌ అని, భారత దేశానికి పునాది వేసే అవకాశం మునుగోడుకే దక్కిందని, తమ అభ్యర్థి ప్రభాకర్‌ ‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ప్రోత్సహించాలని కెసిఆర్‌ ‌వోటర్లను కోరారు. గెలిపిస్తే మునుగోడును కడుపులో పెట్టుకుంటానని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని, మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు సరిపోలేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వడ్లు కొనని మోదీ సర్కార్‌కు కోట్లు ఇచ్చి ఎంఎల్‌ఏలను కొనడం మాత్రం చేతనవుతుందని ఎద్దేవా చేశారు. రూపాయి విలువ పతనానికి కారణం ఎవరని ప్రశ్నించారు. గ్యాస్‌, ‌పెట్రోల్‌ ‌ధర పెరిగిందని, నిత్యావసరాల ధరలూ పెరిగాయని, చేనేతపై కూడా జిఎస్‌టి వేశారని, వీటిపై పోరాడాలని ప్రజలకు కెసిఆర్‌ ‌పిలుపునిచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page